సరికొత్త శీర్షిక: సినిమాలెందుకు హిట్టవుతాయి?


పల్లెటూరి ప్రేమకథకి ‘జయం’

సరికొత్త శీర్షిక: సినిమాలెందుకు హిట్టవుతాయి?
Nithin and Sada

అతి తక్కువమంది పాత తారలతో, అతి ఎక్కువమంది కొత్త తారలతో రూపొందించిన ‘జయం’ చిత్రం మొత్తం తెలుగునాడుని, ప్రత్యేకించి కాలేజీ కుర్రకారుని ఓ ఊపు ఊపేస్తుందని ఎవరైనా ఊహించారా! నిజంగానే ‘జయం’ ప్రభంజనం అనూహ్యం. నితిన్ అనే ఒక బక్కపలుచని కుర్రాడు, సదా అనే అందమైన ఓ కొత్తమ్మాయితో దర్శకుడు తేజ పెద్ద మ్యాజిక్కే ఛేశాడు.

అప్పటికే ‘చిత్రం’, ‘నువ్వు నేను’ (మధ్యలో ‘ఫ్యామిలీ సర్కస్’ వంటి ఫ్లాప్ ఉన్నా) విజయాలతో మంచి ఫాంలో ఉన్న తేజకి ‘జయం’ తెచ్చిన పేరు సామాన్యమైంది కాదు. ‘నువ్వు నేను’తోటే అందర్నీ తనవేపు తిప్పుకున్న ఆయన ఈ సినిమాతో హీరోలందరికీ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు.

ఇక తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్ కావడంతో నితిన్, సదా.. ఇద్దరూ యువతరానికి ఆరాధ్య తారలయిపోయారు. ముఖ్యంగా సుజాత పాత్రలో సదా ప్రదర్శించిన అభినయం, ఆమె హావభావాలు చాలామందికి ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉన్నాయి.

అర్ధనగ్న ప్రదర్శన చేస్తేనే హీరోయిన్ అనే నమ్మకం ఉన్న కాలంలో లంగా, ఓణీ డ్రస్సుల్లో సదా అందచందాలు కుర్రకారుని ఎంతగా అక్కట్టుకున్నాయో! అప్పట్లో చుడీదార్లకే పూర్తిగా అలవాటుపడిన అమ్మాయిలు ఒక్కసారిగా లంగా, ఓణీల మీద మోజు పెంచేసుకుని, ఎక్కడ చూసినా ఆ డ్రస్సులతోటే ముచ్చటగా కనిపించిన సంగతి అందరికీ జ్ఞాపకమే. ‘జయం’ లేదా ‘సదా’ డ్రస్సులుగా వాటికి పేరొచ్చింది.

అంతటి ఎఫెక్టుని కలిగించిన ఆ సినిమా మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల మధ్యలోనే తయారై ఇరవై కోట్ల రూపాయలకు మించి వసూళ్లని సాధించి, ట్రేడ్ పండితుల్నే విస్మయానికి గురిచేసింది. ఇక మ్యూజికల్‌గా ‘జయం’ది అసాధారణ విజయం. ఆడియో సేల్స్‌లో చాలా పెద్ద సినిమాల రికార్డుల్ని తుడిచిపెట్టిన సినిమా ఇది.

ఈ చిత్రానికి బాణీలనందించిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ప్రకారం “ఇప్పటివరకు ‘అన్నమయ్య’ తర్వాత బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ ‘జయం’. అప్పట్లోనే 25 లక్షల ఆడియో క్యాసెట్లు అమ్ముడుపోయాయి.” అప్పట్లో ఏ టీ బంకు దగ్గర చూసినా “రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చె సిన్నదో” పాటే.

దాంతో పాటు “బండి బండి రైలుబండీ వేళకంటూ రాదూలెండీ” (తర్వాత “బండి బండి రైలుబండీ ఎంత మంచి రైలుబండీ”గా మార్చారు.), “అందమైన మనసులో ఇంత అలజడెందుకో”, ‘ప్రియతమా తెలుసునా నా మనసు నీదేననీ”, “ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా” పాటలు కూడా పాపులర్ అయ్యాయి.

చిన్నతనంలోనే పెళ్లి ఖాయమనుకున్న ఓ అమ్మాయి, అబ్బాయి స్కూలు రోజుల్లోనే దూరమయ్యాక, కాలేజీ రోజుల్లో ఆ అమ్మాయి మరో అబ్బాయితో ప్రేమలో పడితే, మొదటి అబ్బాయి సీనులోకి వచ్చి ఆమెని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని యత్నిస్తే, ప్రేమికులు అతణ్ణి ఎలా ఎదుర్కొన్నారనే లైను మీద రూపొందించిన ‘జయం’ సాధించిన విజయం నిజానికి ఆశ్చర్యకరం.

ఈ సినిమాకి ముందు గోపీచంద్ ‘తొలివలపు’తో హీరోగా పరిచయమై, పరాజయం చవిచూశాడు. హీరోగా మరో అవకాశం రాని రోజుల్లో తేజ ఇందులోని విలన్ రఘు పాత్రను ఆఫర్ చేశాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గోపీచంద్ ఆ పాత్రలో అమోఘంగా రాణించాడు. ఫలితంగా ఉత్తమ విలన్‌గా నంది అవార్డును దక్కించుకున్నాడు.

నిజానికి ఈ పాత్రకి మొదటగా ఎంపికైంది సచిన అనే ముంబై నటుడు. “అతను ఓ రోజు షూటింగ్‌లోనూ పాల్గొన్నాడు. కానీ అతని పర్ఫార్మెన్స్ తేజకి తృప్తి కలిగించలేదు. అతన్ని తీసేసి ఆ పాత్రకి చాలామందిని పరీక్షించాడు. చివరికి గోపీచంద్ ఆ పాత్రకి సరిపోతాడని అతన్ని తీసుకున్నాడు. అందుకు తగ్గట్లే రఘు పాత్రకి పూర్తి న్యాయం చేశాడు గోపి. ‘జయం’ లేకపోతే అతను లేడు” అని చెప్పారు ఆర్పీ పట్నాయక్.

అదేవిధంగా సుజాత పాత్రకి మొదట అనుకున్న తార ప్రత్యూష. ఆమె దాదాపు ఓకే అయిపోయి షూటింగ్ మొదలు పెడదామనుకునేంతలోనే ఆమె దుర్మరణం పాలై, ఆ అవకాశం సదాకి లభించింది. ఆమె ఆ పాత్రకి ఏ స్థాయిలో న్యాయం చేకూర్చిందో తెలిసిందే.

(రేపు రెండో భాగం)

– బుద్ధి యజ్ఞమూర్తి

సరికొత్త శీర్షిక: సినిమాలెందుకు హిట్టవుతాయి? | actioncutok.com

Trending now: