ఖాళీగా అయినా ఉంటాం కానీ పెద్ద హీరోతోటే చేస్తాం!


ఖాళీగా అయినా ఉంటాం కానీ పెద్ద హీరోతోటే చేస్తాం!
Koratala Siva

ఖాళీగా అయినా ఉంటాం కానీ పెద్ద హీరోతోటే చేస్తాం!

తెలుగులో ఎక్కువమంది అగ్ర దర్శకులు తాము డిమాండ్‌లో ఉన్నంత కాలం అగ్ర హీరోలతోటే సినిమాలు తియ్యాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తుంది. ఎప్పుడైనా రాజమౌళి వంటి ఒకరిద్దరు మాత్రమే మధ్య మధ్యలో ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ లాంటి సినిమాలు తీస్తుంటారు. మిగతావాళ్లంతా పెద్ద హీరోల కోసం ఎంత కాలం వెయిట్ చెయ్యడానికైనా సిద్ధపడతారు కానీ, ఈలోపు చిన్నా పెద్దా తేడా చూసుకోకుండా ఒక మంచి కథతో చిన్న హీరోలు, లేదా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తియ్యాలని కలలో కూడా అనుకోరు. బహుశా అలాంటి సినిమాలు చెయ్యడం వాళ్లకు చేతకాదనుకోవాలేమో!

కథ, సంభాషణల రచయిత నుంచి ‘మిర్చి’తో డైరెక్టర్‌గా మారిన కొరటాల శివ పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపించక మానదు. ఆరేళ్ల క్రితం డైరెక్టర్ అయిన ఆయన నాలుగు సినిమాలు డైరెక్ట్ చేశాడు. అన్నీ పెద్ద హీరోలతోటే. ప్రభాస్‌తో ‘మిర్చి’, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘జనతా గారేజ్’, మహేశ్‌తో ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలు రూపొందించాడు.

వీటిలో చివరి సినిమా ‘భరత్ అనే నేను’ వచ్చి సంవత్సరం గడిచింది. అందులో హీరో మహేశ్ ‘మహర్షి’గా మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. కానీ శివ మాత్రం ఇంతవరకు తన తర్వాతి సినిమాని మొదలు పెట్టనే లేదు. కారణం.. ఆయన ఈసారి డైరెక్ట్ చేయనున్నది మెగాస్టార్ చిరంజీవిని. ఆయన ‘సైరా’ సినిమాని ఎప్పుడు పూర్తి చేస్తాడా.. అని ఎదురుచూస్తూ కూర్చున్నాడే కానీ, ఈలోగా ఒక మధ్యస్థాయి హీరోతోనైనా ఒక సినిమా చేద్దామని అనుకోలేదు శివ.

పెద్ద డైరెక్టర్లతో సినిమా చెయ్యాలని అగ్ర హీరోలతో పాటు మిగతా హీరోలూ ఎదురు చూస్తుంటారు. చిన్న హీరోలకైతే ఎప్పటికీ అది తీరని కలగానే మిగిలిపోతుంటుంది. అలాంటి హీరోలతో సినిమాలు చేయగలిగితేనే ఏ డైరెక్టర్ సత్తా అయినా బయటపడేది. గతంలో దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు లాంటి మహామహులైన డైరెక్టర్లందరూ చిన్న హీరోలతోనూ సినిమాలు తీసి మెప్పించారు.

నిజానికి జూన్‌లో చిరంజీవితో శివ సినిమా మొదలవ్వాలి. కానీ ‘సైరా’ షూటింగ్‌లో జరుగుతున్న జాప్యం కారణంగా జూలైలోనూ షూటింగ్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. బహుశా ఆగస్టులో మొదలవ్వొచ్చేమో! అంటే శివ మునుపటి సినిమా విడుదలై అప్పటికి 16 నెలలు. నిజానికి ఈ టైంలో పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ అయితే ఈజీగా రెండు సినిమాలు తీసేస్తాడు. కానీ శివ ధోరణి వేరు. ఖాళీగా అయినా ఉంటాడు కానీ ఆయన పెద్ద హీరో అయితే తప్ప చెయ్యడన్న మాట!

  • వనమాలి

ఖాళీగా అయినా ఉంటాం కానీ పెద్ద హీరోతోటే చేస్తాం! | actioncutok.com

Trending now: