ఐపీఎల్ 2019: నాలుగోసారి ఛాంపియన్స్‌గా ముంబై ఇండియన్స్!


ఐపీఎల్ 2019: నాలుగోసారి ఛాంపియన్స్‌గా ముంబై ఇండియన్స్!

ఐపీఎల్ 2019: నాలుగోసారి ఛాంపియన్స్‌గా ముంబై ఇండియన్స్!

మూడు దఫాలుగా రెండేళ్లకోసారి ఐపీఎల్ కప్పు గెలుచుకుంటూ వస్తోన్న ముంబై ఇండియన్స్ జట్టు ఈసారీ ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఒకే ఒక్క పరుగు తేడాతో ముంబై జట్టు నెగ్గింది.

150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్లకు 148 పరుగులే చేసి, కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడి, ట్రోఫీని ముంబై ఇండియన్స్‌కు అప్పగించింది.

ఐపీఎల్ ప్రేమికులకు మస్తు మజా పంచిన ఈ మ్యాచ్‌లో 17 ఓవర్ల వరకు ముంబైదే పైచేయిగా అనిపించినా 18వ ఓవర్‌లో వాట్సన్ వీరవిహారంతో మ్యాచ్ చెన్నై వైపు మొగ్గింది. ముంబై కెప్టెన్ రోహిత్ అనూహ్యంగా 18వ ఓవర్‌ను క్రుణాల్ పాండ్యా చేతికి ఇవ్వడం బెడిసి కొట్టింది. ఆ ఓవర్‌లో మూడు సిక్సులతో వాట్సన్ చెన్నై జట్టును గెలుపు వాకిటకు తెచ్చాడు.

ఇక చెన్నై గెలుపు లాంఛనమే అనుకొనేంతలో బుమ్రా వేసిన 19వ ఓవర్ రెండో బంతికి డ్వేన్ బ్రావో ఔటయ్యాడు. 5వ బంతి వరకు బుమ్రా ఇచ్చింది 5 పరుగులే. కానీ చివరి బంతిని జడేజా ఆడలేకపోయినా వికెట్ కీపర్ క్వింటన్ డీ కాక్ సైతం ఆ బంతిని ఆపలేకపోవడంతో బైస్ రూపంలో 4 పరుగులు వచ్చాయి.

దాంతో సమీకరణం 6 బంతుల్లో 9 పరుగులకు వచ్చింది. ఈ ఓవర్‌లోనూ నాటకీయ పరిణామాలు సంభవించాయి. తొలి 3 బంతులకు 4 పరుగులు వచ్చాయి. 4వ బంతిని మలింగ యార్కర్‌గా వేయగా, వాట్సన్ డీప్ పాయింట్ వైపు ఆడాడు. అయితే లేని రెండో పరుగు కోసం ప్రయత్నించి ఔటయ్యాడు వాట్సన్. పాండ్యా విసిరిన బంతిని చక్కగా అందుకున్న డీ కాక్ వికెట్లను గిరాటేయడంతో వాట్సన్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.

రెండు బంతుల్లో 4 పరుగులు అవసరం కాగా, ఆడిన తొలి బంతికి శార్దూల్ ఠాకూర్ 2 పరుగులు చేశాడు. దాంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఉత్కంఠను అధిగమిస్తూ చివరి బంతిని స్లోబాల్‌గా యార్కర్ వేశాడు మలింగ. అది నేరుగా శార్దూల్ ప్యాడ్లను తాకింది. అంపైర్ అవుటిచ్చేశాడు. ఒక్క పరుగు తేడాతో ముంబై కప్పు గెలిచింది.

ముంబై ప్లేయర్లు సంబరాల్లో మునగగా, చెన్నై ఆటగాళ్లు నిరాశ చెందారు. ముంబై ఇండియన్స్ సహ యజమాని నీతా అంబాని కళ్లల్లో నీళ్లు! వీరోచితంగా పోరాడి 59 బంతుల్లో 80 పరుగులు చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ శ్రమ వృథా అయింది.

ఐపీఎల్ 2019: నాలుగోసారి ఛాంపియన్స్‌గా ముంబై ఇండియన్స్! | actioncutok.com

Trending now: