మహర్షి’ ట్రైలర్ చెబ్తున్న విషయాలు.. మిగిల్చిన ప్రశ్నలు!

మహర్షి’ ట్రైలర్ చెబ్తున్న విషయాలు.. మిగిల్చిన ప్రశ్నలు!
మురుగదాస్‌పై భారీ ఆశలు పెట్టుకుని చేసిన ‘స్పైడర్’ మహేష్‌కు భారీ షాక్‌నే ఇచ్చింది. దీని ఫలితం కారణంగా కొంత డిప్రెషనకు గురైన మహేష్‌కు కొరటాల శివ ‘భరత్ అనే నేను’ రూపంలో సక్సెస్‌ని అందించి మహేష్‌లో కొత్త ఊపుని తీసుకొచ్చాడు. ఈ సినిమా అందించిన సక్సెస్ ఆనందంలో రెట్టించిన ఉత్సాహంలో వున్న మహేష్ సరిగ్గా ఏడాది నిరీక్షణ తరువాత ‘మహర్షి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
వంశీ పైడిపల్లి రెండేళ్లు నిరీక్షించి చేసిన సినిమా ఇది. పైగా ఇద్దరిది తొలి కాంబినేషన్. ఈ కథ కోసం దర్శకుడు రెండేళ్లు నిరీక్షించడం, మహేష్ 25వ సినిమా కావడం, ముగ్గురు నిర్మాతలు తొలిసారిగా కలిసి నిర్మించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు చేరువగానే సినిమా వుందా? లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ తో ఏం చెప్పారో ఓ సారి లుక్కేయాల్సిందే.
రిషి ఓ కాలేజీ స్టూడెంట్. ప్రపంచాన్ని ఏలేయాలన్నది అతని ఆలోచన. అయితే అతని అమ్మా, నాన్న(జయసుధ, ప్రకాష్‌రాజ్)లది మధ్యతరగతి ఆలోచన. జీవితంలో గెలవడం అంటే సంపాదించడమేనా అన్నది రిషి తండ్రి ఆలోచన. కానీ ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏమీ సాధించలేక తండ్రిలాగే మిగిలిపోతాను అన్నది రిషి ఆలోచన.
అదే ఆలోచనతో తన మధ్యతరగతి జీవితానికి భిన్నంగా ఏదైనా సాధించాలనే పట్టుదలతో వుంటాడు. ఇవన్నీ ఏవీ తెలియని అమాయక జీవి రవి (అల్లరి నరేష్). క్యాంపస్‌లో రిషి రూమ్మేట్. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. మధ్యలో వీరితో పూజ (పూజా హెగ్డే) జతకలుస్తుంది. చదువు పూర్తి చేసుకున్న రిషి విదేశాలకు వెళ్లి అత్యంత శ్రీమంతుడిగా పేరు ప్రఖ్యాతులు సాధిస్తాడు.

జీవితంలో అనుకున్న వన్నీ సాధించిన రిషి తిరిగి ఇండియా ఎందుకు వచ్చాడు? ఓ బడా వ్యాపార వేత్త అయినటువంటి జగపతిబాబును ఎందుకు సవాల్ చేశాడు? కోట్లకు అధిపతి అయిన రిషి తన విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఎందుకు ఓ చిన్న గ్రామానికి వెళ్లి రైతుగా మారాడు? రవి ఏమైయ్యాడు?
రిషి జీవితంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? ధనార్జనే ధ్యేయంగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రిషి మహర్షిగా ఎలా మారాడు? ఎందుకు మారాడు అనే ఆసక్తిని దర్శకుడు ప్రేక్షకుల్లో రేకెత్తించడంలో నూటికి నూరు శాతం సక్సెస్ సాధించాడు.
అయితే అక్కడక్కడ ‘శ్రీమంతుడు’ ఛాయలు కనిపించడం ఈ చిత్రానికి కొంత డ్రాబ్యాక్గా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో కాలేజీ స్టూడెంట్‌గా, బిజినెస్‌మెన్‌గా, పొలం పనులు చేసే రైతుగా మహేష్ మూడు భిన్నమైన షేడ్స్‌లో కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది.

సినిమాలో మహేష్ పాత్ర ఏంటి? ఎలా వుంటుంది? ఆ పాత్ర లక్ష్యమేంటి?.. అనే విషయాల్ని రావు రమేష్, ఝాన్సీల ద్వారా చెప్పించిన తీరుతో కథ ఎలా ఉండబోతోందో వంశీ పైడిపల్లి హింట్ ఇచ్చేశాడు.
కథ ఏంటో చూచాయగా తెలిసిపోతున్నా కథనం ఆసక్తికరంగా వుండేలా కనిపిస్తోంది.
అయితే ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని గుర్తు చేసే విధంగా సాగితే మాత్రం ఈ సినిమా నిలబడటం కష్టమే. అందుకు భిన్నంగా వుంటే మాత్రం మహేష్‌బాబుకు ‘మహర్షి’ రూపంలో బ్లాక్‌బస్టర్ లభించినట్టే.
మహర్షి’ ట్రైలర్ చెబ్తున్న విషయాలు.. మిగిల్చిన ప్రశ్నలు! | actioncutok.com
Trending now: