సినిమాలెందుకు హిట్టవుతాయి?: ప్రభాస్‌ను స్టార్‌గా మార్చిన ‘వర్షం’ (సంపూర్ణ విశ్లేషణ)


సినిమాలెందుకు హిట్టవుతాయి?: ప్రభాస్‌ను స్టార్‌గా మార్చిన ‘వర్షం’ (సంపూర్ణ విశ్లేషణ)

సినిమాలెందుకు హిట్టవుతాయి?: ప్రభాస్‌ను స్టార్‌గా మార్చిన ‘వర్షం’ (సంపూర్ణ విశ్లేషణ)

తారాగణం: ప్రభాస్, త్రిష, గోపీచంద్, ప్రకాశ్ రాజ్, సుధ, చంద్రమోహన్, షఫీ, సునీల్, రాజేశ్, జయప్రకాశ్ రెడ్డి, వేణుమాధవ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గుండు హనుమంతరావు

కథ: వీరు పోట్ల

స్క్రీన్‌ప్లే: ఎమ్మెస్ రాజు

సంభాషణలు: పరుచూరి బ్రదర్స్

పాటలు: సీతారామశాస్త్రి

సంగీతం: దేవి శ్రీప్రసాద్

సినిమాటోగ్రఫీ: ఎస్. గోపాలరెడ్డి

కూర్పు: కె.వి. కృష్ణారెడ్డి

స్టంట్స్: పీటర్ హెయిన్స్

కళ: అశోక్

డీటీఎస్ మిక్సింగ్: మధుసూదన్ రెడ్డి

నిర్మాత: ఎమ్మెస్ రాజు

దర్శకత్వం: శోభన్

బేనర్: సుమంత్ ఆర్ట్స్

విడుదల తేది: 14 జనవరి 2004

2004 సంక్రాంతికి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో రెండు అగ్ర హీరోల సినిమాలు. చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అంజి’ ఒకటైతే, బాలకృష్ణ కథానాయకుడిగా జయంత్ సి. పరాంజీ రూపొందించిన ‘లక్ష్మీ నరసింహా’ రెండోది. ఇవికాక అదివరకు రెండే సినిమాలు చేసిన యువ హీరో ప్రభాస్‌తో శోభన్ రూపొందించిన ‘వర్షం’ సైతం సంక్రాంతి బరిలో నిలిచింది.

ఈ మూడింటిలో ‘వర్షం’ సూఒపర్ హిట్టయి, ప్రభాస్ కెరీర్‌కి ఊపిరిలూదింది. స్కూళ్లకు, కాలేజీలకు సెలవులిచ్చిన జనవరి 14 నుంచి 18 వరకు ఐదు రోజులు థియేటర్లలో ప్రేక్షకుల వర్షం కురిసింది. ఈ సినిమాపై నిర్మాత ఎమ్మెస్ రాజు పెట్టిన సొమ్మ మొత్తం ఒక్క నైజాం ఏరియాలోనే వసూలయ్యింది. 68 కేంద్రాల్లో 100 రోజులు నడిచిన ఈ సినిమా ద్వారా పంపిణీదారులు భారీగా లాభపడ్డారు.

‘వర్షం’ కంటే ముందు ప్రభాస్ ‘ఈశ్వర్’, ‘రాఘవేంద్ర’ సినిమాలు చేశాడు. వాటితో మొదటిది యావరేజ్‌గా ఆడితే, రెండోది ఫ్లాపయింది. హిట్ తప్పనిసరైన స్థితిలో వచ్చిన ‘వర్షం’ నిజంగానే ప్రభాస్‌ని సంతోష వర్షంలో ముంచేసింది. ఈ సినిమాతో ఇటు యువతనీ, అటు మాస్ ప్రేక్షకుల్నీ సమానంగా మెప్పించి స్టార్ హీరో అనిపించుకున్నాడు.

హావభావ ప్రదర్శనలో అంత పరిణతి చూపించకపోయినా, త్రిషతో చేసిన రొమాంటిక్ సన్నివేశాల్లో, గోపీచంద్‌తో చేసిన యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. ‘వర్షం’లో హీరో హీరోయిన్ల మధ్య తీసిన సన్నివేశాలు మంచి అనుభూతిని కలిగించాయంటే అందుకు ప్రభాస్, త్రిష మధ్య వర్కవుట్ అయిన కెమిస్ట్రీతో పాటు శోభన్ దర్శకత్వ ప్రతిభ కూడా ఓ కారణం.

గోపీచంద్ విలనిజాన్ని క్రూరంగా చూపించి, అందుకు తగినట్లు ప్రభాస్ హీరోయిజాన్ని ఎస్టాబ్లిష్ చెయ్యడంలో స్క్రీన్‌ప్లే తన వంతు పాత్ర పోషించింది. దేవి శ్రీప్రసాద్ సంగీతానికి, సీతారామశాస్త్రి సాహిత్యం తోడవడంతో పాటలన్నీ జనాదరణ పొందాయి. మొత్తానికి టాప్ హీరోల సినిమాల్ని వెనక్కి నెట్టి, సంక్రాంతి బరిలో వసూళ్ల ‘వర్షం’ కురిసింది.

ప్రధాన ఆకర్షణ త్రిష

సినిమాలెందుకు హిట్టవుతాయి?: ప్రభాస్‌ను స్టార్‌గా మార్చిన ‘వర్షం’ (సంపూర్ణ విశ్లేషణ)

సుమారు 22 యేళ్ల క్రితం హిందీలో వచ్చి సూపర్ హిట్టయిన అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ సినిమా ‘తేజాబ్’ చిత్రంతో కథాపరంగా పలు పోలికలున్న ఈ చిత్రంలో తమిళమ్మాయి త్రిష అందచందాలు, అభినయం ప్రధాన ఆకర్షణ అనేది నిజం. కథకి ప్రధానమూ, కీలకమూ అయిన శైలజ పాత్రలో త్రిష అమితంగా ఆకట్టుకుంది. మున్ముందు అగ్ర నాయికగా ఆమె పేరు తెచ్చుకునే క్రమంలో పునాది అయిన చిత్రం ‘వర్షం’ అనేది నిస్సందేహం.

ఇక మహేశ్‌తో చేసిన ‘బాబీ’ వంటి డిజాస్టర్ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమై తన కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్న శోభన్ (ఇప్పుడు దివంగతుడు).. ఊహించని విధంగా వచ్చిన రెండో అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకున్నాడు. కథని ఆయన నడిపిన తీరు దీనికి నిదర్శనం.

కీలకమైన శైలజ పాత్ర చుట్టూ తిరిగే మూడు పాత్రల్ని అతను సమర్థంగా మలిచాడు. కూతుర్ని ఉపయోగించుకొని కోటీశ్వరుడై పోవాలని తపించే నికృష్ట తండ్రిగా ప్రకాశ్ రాజ్, తాను మోజుపడ్డ శైలజని బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాలనుకొనే కిరాతకుడైన కామందుగా గోపీచంద్, ప్రేమించిన యువత అపార్థాలతో దూరమైనా, విలన్ల బారి నుంచి ఆమెని రక్షించే సాహస యువకునిగా ప్రభాస్.. ‘వర్షం’లో కనిపిస్తారు.

టైటిల్‌కి తగినట్లు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించడానికీ, పొరపొచ్చాలతో విడిపోవడానికీ, తిరిగి ఒక్కటవడానికీ ‘వర్షం’ నేపథ్యంగా నిలుస్తుంది. ‘తేజాబ్’లో లేనిదీ, ‘వర్షం’లో ఉన్నదీ వర్షమే.

కథా సంగ్రహం

రైలుబండిలో ప్రయాణిస్తూ ‘వర్షం’ సన్నివేశంతో ఒకరికొకరు పరిచయమైన వెంకట్ (ప్రభాస్), శైలజ (త్రిష) వరంగల్లో అదే వర్షంలో కాకతాళీయంగా కలుసుకొని ప్రేమలో పడతారు. నైజాం ప్రాంతంలో తిరుగులేని భూస్వామి అయిన భద్రన్న (గోపీచంద్) సైతం శైలజ మీద మోజుపడి, ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. శైలజ తండ్రి రంగారావు (ప్రకాశ్రాజ్) డబ్బు కోసం ఎంతటి దగుల్బాజీ పనికైనా సిద్ధపడే వ్యక్తి.

ఆ డబ్బు కోసం తన కూతుర్ని భద్రన్నకిచ్చి చేయడానికి ఆనందంగా ఒప్పుకుంటాడు. వెంకట్, శైలజ మధ్య అపార్థాలు సృష్టించి, వాళ్లని వేరుచేస్తాడు. అయితే శైలజకి సినీ హీరోయిన్ అవకాశం రావడంతో ఆ ఫీల్డులో కోట్లు సంపాదించవచ్చనే దురాశతో హైదరాబాద్కు మకాం మారుస్తాడు. దీంతో భద్రన్న హైదరాబాద్ వచ్చి శైలజని బలవంతంగా ఎత్తుకుపోతాడు.

అతడి చెరనుంచి శైలజని వెంకట్ ఎలా విడిపించాడు, ప్రేమికులిద్దరూ ఎలా కలిశారన్నది మిగతా కథ.

హీరో అనేవాడి రూపం ఎలా ఉండాలనేదానికి మంచి ఉదాహరణగా ‘వర్షం’లో మనకు కనిపిస్తాడు ప్రభాస్. అతడి రూపమే అతడి ఎస్సెట్. మునుపటి రెండు చిత్రాలతో పోలిస్తే నటన పరంగా కాస్త మెరుగైనా డైలాగ్ మాడ్యులేషన్లో లోపాలు కనిపిస్తాయి. ఎమోషనల్ సీన్లలో కృష్ణంరాజును అనుకరిస్తున్న ఛాయలు స్పష్టం (ఆ తర్వాత ఆ ఛాయల నుంచి బయటపడ్డాడు).

యాక్షన్ సన్నివేశాల్లో జీవించాడు. హీరోయిన్ త్రిష గురించి ముందే చెప్పుకున్నాం. విలన్గా గోపీచంద్ తన సామర్థ్యాన్ని మరో మారు ఈ చిత్రం ద్వారా తెలియజేశాడు. అతడి కళ్లు, ముఖం క్రూరత్వాన్ని గొప్పగా ప్రదర్శించాయి. ‘ఖడ్గం’ ద్వారా టెర్రరిస్టుగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్న షఫీ ఇందులో గోపీచంద్ సవతి తమ్మునిగా బాగా చేశాడు.

ఏ పాత్రనైనా సునాయాసంగా చేయగల ప్రకాశ్రాజ్ ఇందులో పాత్రానుసారం ఓవర్ యాక్షన్ చేశాడు, ‘తేజాబ్’లో అనుపం ఖేర్ తరహాలోనే.

ఒకట్రెండు మైనస్సులు

సినిమాలెందుకు హిట్టవుతాయి?: ప్రభాస్‌ను స్టార్‌గా మార్చిన ‘వర్షం’ (సంపూర్ణ విశ్లేషణ)

సినిమాలో మెయిన్ మైనస్ ఏమంటే.. ఎక్కువ భాగం వరంగల్ నేపథ్యంలో కథని నడిపించడంలో తొలి సగం చక్కని ప్రతిభ చూపిన దర్శకుడు శోభన్.. రెండో సగంలో దాన్ని కొనసాగించలేకపోవడం. ఇందుకు స్క్రీన్ప్లేదే ప్రధాన బాధ్యత. ఆ స్క్రీన్ప్లేని నిర్మాత ఎమ్మెస్ రాజు స్వయంగా రూపొందించాడు కనుక రెండో సగంలో కథ నడక మందగించడానికి ఆయనదే పాత్ర.

క్లైమాక్స్ మరీ సాగదీసినట్లనిపిస్తుంది. ఆఖరి పాట పూర్తయిన పావుగంటలోగా శుభం కార్డు పడినట్లయితే కొంత బిగువు చేకూరి ఉండేది.

హీరో హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు దర్శకుడిలోని భావుకతని పట్టిస్తాయి. కానైతే వాళ్లిద్దరూ విడిపోవడానికి కారణమయ్యే అంశాలు పేలవంగా ఉన్నాయి. వాళ్లిద్దరికీ మనస్పర్థలు వచ్చేది ఇగో సమస్య వల్ల. అందుకోసం సృష్టించిన సన్నివేశాలు కన్విన్సింగ్గా లేవు. సినిమాకి హీరోయిన్ త్రిష ఒక ఎస్సెట్. తర్వాత మరో ఎస్సెట్ సంగీతం.

దేవి శ్రీప్రసాద్ సంగీతం పాటల్లో ఎంత బాగా ఆకట్టుకుందో, సన్నివేశాల మూడ్ని ఎలివేట్ చెయ్యడంలో అంత బాగా కుదిరింది. సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన పాటల చిత్రీకరణ మనసుని హత్తుకుంటుంది. ముఖ్యంగా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ పాట చిత్రీకరణ సినిమా మొత్తానికి హైలైట్. ‘లంగా ఓణీ నేటితో రద్దయిపోనీ’, ‘నైజాం పోరీ’, ‘కోపమా నా పైనా’, ‘మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం’, పాటలు కూడా బాగా ఆదరణ పొందాయి.

సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాలరెడ్డి కెమెరా పనితనం గురించీ చెప్పుకోవాల్సిందే. వర్షం సన్నివేశాల్నీ, పాటల్నీ, ఎమోషనల్ సీన్లనీ, నైట్ ఎఫెక్ట్ సీన్లనీ చిత్రీకరించడంలో ఆయన కెమెరా చాలా చురుగ్గా పనిచేసింది.

‘తేజాబ్’తో పోలికలెన్నో!

హిందీ సినిమా ‘తేజాబ్’కీ, ‘వర్షం’కీ నడుమ సారూప్యతల సంగతికొస్తే – అందులో డబ్బు కోసం అనుపం ఖేర్ తన కూతురు మాధురీ దీక్షిత్ చేత స్టేజి డాన్సులు ఆడిస్తే, ఇందులో త్రిషని సినీ హీరోయిన్ చేస్తాడు ప్రకాశ్ రాజ్. అందులో మాధురి మీద మనసుపడ్డ కిరణ్ కుమార్ ఆమెని కిడ్నాప్ చేసి, తనదాన్ని చేసుకోవాలని చూస్తే, ఇందులోనూ గోపీచంద్ అదేపని చేస్తాడు.

కిడ్నాప్కి ముందు అనిల్ కపూర్, మాధురి మధ్య మనస్పర్థలొచ్చి విడిపోయినట్లే ఇందులోనూ ప్రభాస్, త్రిష విడిపోతారు. క్లైమాక్స్ కూడా సేం టు సేం. కాకపోతే అందులోని చుంకీ పాండే పాత్ర ఇందులో లేదు. 29 ఏళ్ల క్రితమే ‘తేజాబ్’కి రీమేక్గా తెలుగులో వెంకటేశ్, రాధ జంటగా ‘టూ టౌన్ రౌడీ’ సినిమా వచ్చి ఫ్లాపయింది. అయితే ‘వర్షం’ హిట్టవడానికి అందులోని చిత్రీకరణ తీరు, ప్రభాస్ మ్యాన్లీనెస్, హీరోయిన్ త్రిష,  దేవి శ్రీప్రసాద్ సంగీతం ప్రధాన పాత్రలు వహించాయి. రెండో సగం ఇంకొంచెం క్రిస్పీగా ఉన్నట్లయితే మరింత పెద్ద హిట్టయ్యేది.

ప్రభాస్ చాలా కష్టపడ్డాడు: ఎమ్మెస్ రాజు

సినిమాలెందుకు హిట్టవుతాయి?: ప్రభాస్‌ను స్టార్‌గా మార్చిన ‘వర్షం’ (సంపూర్ణ విశ్లేషణ)

అప్పటివరకు వరంగల్ నేపథ్యంలో ఎవరూ తీయని కొత్త తరహాలో ‘వర్షం’ తీశాం. వరంగల్లోని చారిత్రక కట్టడాల్లో తీసిన హీరో హీరోయిన్ల సన్నివేశాలు సినిమాకి మంచి ఆకర్షణ తెచ్చాయి. అప్పట్లో ‘వర్షం’ అనే టైటిల్ మీద చాలామంది ఏవేవో ఊహాగానాలు చేశారు. అయితే ఇదొక ప్రేమకథకు సంబంధించిన టైటిల్ అని వారు ఊహించలేకపోయారు.

వర్షం వస్తుంది, కొద్దిసేపయ్యాక ఆగుతుంది. కానీ ప్రేమ మాత్రం ఒక్కసారి పుట్టిందంటే ఆగడం అనేది ఉండదు. ఈ అంశాన్నే ‘వర్షం’లో చెప్పాం. వీరు పోట్ల ఇచ్చిన మంచి కథని, పరుచూరి బ్రదర్స్ విస్తరించి రాసిన సంభాషణలు మరింత బలాన్నిచ్చాయి. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్కి సరిపోయిన కథ. అతడికి చక్కటి ఇమేజ్ తెచ్చి బిజీ స్టార్ని చేసింది.

అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. రిస్కీ షాట్స్ చాలా చేశాడు. అతని ఇంట్రడక్షన్ సీనే చాలా రిస్కుతో ఉంటుంది. దాన్ని అవలీలగా చేసి సత్తా చూపాడు.

హీరోయిన్ త్రిష కేరెక్టర్ ఈ చిత్రకథకు ప్రధాన బలం. కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా పర్ఫార్మెన్స్ పరంగా చక్కటి పాత్ర. కథకి ఫ్రెష్నెస్ కావాలన్న ఆలోచనతోటే ఆమెని హీరోయిన్గా తీసుకున్నాం. అలాగే అసహ్యకరమైన పాత్రలో ప్రకాశ్రాజ్ ఎవర్నీ కొట్టడు, హింసించడు. కానీ తన నక్కజిత్తులతో అందర్నీ బోల్తా కొట్టిస్తుంటాడు. ఆ పాత్రను తను తప్ప ఇంకెవ్వరూ న్యాయం చెయ్యలేరన్నంత బాగా చేశాడు.

భద్రన్నగా దుష్టపాత్రలో గోపీచంద్ నటన అద్భుతం. సునీల్ బాగా నవ్వించాడు. దర్శకుడు శోభన్ ప్రతి ఫ్రేమునీ అనుకున్నది అనుకున్నట్లుగా తీశాడు. అవసరాన్ని బట్టి అక్కడక్కడా గ్రాఫిక్స్ వాడాం. అవి ఆకర్షణగా నిలిచాయి. దేవి శ్రీప్రసాద్ ఇచ్చిన అందమైన బాణీలకి సీతారామశాస్త్రి అంతే అందంగా, గొప్పగా రాశారు. ఏడు పాటల్లో దేన్నీ తీసేయలేం.

(అయిపోయింది)

– బుద్ధి యజ్ఞమూర్తి

సినిమాలెందుకు హిట్టవుతాయి?: ప్రభాస్‌ను స్టార్‌గా మార్చిన ‘వర్షం’ (సంపూర్ణ విశ్లేషణ) | actioncutok.com

More for you: