మూడోసారి ఏం చేస్తారో!?

మూడోసారి ఏం చేస్తారో!?
కథానాయకుడిగా రామ్‌ది 13 ఏళ్ళ నటనాప్రస్థానం. ఈ ప్రయాణంలో విజయాల కంటే అపజయాలనే ఎక్కువగా చూశాడీ యంగ్ హీరో. ‘దేవదాస్’, ‘రెడీ’, ‘కందిరీగ’, ‘నేను శైలజ’.. ఇలా వేళ్ళ మీద లెక్కపెట్టగలిగే విజయాలే అతని ఖాతాలో ఉన్నాయి. ఇక రామ్ జాబితాలో చివరి విజయంగా నిలచిన ‘నేను శైలజ’కి దర్శకత్వం వహించిన కిషోర్ తిరుమల.. ఆ తరువాత ‘ఉన్నది ఒకటే జిందగీ’కి దర్శకత్వం వహించినా నిరాశే మిగిలింది.
ఈ నేపథ్యంలో.. రామ్, కిషోర్ తిరుమల కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా రాబోతోందని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే.. ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. అదేమిటంటే.. వీరిద్దరు జట్టుకట్టిన తొలి రెండు చిత్రాలు స్ట్రయిట్ ఫిల్మ్స్ కాగా.. మూడో సినిమా రీమేక్‌గా తెరకెక్కనుందట. తమిళంలో విజయం సాధించిన ‘తాడమ్’ (అరుణ్ విజయ్ కథానాయకుడు) ఆధారంగా ఈ రీమేక్ రూపొందనుందట.
అంతేకాదు.. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ తరహాలోనే ఈ ప్రాజెక్ట్ కూడా రామ్ సొంత సంస్థలోనే నిర్మితం కానుందట. జూన్ నెలాఖరులో లేదా జూలై ప్రథమార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కనుందని టాక్. మరి.. ‘నేను శైలజ’లాగే ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందో లేదంటే ‘ఉన్నది ఒకటే జిందగీ’లాగా చతికిలపడుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. రామ్ కొత్త చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ జూన్ ద్వితీయార్ధంలో రిలీజ్ కానుందని సమాచారం.
మూడోసారి ఏం చేస్తారో!? | actioncutok.com