‘కల్కి’ వర్కవుట్ అవుతుందా?


'కల్కి' వర్కవుట్ అవుతుందా?

‘కల్కి’ వర్కవుట్ అవుతుందా?

డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటిస్తోన్న ‘కల్కి’ సినిమాపై మంచి బజ్ నడుస్తోంది. ‘అ!’ ఫేం ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తొన్న ఈ సినిమా టైటిల్ లోగో, టీజర్, రాజశేఖర్ లుక్ అందర్నీ ఆకట్టుకున్నాయి. సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి.

బిజినెస్ వర్గాలు కూడా దీనికి మినహాయింపు కాదు. పలువురు డిస్ట్రిబ్యూటర్లు ‘కల్కి’ థియేట్రికల్ హక్కుల కోసం ప్రయత్నించారు. చివరకు వాటిని నిర్మాత కె.కె. రాధామోహన్ దక్కించుకున్నారు. వీటి కోసం ఆయన రూ. 10 కోట్లు వెచ్చించారని సమాచారం.

ప్రస్తుత పరిస్థితుల్లో రాజశేఖర్ సినిమా ఇంత మొత్తానికి అమ్ముడవడం ఫిలింనగర్ వర్గాల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనిపై చర్చలు కూడా నడుస్తున్నాయి. హిట్టయిందనే పేరు వచ్చిన రాజశేఖర్ మునుపటి సినిమా ‘పీఎస్‌వీ గరుడవేగ’ వరల్డ్ వైడ్‌గా వసూలు చేసింది రూ. 7.55 కోట్లు!

దానికంటే దాదాపు రెండున్నర కోట్లు అధికంగా పెట్టి ‘కల్కి’ రైట్స్ కొన్నారు రాధామోహన్. ఆయనే సొంతంగా సినిమాని రిలీజ్ చేస్తారా? డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతారా? అనేది రానున్న రోజుల్లో వెల్లడవుతుంది. అయితే రాజశేఖర్ ప్రస్తుత మార్కెట్ విలువ కంటే ఎక్కువ ధరలు పెట్టడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తారా? అని ఫిలింనగర్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

రాధామోహన్ చెప్పిన ధరలకు డిస్ట్రిబ్యూటర్లు రాకపోతే, ఆయనే సొంతంగా సినిమాని విడుదల చేసుకోవాల్సి వస్తుంది. మరి ప్రేక్షకులు రూ. 10 కోట్లకు మించి వసూళ్లను ‘కల్కి’కి అందిస్తారా? అనే సందేహం చాలామందిలో కలుగుతోంది. రాధామోహన్ మాత్రం ‘కల్కి’పై ఎక్కువ నమ్మకమే పెట్టుకున్నారు. ఆయన నమ్మకం ఏ మేరకు నిజమవుతుందో చూడాలి.

  • కార్తికేయ బుద్ధి

‘కల్కి’ వర్కవుట్ అవుతుందా? | actioncutok.com

Trending now: