సినిమాలెందుకు హిట్టవుతాయి?: ‘జయం’ చివరి భాగం


సినిమాలెందుకు హిట్టవుతాయి?: ‘జయం’ చివరి భాగం

(16వ తేదీ భాగం తరువాయి)

తోటి విద్యార్థితో ప్రణయం

ఐదారేళ్ల తర్వాత సుజాత ఇంటర్మీడియేట్ పూర్తిచేసి కాలేజీలో బీకాం చేరింది. తోటి విద్యార్థి అయిన వెంకటరమణ అలియాస్ వెంకట్ ప్రేమలో పడింది. ఈ ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించే సన్నివేశాల కల్పనలో దర్శకుడు చాతుర్యాన్ని ప్రదర్శించాడు. రైల్వే స్టేషన్‌ని అందుకు ఉపయోగించుకున్నాడు. సుజాత, వెంకట్ ఇద్దరూ కాలేజీకి వెళ్లాలంటే ఒకే రైలెక్కాలి.

సుజాత వస్తున్నదంటే గుర్తు ఘల్లు ఘల్లుమనే ఆమె కాలి పట్టీలు. ఆ పట్టీలకూ ప్రాముఖ్యం ఉంది. వాటిని ఆమెకిచ్చింది రఘు తండ్రి. కాబోయే కోడలికి ప్రేమతో ఇచ్చిన పట్టీలవి. వాటిని వేసుకొని కళ్లముందు కూతురు తిరుగుతుంటే సుజాత తండ్రి నరసింహ “ఇలా నా కూతురు పట్టీలు వేసుకొని పరిగెత్తుతూ ఉంటే..” అంటూ ఎక్కడికో వెళ్లిపోతుంటాడు తరచూ.

అలాంటి పట్టీలు లేకుండా ఓసారి సుజాత కనిపించేసరికి “పట్టీలు లేకుండా వొచ్చారేంటండీ?” అనడిగాడు వెంకట్. “నా ఇష్టం. నా సంగతి నీకెందుకయ్యా. వెళ్లవయ్యా వెళ్లూ..” అంటూ కుడిచేతిని పొడవుగా చాచి, స్టైల్‌గా చెబుతుంది సుజాత. ఈ సినిమాలో సుజాత కేరెక్టర్ మేనరిజం అది. ఆమె “వెళ్లవయ్యా వెళ్లూ” అన్న ప్రతిసారీ ముచ్చటేసింది ప్రేక్షకులకి. ఆ మేనరిజంతో సుజాత పాత్రని వాళ్లకి బాగా చేరువ చేశాడు తేజ.

పట్టీల గురించి అలా ఆరా తీసి మాట్లాడేసరికి వెంకట్ ఆమెకి చేరువయ్యాడు. ఆమెకి “ఐ లవ్ యు” చెప్పడానికి వెంకట్ అర్ధరాత్రి రెండో ఆట చూసి, స్నేహితులతో కలిసి సుజాత ఇంటికెళ్లే సన్నివేశాన్ని దర్శకుడు కల్పించిన తీరు కుర్రకారుని బాగా ఆకట్టుకుంది. నడుముకి తాడు కట్టుకొని ఇంటి పైకప్పు ఎక్కి, అక్కడి పెంకులు తీసి, వెంకట్ లోపలికి దిగితే, మరోవైపు బయట ఆ తాడు పట్టుకొని లాగుతుంటారు అతడి మిత్రబృందం.

తాడు సాయంతో గాల్లో తేలుతూనే సుజాతని లేపి “ప్రియతమా తెలుసునా నా మనసు నీదేననీ” అంటూ పాడతాడు వెంకట్. ఆ పాట ఎంత హిట్టో, ఆ సీనూ అంత హిట్టు. ప్రి క్లైమాక్స్‌లోనూ రఘుతో సుజాతకి బలవంతపు పెళ్లి జరుగుతుంటే, ఇలాగే తాడుతో సుజాత గదిలో దిగి, ఆమెని తనతో తీసుకుపోతాడు వెంకట్.

గోడమీది రాతలకు ఎంత బలమో..!

రఘు పాత్రని ఎంత నీచంగా చూపించాలో అంత నీచంగానూ చూపించి, సుజాత అతన్ని ద్వేషించడంలో, వెంకట్‌ని ప్రేమించడంలో ఎలాంటి తప్పూ లేదని ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయడంలో ‘జయం’ పొందాడు తేజ. కంటికి నదురుగా కనిపించిన పని మనిషితో శారీరక సంబంధం ఏర్పరచుకున్న రఘు మొదట సుజాతతో పెళ్లి వొద్దన్నాడు. కానీ ఆమెని చూసి, ఆ అందానికి దాసోహమై, చేసుకుంటే బలవంతంగానైనా సుజాతనే చేసుకోవాలనే స్థితికి వచ్చాడు.

అందుకే తాను వెంకటరమణ అనే అతన్ని ప్రేమించాననీ, అతడ్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాననీ చెప్పిన సుజాతతో “వాడ్ని ప్రేమించినా ఫర్వాలేదు. కడుపు తెచ్చుకున్నా ఫర్వాలేదు. పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి” అన్నాడు. అక్కడ్నించి అతడికీ, వెంకట్‌కీ మధ్య సుజాత కోసం యుద్ధం మొదలైంది. ఫిజికల్‌గా రఘుతో పోలిస్తే చాలా బలహీనుడు వెంకట్. ముఖాముఖి పోరులో రఘుని గెలవడం దాదాపు అసాధ్యం.

ఆ సంగతి తెలిసీ మాటలతో రెచ్చగొట్టాడు వెంకట్. ఆ మాటలు నోటితో చెప్పినవి కావు. గోడమీది రాతలతో చెప్పినవి. రఘు ఇంట్లోనే తొలిసారి “సుజాతతో నీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఎందుకంటే నేను, సుజాత ప్రేమించుకున్నాం కాబట్టి – వెంకట్” అని రాసి, పక్కనే ఓ చేతి గుర్తు పెడతాడు వెంకట్. ఇంకోసారి “నీ పెళ్లి ఆపడమే నా ధ్యేయం – వెంకట్” అనీ, మరోసారి “నిన్ను సుజాత మెడలో తాళి కట్టనివ్వను. నువ్వు చూస్తుండగానే నేను కట్టి ప్రేమంటే ఏమిటో చూపిస్తా – వెంకట్” అనీ రాస్తాడు.

వెంకట్ నడిపే ఈ మైండ్‌గేం కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఆ రోజుల్లో ఈ సినిమా పబ్లిసిటీకి గోడల మీద ఇలాంటి రాతల్నే ఉపయోగించి, జనంలోకి ఆ సినిమా బాగా వెళ్లడంలో విజయం సాధించారు.

‘వెళ్లవయ్యా వెళ్లూ’ మెస్మరిజం!

సినిమాలెందుకు హిట్టవుతాయి?: ‘జయం’ చివరి భాగం

దాదాపు అరగంటసేపు నడిచే క్లైమాక్స్.. ముందే చెప్పుకున్నట్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నదంటే ‘జెండాపై కపిరాజు’ విశేషమే! హీరోయిన్ చిన్ననాటి సన్నివేశాల్ని బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించడంలో పెద్దగా ప్రయోజనం లేకపోయినా అదీ బాగానే అనిపించింది. ప్రధాన పాత్రధారులందరూ పాత్రల స్వభావానికి తగ్గట్లు నటించి మెప్పించారు. వాస్తవం చెప్పుకోవాలంటే వెంకట్ పాత్రలో నితిన్ చెప్పుకోదగ్గ ప్రతిభని ప్రదర్శించలేకపోయినా, అతడి పాత్ర జనాన్ని ఆకట్టుకున్నదంటే.. అమాయకమైన అతడి చూపుల వల్లే. పల్లెటూరి కుర్రాడి పాత్రకి అతికినట్లు సరిపోయాడు.

ఇక అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించింది సుజాత పాత్రలో జీవించిన సదా. “వెళ్లవయ్యా వెళ్లూ” అనే మేనరిజంతో ఆమె చిన్నా, పెద్దా తేడా లేకుండా అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఆ పాత్ర అలా రాణించడంలో గాయని సునీత ఆమెకిచ్చిన వాయిస్ తోడ్పడింది.

ఆమె తర్వాత రఘు పాత్ర చేసిన గోపీచంద్‌కి ఎక్కువ మార్కులు పడతాయి. రఘు పాత్రలోని కూరత్వాన్ని అతను బాగా ప్రదర్శించాడు. అతని రూపం దానికి బాగా సాయపడింది. వెంకట్ స్నేహితుడు ఆలీబాబాగా సుమన్‌శెట్టి ముచ్చటగా ఉన్నాడు. కాకపోతే అతనికీ, లెక్చరర్ జ్ఞానసరస్వతిగా నటించిన షకీలాకీ మధ్య సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. సెక్స్ కామెడీకి చోటు కల్పించే అలవాటు తేజ బలహీనత. పైగా దాన్ని లెక్చరర్లు, స్టూడెంట్ల మీద చిత్రీకరించడం!

సుజాత చెల్లెలిగా నటించిన బేబి శ్వేత కూడా ఆకట్టుకుంది. అక్షరాల్ని తిప్పిరాసే అలవాటున్న అమ్మాయిగా కథకి ఉపయోగపడే పాత్ర ఆమెది. మిగతావాళ్లు పరిధుల మేరకు రాణించారు.

దర్శకుడిగానే కాక కథనందించి, మాటలు, స్క్రీన్‌ప్లే కూడా సమకూర్చిన తేజ అన్నిట్లోనూ సక్సెస్ అయితే, ఆయన బాటలో మిగతా టెక్నీషియన్లూ రాణించారు. ఆర్పీ పట్నాయక్ కట్టిన బాణీలకి కులశేఖర్ రాసిన పాటలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. రీరికార్డింగూ ఎఫెక్టివ్‌గా వచ్చింది. సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణ పనితనం ‘జయం’కి కీలకమైంది. మొత్తానికి దర్శకుడిగా అదివరకే విజయాలు సాధించిన తేజ నిర్మాతగా సాధించిన తొలి ‘జయం’ ఇది.

(అయిపోయింది)

– బుద్ధి యజ్ఞమూర్తి

సినిమాలెందుకు హిట్టవుతాయి?: ‘జయం’ చివరి భాగం | actioncutok.com

More for you: