పాపం.. ఎలాంటి వర్మ ఎలాగయిపోయాడు!


పాపం.. ఎలాంటి వర్మ ఎలాగయిపోయాడు!

పాపం.. ఎలాంటి వర్మ ఎలాగయిపోయాడు!

ఒకప్పటి ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ (ఇప్పుడేంటో ఎవరికి వాళ్లు ఊహించుకోవాల్సిందే) రాంగోపాల్ వర్మ ఎన్నికల కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా, కోర్టు తనకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మే 1న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చెయ్యడానికి ప్రయత్నించారు.

అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం తనకు అన్ని రకాల ఆటంకాలు కలిగిస్తోందనీ, అసలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉందో, లేదో తెలియట్లేదనీ గొడవ చేసిన ఆయన ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల్ని ప్రభుత్వ యంత్రాంగం పాటిస్తూ సినిమా ప్రదర్శనపై నిషేధాన్ని విధిస్తుంటే ఏం చెయ్యాలా అని కొత్త పథకాలు అన్వేషిస్తున్నారు.

అనకాపల్లిలో తన సినిమా ప్రదర్శనని కలెక్టర్ నిలుపుదల చేసినట్లు పత్రికలో వచ్చిన క్లిప్‌ను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసి, “అనకాపల్లిలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను బలవంతంగా ఆపేశారు” అని పోస్ట్ చేశారు వర్మ. దానికి ఒకరు “అది బలవంతంగా ఆపడం కాదు. అది ఎన్నికల కమిషన్ పర్మిషన్ లేకుండా బలవంతంగా ప్రదర్శించడం” అని జవాబిచ్చారు.

ఒకప్పుడు రక్తపాతాలతో, హింసాత్మక సన్నివేశాలతో మాఫియాపై సినిమాలు, తర్వాత బూతు సినిమాలు కూడా తీసిన వర్మను ఒక ఇంటర్వ్యూలో “సమాజంపై చెడు ప్రభావం చూపే అలాంటి సినిమాలు ఎందుకు తీస్తుంటారు?” అనడిగితే, “సినిమాలు చూసి చెడిపోయేవాళ్లెవరూ ఉండరు. వాళ్లపై సినిమా ఎలాంటి ప్రభావాన్నీ చూపదు. అయినా నేను ప్రేక్షకుల్ని నా సినిమా చూడమని బలవంతపెడ్తున్నానా” అని నిర్లక్ష్యంగా జవాబిచ్చిన వర్మ ఇవాళ తన సినిమాని ఆపేస్తున్నారంటూ గగ్గోలు పెడుతుండటం చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.

ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచాడో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చూపించాననీ, జనం దాన్ని చూసి తెలుసుకోవాలనీ ఆయన తెగ ఆరాటపడుతుండటం మరీ మరీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. వర్మ ఏమిటనేది జనం ఎప్పుడో అర్థం చేసుకున్నారు. అందుకే కాంట్రవర్సీతో తన సినిమాకు ఎంత హైప్ తీసుకు రావాలని ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కొన్నేళ్లుగా ఆయన సినిమాలను వాళ్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన జనం దృష్టిలో ఎప్పుడో క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు.

‘శివ’, ‘క్షణ క్షణం’, ‘రంగీలా’ నాటి వర్మకూ, ఇప్పటి వర్మకూ ఏమాత్రం పోలిక లేదని వాళ్లకు బాగా తెలుసు. అందుకే అప్పటి వర్మను గౌరవిస్తూనే, ఇప్పటి వర్మను చూసి నవ్వుకుంటున్నారు.

  • వనమాలి

పాపం.. ఎలాంటి వర్మ ఎలాగయిపోయాడు! | actioncutok.com

Trending now: