‘3 ఇడియట్స్’ బదులు ‘బిజినెస్‌మేన్’!


'3 ఇడియట్స్' బదులు 'బిజినెస్‌మేన్'!

‘3 ఇడియట్స్’ బదులు ‘బిజినెస్‌మేన్’!

ఇప్పటివరకూ తన కెరీర్‌లో రీమేక్ చేయలేదు మహేశ్. అప్పటికే ఒకరు చేసిన సినిమాని తాను మళ్లీ చెయ్యాలనుకోనని పలు మార్లు చెప్పాడు మహేశ్. ఆఖరుకి తన తండ్రి చేసిన క్లాసిక్ మూవీస్‌ను కూడా రీమేక్ చెయ్యాలని తాను అనుకోనని కూడా అతను గతంలో చెప్పాడు.

అయితే ఒక సందర్భంలో మహేశ్ రీమేక్ చెయ్యడానికి సిద్ధమయ్యాడు. ఆ సినిమా ఆమిర్ ఖాన్ నటించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘3 ఇడియట్స్’. ‘రోబో’ సినిమా తర్వాత ‘3 ఇడియట్స్’ను రీమేక్ చెయ్యాలని సంకల్పించిన డైరెక్టర్ శంకర్ హిందీలో ఆమిర్ చేసిన కేరెక్టర్‌కు మహేశ్‌ను సంప్రదించాడు. మొదట ఊగిసలాడిన మహేశ్ చివరకు ఒప్పుకున్నాడు. తెలుగు, తమిళ భాషలు రెండింట్లోనూ ఆ సినిమాకు క్రేజ్ తీసుకు రావాలనుకున్న శంకర్.. హిందీలో మాధవన్, శర్మాన్ జోషి చేసిన పాత్రలకు తమిళ హీరోలు ఆర్య, జీవాలను తీసుకోవాలనుకున్నాడు.

కానీ రీమేక్ చెయ్యడానికి మహేశ్ మనసు అంగీకరించలేదు. దాంతో ఆ విషయం చెప్పి సున్నితంగా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. చేసేది లేక మహేశ్ బదులు తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఆ సినిమా చేశాడు శంకర్. మాధవన్ కేరెక్టర్‌కు శ్రీరాం, శర్మాన్ జోషి పాత్రకు జీవా సెట్టయ్యారు. తమిళంలో ‘నమ్బన్’గా వచ్చిన ఆ సినిమా, తెలుగులో ‘స్నేహితుడు’ పేరుతో విడుదలైంది కానీ విజయం సాధించలేదు. మహేశ్ చేసినట్లయితే ‘దూకుడు’ తర్వాత ఈ సినిమానే వచ్చుండేది. ఏదేమైనా దానికి బదులు పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘బిజినెస్‌మేన్’ చేసి హిట్ కొట్టాడు మహేశ్.

‘3 ఇడియట్స్’ బదులు ‘బిజినెస్‌మేన్’! | actioncutok.com

More for you: