‘మహర్షి’ నిజంగా గెలుపు పంచాడా?


'మహర్షి' నిజంగా గెలుపు పంచాడా?

‘మహర్షి’ నిజంగా గెలుపు పంచాడా?

గెలుపును కోరుకునేవాడు మనిషి.. గెలుపును పంచేవాడు మహర్షి.. ఈ లైన్లతో సినిమా ముగిసింది. అచ్చంగా మహేష్ బాబుకు అందరు చేతులెత్తి మొక్కటంతో రిషి అనే పాత్ర మహర్షిగా మారిపోయింది. గెలుపంటే ఒక గమ్యం కాదు. గెలుపంటే ఒక ప్రయాణం అని మహర్షిగా మారిన రిషి పాత్ర గెలుపు సూత్రాన్ని చెప్పి ఫేడ్ అవుట్ అయ్యింది.

******

మొన్న సోమవారం రోజున అజయ్ అనే తమ్ముడు ఫోన్ చేసాడు. అతడిది ఖమ్మం జిల్లా భద్రాచలం. మొన్నీమధ్యే ఇంటికెళ్లాడు. రైతు గూర్చిన కథ అని ఇంట్లో వాళ్లందరికీ టికెట్ తీసి మరీ కుటుంబంతో పాటు కలిసి సినిమాకి వెళ్లాలని ఆ తమ్ముడి కోరిక. అజయ్ .. అజయ్ అమ్మ.. తమ్ముడు మాత్రమే సినిమా కెళ్లారని వాళ్ల నాన్న వెళ్లలేకపోయాడని చెప్పాడు.

ఎందుకంటే అచ్చంగా అందరి రైతులకుండే సమస్యే అజయ్ వాళ్ల నాన్నదీనూ.. అతడూ ఓ రైతు. రెక్క కష్టంతో పండించిన పంట డైబ్బై బస్తాల వడ్లను కొనే దళారీ కోసం వెతుక్కుంటూ సరైన గిట్టుబాటు ధరలేదని ఆ రోజు కూడా ఎవర్నో కలవటానికి వెళ్లాల్సి రావటం వల్ల కుటుంబంతో పాటు సినిమా చూల్లేకపోయాడని ఫోన్లో బాధ పడ్డాడు. సినిమాలో చూపించి ప్రెస్ మీట్లు పెట్టడం వేరు, నిజమైన రైతుల పరిస్థితి వేరు అని బాధపడ్డాడు.

వాడి మాటల్లో – “ఇప్పుడు మా జీవితాలు సినిమా వాళ్లకు కాసులు కురిపించే కథా వస్తువులు”. ఆ తమ్ముడి బాధ ఆమోదయోగ్యమే.

మరి ‘మహర్షి’ సినిమా ఏం చేసినట్టు..??

సినిమాలో మానవీయ కోణాలు ఎప్పుడూ బాగానే వర్క్ అవుట్ అవుతాయి. ముఖ్యంగా సామాన్య మనుషుల్లోంచి ఒక నాయకుడు బయటకొచ్చేప్పుడు లేదా తయారయ్యేప్పుడుండే భావోద్వేగాలు ప్రేక్షకుడిని కూడా కట్టిపడేస్తాయ్. కేవలం ఆ మూల సూత్రం మీదే సినిమా నడిచిందని అనిపించింది.

*********

ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయే కథ.

arrogance నుంచి agriculture వైపు..

కామాలు ఉండే success ని ఆస్వాదించే ఒక వ్యక్తి రైతు సమస్యలకు ఫుల్ స్టాప్ ఎలా పెట్టొచ్చో solution తో దిగిరావటం.

తండ్రితో చిన్నప్పటి నుండి మాట్లాడని కొడుకు తండ్రి పేరును చెప్పుకొనే transformation.

– “నన్నింతే అర్థం చేసుకున్నావ్‌రా?” అని మాట్లాడటం మానేసిన వాడు.. స్నేహితున్ని వదిలేసినవాడు.. స్నేహితుడికోసం అకస్మాత్తుగా తప్పు తెలుసుకుని రావటం…

గెలుపంటే తండ్రి తీర్చలేని అప్పుకోసం పడ్డ మాటలు తనకు అంటుకోకూడదని డబ్బే ముఖ్యమని అనుకున్న వాడు తన ఆస్తిలో తొంభై శాతం జనాలకు పంచటానికి వెనకాడకపోవటం…

‘మహర్షి’ ఇలా అన్నీ మిక్స్ చేసిన కలగూర గంప..

అన్ని రకాల ప్రేక్షకులను సంతృప్తిపరిచేందుకు డైరెక్టర్ పడ్డ కష్టం..

**********

సినిమా వ్యక్తిగత గెలుపుతో మొదలై ఎటెటో తిరిగింది.

మహేష్, పూజాహెగ్డే, అల్లరి నరేష్లు ఒకే కాలేజీలో చదువుతుంటారు. ముగ్గురివి మూడు రకాల నేపథ్యాలు.

రిషి అలియాస్ మహేష్ బాబుది దిగువ మధ్యతరగతి కుటుంబం.. పదివేల అప్పు తీర్చలేని తండ్రి పడుతున్న మాటలతో జీవితం మీద కసి పెంచుకున్న కుర్రాడి కథ. ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి సీ.ఈ.ఓ. గా ఎదిగే అతని పట్టుదల గొప్పది.

పూజా హెగ్డే.. తెలివిగల వాడైనందుకు (అర్థం చేసుకుని) మహేశ్‌ని ప్రేమిస్తుంది. బాగా స్థిరపడ్డ కుటుంబం. కాబట్టి కాంపస్ డ్రైవ్ లో ఉద్యోగం వచ్చినా హీరోని పెళ్లి చేసుకోడానికి ఆ ఉద్యోగాన్నే వదిలేస్తాననే పాత్ర.

రవి అలియాస్ అల్లరినరేష్ .. రైతు కొడుకు. ఇంజనీర్ అయ్యి అమెరికా వెళ్ళి గొప్పగా బతకాలీ అనే మనస్తత్వం. కాలేజ్లో ఉన్నా అతడి మనసు రైతైన నాన్న మీద.. చేసుకోబోయే మరదలి మీదా ఉంటుంది. సన్నకారు రైతు కుటుంబం. భూమిని నమ్ముకుని విలువల కోసం బతికే మనుషులున్న కుటుంబంలోంచి వచ్చిన పాత్ర. స్నేహితుడికోసం ఏదైనా చేసే పాత్ర.

ఈ ముగ్గురు ఎందుకు విడిపోయారు?? వాళ్లని కలవటానికి ముఖ్యంగా రవిని కలవటానికి వచ్చిన రిషి ఎలాంటి పరిస్థితులు చూసాడు?? తన స్నేహితునికి అండగా నిలబడేలా చేసిన పరిస్థితులేంటి?? అతడు రైతు ఎందుకయ్యాడు?? తెలియాలంటే సినిమా చూడాలి.

*********

'మహర్షి' నిజంగా గెలుపు పంచాడా?
ఊరినుంచి వచ్చిన పాత్ర పట్ల చిన్న చూపు..

ఈ సినిమా చూసాక ఎవరికైనా అల్లరి నరేష్ పాత్ర లాంటి స్నేహితుడు కావాలీ అనుకోవాలి. ప్రతి నిమిషం స్నేహితుడి గెలుపు కోరుకోవటం ఇవ్వాళ రేపు అసాధ్యం. కానీ రవి పాత్రలో అల్లరి నరేష్.. మహేష్ బాబును ప్రతిసారి పొగుడుతూనే ఉంటాడు. తన కన్నా ఎక్కువ స్నేహితుడి బలాన్ని నమ్ముతాడు. తన స్నేహితుడి గెలుపును కాంక్షిస్తూ తనని తాను తక్కువ చేసుకుంటూ ఉంటాడు. స్నేహితుడి ప్రేరణ పొందుతూ ఉంటాడు.

నాకు నరేష్ పాత్ర మీద విపరీతమైన జాలి కలిగింది. మహేష్ బాబు పాత్రకి బలం చేకూర్చాలి కాబట్టి నరేష్ పాత్ర ‘ఫిల్లర్’ లాగా ఉపయోగపడిందా అనే అనుమానం వచ్చింది.

