మెగాస్టార్ బాటలో పవర్‌స్టార్?


మెగాస్టార్ బాటలో పవర్‌స్టార్?

మెగాస్టార్ బాటలో పవర్‌స్టార్?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. ఆ ఒక్క సీటూ కూడా పవన్ కల్యాణ్ సాధించింది కాదు. రాజోలులో పోటీ చేసిన రాపాక వరప్రసాద్ సాధించింది. పవన్ రెండు చోట్ల పోటీచేసి రెండు చోట్లా ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు. తన కరిష్మా, తన ఇమేజ్, తన క్రేజ్ సినిమాల వరకేననీ, సినిమా ఇమేజ్ వేరు, పొలిటికల్ ఇమేజ్ వేరు.. అని ఆయన తెలుసుకొని ఉండాలి. మనీ పవర్ లేకుండా ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని కూడా ఆయనకు అర్థమై ఉండాలి.

ఈ దారుణ ఓటమి తర్వాత ఆయన ఏం చేస్తారనే ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. ఒక నిజాయితీపరుడు అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోవడం మింగుడుపడటం లేదని ఒక పవన్ అభిమాని బాధపడుతూ అన్నాడు. తోటి నటుడు, ప్రత్యర్థి పార్టీకి చెందిన డాక్టర్ రాజశేఖర్ సైతం పవన్ ఒక్క సీట్లోనైనా గెలిస్తే బాగుడేదనుకున్నానని అన్నారంటే, వ్యక్తిగా ఆయన్ని అభిమానించేవాళ్లు అన్ని పార్టీల్లోనూ ఉన్నారన్న మాట. కానీ ఓటర్లు ఆయన కంటే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.

ఇప్పుడిక పవన్ కల్యాణ్ ఏం చేస్తారు? ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన సోషల్ మీడియా అకౌంట్ మూగబోయింది. ఇప్పటివరకూ ట్విట్టర్ ద్వారా ఆయన ఏమీ స్పందించలేదు. మార్చి 18న ఆయన చివరిసారిగా ట్వీట్ చేశారు. అంతే! తన అన్న చిరంజీవి తరహాలోనే ఆయన తిరిగి సినిమాల్లోకి వచ్చేస్తారని కొంతమంది నిందాపూర్వకంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ అలా వచ్చినా తప్పు పట్టాల్సిన పనేమీ లేదు.

పవన్ కల్యాణ్ ఒక అగ్ర నటుడు. ఆయన సినిమాకు వచ్చే ఓపెనింగ్స్ ఆయన స్థాయి ఏమిటో చెప్తాయి. రావాలనుకుంటే ఆయన తిరిగి సినిమాల్లోకి రాగలరు. అయితే చిరంజీవి లాగా రాజకీయాలను ఆయన వదిలిపెట్టడని పవన్ మనస్తత్వాన్ని ఎరిగినవాళ్లు చెప్తున్న మాట. ఓటమి ఎదురైతే కుంగిపోయే మనస్తత్వం కాదు ఆయనది. తన పార్టీకి మూలధనం పెద్దగా లేదనీ, తను సినిమాల్లో సంపాదిస్తేనే పార్టీ కోసం ఖర్చుపెట్టగలననీ గతంలో ఆయన చెప్పారు.

ఆయన మళ్లీ సినిమాల్లో నటించవచ్చు. కానీ ఆయన పాలిటిక్స్‌ను వదలరు. పోగొట్టుకున్నచోటే పొందాలని ఆయన ఆశిస్తాడు. చిరంజీవికీ, పవన్‌కూ వైరుధ్యం ఈ విషయంలోనే. పవన్ పట్టు పట్టారంటే వదిలే రకం కాదు. కాబట్టి పవన్ పాలిటిక్స్‌ను వదిలేస్తారని అనుకునేవాళ్లు తమ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు.

– సజ్జా వరుణ్

మెగాస్టార్ బాటలో పవర్‌స్టార్? | actioncutok.com

More for you: