సినిమాలెందుకు హిట్టవుతాయి?: ప్రభాస్‌ను స్టార్‌గా మార్చిన ‘వర్షం’


సినిమాలెందుకు హిట్టవుతాయి?: ప్రభాస్‌ను స్టార్‌గా మార్చిన 'వర్షం'

సినిమాలెందుకు హిట్టవుతాయి?: ప్రభాస్‌ను స్టార్‌గా మార్చిన ‘వర్షం’

తారాగణం: ప్రభాస్, త్రిష, గోపీచంద్, ప్రకాశ్ రాజ్, సుధ, చంద్రమోహన్, షఫీ, సునీల్, రాజేశ్, జయప్రకాశ్ రెడ్డి, వేణుమాధవ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గుండు హనుమంతరావు

కథ: వీరు పోట్ల

స్క్రీన్‌ప్లే: ఎమ్మెస్ రాజు

సంభాషణలు: పరుచూరి బ్రదర్స్

పాటలు: సీతారామశాస్త్రి

సంగీతం: దేవి శ్రీప్రసాద్

సినిమాటోగ్రఫీ: ఎస్. గోపాలరెడ్డి

కూర్పు: కె.వి. కృష్ణారెడ్డి

స్టంట్స్: పీటర్ హెయిన్స్

కళ: అశోక్

డీటీఎస్ మిక్సింగ్: మధుసూదన్ రెడ్డి

నిర్మాత: ఎమ్మెస్ రాజు

దర్శకత్వం: శోభన్

బేనర్: సుమంత్ ఆర్ట్స్

విడుదల తేది: 14 జనవరి 2004

2004 సంక్రాంతికి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో రెండు అగ్ర హీరోల సినిమాలు. చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అంజి’ ఒకటైతే, బాలకృష్ణ కథానాయకుడిగా జయంత్ సి. పరాంజీ రూపొందించిన ‘లక్ష్మీ నరసింహా’ రెండోది. ఇవికాక అదివరకు రెండే సినిమాలు చేసిన యువ హీరో ప్రభాస్‌తో శోభన్ రూపొందించిన ‘వర్షం’ సైతం సంక్రాంతి బరిలో నిలిచింది.

ఈ మూడింటిలో ‘వర్షం’ సూఒపర్ హిట్టయి, ప్రభాస్ కెరీర్‌కి ఊపిరిలూదింది. స్కూళ్లకు, కాలేజీలకు సెలవులిచ్చిన జనవరి 14 నుంచి 18 వరకు ఐదు రోజులు థియేటర్లలో ప్రేక్షకుల వర్షం కురిసింది. ఈ సినిమాపై నిర్మాత ఎమ్మెస్ రాజు పెట్టిన సొమ్మ మొత్తం ఒక్క నైజాం ఏరియాలోనే వసూలయ్యింది. 68 కేంద్రాల్లో 100 రోజులు నడిచిన ఈ సినిమా ద్వారా పంపిణీదారులు భారీగా లాభపడ్డారు.

‘వర్షం’ కంటే ముందు ప్రభాస్ ‘ఈశ్వర్’, ‘రాఘవేంద్ర’ సినిమాలు చేశాడు. వాటితో మొదటిది యావరేజ్‌గా ఆడితే, రెండోది ఫ్లాపయింది. హిట్ తప్పనిసరైన స్థితిలో వచ్చిన ‘వర్షం’ నిజంగానే ప్రభాస్‌ని సంతోష వర్షంలో ముంచేసింది. ఈ సినిమాతో ఇటు యువతనీ, అటు మాస్ ప్రేక్షకుల్నీ సమానంగా మెప్పించి స్టార్ హీరో అనిపించుకున్నాడు.

హావభావ ప్రదర్శనలో అంత పరిణతి చూపించకపోయినా, త్రిషతో చేసిన రొమాంటిక్ సన్నివేశాల్లో, గోపీచంద్‌తో చేసిన యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. ‘వర్షం’లో హీరో హీరోయిన్ల మధ్య తీసిన సన్నివేశాలు మంచి అనుభూతిని కలిగించాయంటే అందుకు ప్రభాస్, త్రిష మధ్య వర్కవుట్ అయిన కెమిస్ట్రీతో పాటు శోభన్ దర్శకత్వ ప్రతిభ కూడా ఓ కారణం.

గోపీచంద్ విలనిజాన్ని క్రూరంగా చూపించి, అందుకు తగినట్లు ప్రభాస్ హీరోయిజాన్ని ఎస్టాబ్లిష్ చెయ్యడంలో స్క్రీన్‌ప్లే తన వంతు పాత్ర పోషించింది. దేవి శ్రీప్రసాద్ సంగీతానికి, సీతారామశాస్త్రి సాహిత్యం తోడవడంతో పాటలన్నీ జనాదరణ పొందాయి. మొత్తానికి టాప్ హీరోల సినిమాల్ని వెనక్కి నెట్టి, సంక్రాంతి బరిలో వసూళ్ల ‘వర్షం’ కురిసింది.

ప్రధాన ఆకర్షణ త్రిష

సినిమాలెందుకు హిట్టవుతాయి?: ప్రభాస్‌ను స్టార్‌గా మార్చిన 'వర్షం'

సుమారు 22 యేళ్ల క్రితం హిందీలో వచ్చి సూపర్ హిట్టయిన అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ సినిమా ‘తేజాబ్’ చిత్రంతో కథాపరంగా పలు పోలికలున్న ఈ చిత్రంలో తమిళమ్మాయి త్రిష అందచందాలు, అభినయం ప్రధాన ఆకర్షణ అనేది నిజం. కథకి ప్రధానమూ, కీలకమూ అయిన శైలజ పాత్రలో త్రిష అమితంగా ఆకట్టుకుంది. మున్ముందు అగ్ర నాయికగా ఆమె పేరు తెచ్చుకునే క్రమంలో పునాది అయిన చిత్రం ‘వర్షం’ అనేది నిస్సందేహం.

ఇక మహేశ్‌తో చేసిన ‘బాబీ’ వంటి డిజాస్టర్ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమై తన కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్న శోభన్ (ఇప్పుడు దివంగతుడు).. ఊహించని విధంగా వచ్చిన రెండో అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకున్నాడు. కథని ఆయన నడిపిన తీరు దీనికి నిదర్శనం.

కీలకమైన శైలజ పాత్ర చుట్టూ తిరిగే మూడు పాత్రల్ని అతను సమర్థంగా మలిచాడు. కూతుర్ని ఉపయోగించుకొని కోటీశ్వరుడై పోవాలని తపించే నికృష్ట తండ్రిగా ప్రకాశ్ రాజ్, తాను మోజుపడ్డ శైలజని బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాలనుకొనే కిరాతకుడైన కామందుగా గోపీచంద్, ప్రేమించిన యువత అపార్థాలతో దూరమైనా, విలన్ల బారి నుంచి ఆమెని రక్షించే సాహస యువకునిగా ప్రభాస్.. ‘వర్షం’లో కనిపిస్తారు.

టైటిల్‌కి తగినట్లు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించడానికీ, పొరపొచ్చాలతో విడిపోవడానికీ, తిరిగి ఒక్కటవడానికీ ‘వర్షం’ నేపథ్యంగా నిలుస్తుంది. ‘తేజాబ్’లో లేనిదీ, ‘వర్షం’లో ఉన్నదీ వర్షమే.

(ముగింపు భాగం రేపు)

– బుద్ధి యజ్ఞమూర్తి

సినిమాలెందుకు హిట్టవుతాయి?: ప్రభాస్‌ను స్టార్‌గా మార్చిన ‘వర్షం’ | actioncutok.com