– “నేను చెప్పానుగా వాడొచ్చాడంటే ఏదో ఒకటి చేస్తాడు” అని గుడ్డిగా నమ్మే స్నేహితులు ఆధారపడి పొంగిపోయే స్నేహితులు అరుదుగా దొరికే కాలం. అలాంటి వాణ్ణి మహేష్ బాబు పాత్ర అర్థం చేసుకోక పోగా తనని అర్థం చేసుకోలేదని చెంప పగలగొట్టిన స్నేహితుడి కోసం.. తన భవిష్యత్తు ముందే చూసినట్టు చేయని నేరం మీదేసుకుని త్యాగపురుషుడి పాత్రలా ఉండిపోవటం నరేష్ ను చూసినప్పుడల్లా నీరసం కలిగించే అంశం. అసలు వెన్నెముక లేని వ్యక్తిలా తీర్చిన పాత్ర నరేష్ దీ.

నాకెందుకో దర్శకుడు రైతు కొడుకు ఊర్లోంచి వస్తాడు కాబట్టి మరీ అమాయకత్వం పాళ్లు ఎక్కువగా వేసి.. చదువులంటే భయపడే ఒక మొద్దు ఫెలో లాగా చిన్నచూపు చూసిన కారెక్టర్ అనిపించింది.

********

బ్యూటిఫుల్ ఫిల్లర్

పూజా హెగ్డే పాత్ర అన్ని సినిమాల్లో పాత్రలాగే స్కిన్ షో కోసమో ఖాళీగా హీరోని ఉంచితే ఆడియన్స్ బాధపడతారని పెట్టిన కారెక్టర్ లాగా అనిపించింది. తనకంటూ స్వంత అభిప్రాయాలు లేని పాత్ర. హీరో తనని పూర్వార్ధంలో ఒకమ్మాయి ఇష్టపడిందని గుర్తుచేసుకుంటూ.. యే పశ్చాత్తాపం లేకుండా మళ్లీ intelligent show off తో పడేసే కరిగిపోయే పాత్ర.

********

గెలుపు ఓటమి – రైతు భూమి

గెలుపూ గెలుపూ అని పరుగెత్తటం నేర్చుకున్న మనిషి గెలుపును పంచటం కోసం దిగి వచ్చాడు. తండ్రితో మాట్లాడడు. స్నేహితున్ని అర్థం చేసుకోడు. ప్రేమించిన అమ్మాయిని అకారణంగా వదిలేస్తాడు. ఓ గొప్ప వ్యక్తిలా అవతరించాక డ్రమాటిక్ తప్పు జరిగిందని తెలిసేవరకు స్నేహితుడ్ని గుర్తు చేసుకోని క్యారెక్టర్. ఇరవై నిమిషాలకోసారి గెలుపు గెలుపు అని మాట్లాడే కారెక్టర్.

sudden transformation కోసం ఒక పాట .. హౌ ..?? just to get the character to India??

రిషి అనే కారెక్టర్ ఇండియాలోనే పెద్ద ధనవంతుడిగా కూడా అనిపించొచ్చు కదా..?? just to show off choppers and helicopter and his riches to the Audian to make his character supreme..??

*******

'మహర్షి' నిజంగా గెలుపు పంచాడా?

ఒక సినిమా బలం కథ అయినప్పుడు అది యాభై యేళ్ల తర్వాత కూడా ఫ్రెష్ గా ఉంటుంది. నా వరకు నాకు బలహీనమైన కథనానికి.. ఆ లోటు భర్తీ చేయటానికి చాలా పాత్రలని ప్రవేశపెట్టి మధ్యలో కథని ఫిల్ చేసుకోడానికి దర్శకుడు కష్టపడ్డట్టు అనిపించింది.

అసలు గెలుపు నిర్వచనం కోసం తీసిన సినిమా ఇది. రైతు కేవలం ఒక ప్రధాన సరుకు.

స్క్రీన్ ప్లే లోపం స్పష్టంగా కనిపించింది.

మహేష్ బాబుని కొంత మంది హత్తుకునే సంధర్బాలున్నాయి. ఎక్కడైనా ఆత్మీయంగా హత్తుకుంటాడా అని చూస్తే.. తల నిటారుగా బిరుసుగా పెట్టి, ఎటువంటి ఆత్మీయతా, ప్రేమ లేని కౌగిలింతలు.. మహేష్ నటన మీద ఎందుకో అసంతృప్తి కలిగింది.

ఫస్ట్ హాఫ్ అంతా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు. మహేష్ బాబు అంత స్టిఫ్ టోన్తో అవసరం లేకున్నా ఎందుకు మాట్లాడాల్సొచ్చిందో అర్థం కాలేదు.

జయసుధ తెచ్చిచ్చిన లెటర్ మరీ డ్రమాటిక్. అరె.. అంత ప్రేమించే తండ్రి ఉత్తరం రాసి తల్లికెలా ఇస్తాడు. ఫోన్ చేయొచ్చు. లేదు మెసేజ్ టెక్స్ట్ చేసే సౌకర్యాలు ఎన్ని లేవు?? తండ్రి సెంటిమెంటు పండించే విషయంలో ఆ సీన్స్ చాలా పలచగా రాసుకున్నట్టు అనిపించింది.

సంగీతం ఎందుకో అస్సలు రెజిస్టర్ అవలేదు, ‘పదర పదరా’ పాట తప్ప.

**********

రైతు పేరు చెప్పి సినిమాని ప్రమోట్ చేసుకోవచ్చు.

ఒక రకంగా సినిమా చివరి అర్ధ గంట రైతుల సమస్యలు, వారి ఆత్మహత్యల గురించీ.. ప్రధాన పాత్ర మాట్లడటం అభినందనీయమే… కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఆ సన్నివేశాన్ని రసవత్తరంగా .. సొల్యూషన్ దిశగా ముగించటంలో వైఫల్యం కనిపించింది.

ఊరొదిలిపెట్టి పోయిన కొడుకు కోసం బస్టాండ్లో రోజూ ఎదురుచూసే తల్లి చావబోతుంటే ఊరొస్తాడు భగత్. రిషి అలియాస్ మహేష్ బాబును కొన్శి ప్రశ్నలు వేస్తాడు. వాటికి రిషి పాత్ర ఎలాంటి సమాధానం చెప్పడు.

పెద్ద హీరోల సినిమాలంటే ఏదో ఆశించి ఎన్నో రోజులు ఎదురుచూస్తారు అభిమానులూ.. ప్రేక్షకులూ. కానీ ఇలా డిస్సప్పాయింట్మెంట్ కి గురి చేయటం బాగోలేదు.

********

పొలిటికల్ లీడర్స్ మీదా, కార్పొరేట్ కంపెనీల మీదా, ప్రజాస్వామ్యం మీదా, రైతులు వేసే ప్రశ్నల మీదా జనాల ఈలలు నడుస్తాయ్.

ఇలాంటి సినిమాలే ఆర్. నారాయణమూర్తి తీసి ప్రశ్నిస్తే ఈ ప్రేక్షకులు చూట్టానికి కూడా ఎందుకు వెళ్లరు.. ఆ ప్రేక్షక అభిమాన దేవుళ్లకు తెలియాలి. వంద వరకు రైతుల మీద కథలు రాసిన తెలుగు సాహిత్యంలో ఆ కథల్ని చదివి రీసెర్చ్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిఉండదూ??

********

'మహర్షి' నిజంగా గెలుపు పంచాడా?

చివరిగా మహేష్ బాబుగారికి ఒక విన్నపం

సర్.. ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’, ఇప్పుడు ‘మహర్షి’ .. ‘శ్రీమంతుడు’ పార్ట్ వన్ .. పార్ట్ టూ .. పార్ట్ త్రీ చూసినట్టు ఉన్నాయ్. మీ అభిమానిగా నాదో మనవి. మీరు ఈ పాత్రనుంచి విముక్తి పొంది మంచి పాత్రలు ఎంచుకోండి ..ఆ మొనాటనీ నుంచి బయటపడండి.

******

మెర్సీ మార్గరెట్

16.5.2019

‘మహర్షి’ నిజంగా గెలుపు పంచాడా? | actioncutok.com

Trending now: