‘మహర్షి’ ఎపిక్ బ్లాక్‌బస్టరా? మరి రాయలసీమ, ఓవర్సీస్ మాటేమిటి?


'మహర్షి' ఎపిక్ బ్లాక్‌బస్టరా? మరి రాయలసీమ, ఓవర్సీస్ మాటేమిటి?

‘మహర్షి’ ఎపిక్ బ్లాక్‌బస్టరా? మరి రాయలసీమ, ఓవర్సీస్ మాటేమిటి?

‘మహర్షి’ సినిమా విడుదలైన దగ్గర్నుంచీ దాన్ని ‘ఎపిక్ బ్లాక్‌బస్టర్’ అంటూ నిర్మాతలు పబ్లిసిటీ ఇస్తూ వస్తున్నారు. మే 28న ఆ సినిమా రూ. 175 కోట్ల గ్రాస్‌ను సాధించిందని నిర్మాతలు పోస్టర్‌ను విడుదల చేశారు. అంతవరకు బాగానే ఉంది. మహేశ్ భార్య నమ్రత అయితే ఇంకో అడుగు ముందుకేసి, రూ. 175 కోట్ల మార్కును అత్యంత వేగంగా చేరుకున్న సినిమాగా ‘మహర్షి’ని అభివర్ణించింది.

అసలు ‘బ్లాక్‌బస్టర్’ అంటే ఏమిటి? పెట్టిన పెట్టుబడికి ఎన్నో రెట్లు ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమా. అదే ‘ఎపిక్ బ్లాక్‌బస్టర్’ అంటే? కనీ వినీ ఎరుగని రీతిలో లాభాలు తెచ్చిన సినిమా అనుకోవాలి. ‘మహర్షి’ పెట్టుబడిపై ఎన్ని రెట్ల లాభం తీసుకొచ్చింది? ట్రేడ్ విశ్లేషకుల లెక్క ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ‘మహర్షి’ అమ్మకం విలువ రూ. 94.60 కోట్లు. 18 రోజులకు ఆ సినిమా వసూలు చేసిన షేర్ రూ. 94 కోట్లు.

అంటే ఏమిటి? అమ్మకపు విలువను దాదాపు సాధించింది. దాన్నే ‘ఎపిక్ బ్లాక్‌బస్టర్’ అంటారా? కేవలం నైజాం ఏరియాలో మాత్రమే ఆ సినిమాని బ్లాక్‌బస్టర్ అనొచ్చు. ఎందుకంటే అమ్మకపు విలువ కంటే అక్కడ దాదాపు రూ. 6 కోట్ల షేర్‌ను ఎక్కువగా సాధించింది కాబట్టి.

నిజమేమంటే సినిమావాళ్లు సీడెడ్ ఏరియాగా పిలుచుకొనే రాయలసీమలో ఆ సినిమా ‘ఎపిక్ బ్లాక్‌బస్టర్’ సంగతి అలా ఉంచి కనీసం సేఫ్ జోన్‌లోకి కూడా రాలేదు. అక్కడ ‘మహర్షి’ ఫ్లాప్ కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు! రూ. 12 కోట్ల అమ్మకపు విలువకు గాను అక్కడ ఇప్పటివరకూ వచ్చింది రూ. 9 కోట్లకు కొంచెం పైన. క్రమంగా వసూళ్లు పడిపోతున్న స్థితిలో ఎంత ఉదారంగా లెక్కలు వేసుకున్నా రాయలసీమ డిస్ట్రిబ్యూటర్‌కు ‘మహర్షి’ కనీసం రూ. 2 కోట్ల నష్టాన్ని తీసుకు వస్తున్నాడని అంచనా. యు.ఎస్. విషయంలోనూ ఇదే పరిస్థితి.

నిజం ఇలా ఉండగా, ఇప్పటికీ ‘ఎపిక్ బ్లాక్‌బస్టర్’ అంటూ ఎవర్ని మభ్యపెట్టడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారో అర్థం కాదు. నిజాన్ని నిర్మాతలు దాచినా అది బయటకు రాకుండా ఉంటుందా? ఇప్పటికే స్టార్ల సినిమాలకు ‘ఫేక్ రికార్డ్స్’ అంటూ ఫ్యాన్స్ మధ్య వాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ‘ఎపిక్ బ్లాక్‌బస్టర్’ ప్రచారాలు అలాంటివాటికి మరింత ఊతమిస్తాయని గ్రహించాలి.

– వనమాలి

‘మహర్షి’ ఎపిక్ బ్లాక్‌బస్టరా? మరి రాయలసీమ, ఓవర్సీస్ మాటేమిటి? | actioncutok.com

More for you: