ఆర్ ఆర్ ఆర్: మళ్లీ మల్టీస్టారర్ల యుగం వచ్చినట్లేనా!?


ఆర్ ఆర్ ఆర్: మళ్లీ మల్టీస్టారర్ల యుగం వచ్చినట్లేనా!?

ఆర్ ఆర్ ఆర్: మళ్లీ మల్టీస్టారర్ల యుగం వచ్చినట్లేనా!?

ఇద్దరు అగ్ర హీరోలు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారంటే ఆ సినిమా దర్శక నిర్మాతలపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఎవరికి ఎక్కువ స్క్రీన్ ప్రెజేన్స్ ఉంటుంది, ఎవరి కేరెక్టర్ ఎక్కువ శక్తిమంతంగా ఉంటుంది?.. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. తమ హీరోకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఆ హీరో అభిమానులు రణరంగం సృష్టించడం, అవతలి హీరో కంటే తమ హీరో రోల్ పవర్‌ఫుల్‌గా ఉందంటూ సదరు హీరో ఫ్యాన్స్ వీరంగాలు వేయడం గతంలో మనం చూశాం.

ఎన్టీఆర్-ఏఎన్నార్, ఎన్టీఆర్-కృష్ణ, కృష్ణ-శోభన్‌బాబు కలిసి నటించిన సినిమాలకు ఇలాంటి ఘటనలు జరిగేవి. ఆ తర్వాత తెలుగులో మల్టీస్టారర్స్ లేకుండా పోయాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. ఒకరితో ఒకరు కలిసి మల్టీస్టారర్లు చెయ్యలేదు. కారణం.. లేనిపోని గొడవలు వస్తాయనే. అలా అగ్ర హీరోలతో మల్టీస్టారర్లను చూసే అవకాశం లేకుండా పోయింది.

అయినప్పటికీ చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య, పవన్ కల్యాణ్, మహేశ్ అభిమానుల మధ్య, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగిన ఘటనలు ఉన్నాయి. వాళ్ల మధ్య ఎక్కువగా బాక్సాఫీస్ రికార్డుల గొడవలే ఎక్కువగా ఉండేవి. ఇప్పటికీ ఉంటున్నాయి.

ఇలాంటి స్థితిలో మాస్‌లో దాదాపు ఒకే రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు కలిసి నటిస్తుండటం సామాన్య విషయం కాదు. ఒక తరం టాప్ హీరోలు చెయ్యలేని పనిని ఈ తరం టాప్ హీరోలు చేస్తున్నారు. ఆ హీరోలు.. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్. ఆ ఇద్దర్నీ కలిపింది యస్.యస్. రాజమౌళి. ఆ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’.

‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ప్రకటన వచ్చిన దగ్గర్నుంచీ జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కేరెక్టర్ల గురించిన చర్చ మొదలైంది. ఇద్దరికీ సమాన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేలా, ఇద్దరి పాత్రలూ శక్తివంతంగా ఉండేలా, వాళ్ల అభిమానులనెవర్నీ ఆసంతృప్తికి గురిచెయ్యకుండా రాజమౌళి ఎలా తీస్తాడో చూడాలంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి.

ఆర్ ఆర్ ఆర్: మళ్లీ మల్టీస్టారర్ల యుగం వచ్చినట్లేనా!?

ఇప్పుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్, కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారని తెలియడంతో అభిమానుల్లోనే కాకుండా మిగతా సినీ ప్రియుల్లోనూ ఆసక్తి రెట్టింపైంది. ఆశ్చర్యకరంగా ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ఇరువురి అభిమానులూ సోషల్ మీడియాలో తమ హీరోలిద్దరు కలిసున్న ఫొటోలను షేర్ చేస్తూ ‘ఆర్ ఆర్ ఆర్’ అన్ని రికార్డుల్నీ బ్రేక్ చేస్తుందనీ, తమ హీరోలిద్దరికీ ఆ సినిమా నటులుగా చాలా మంచి పేరు తెస్తుందనీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి ఆరోగ్యకర వాతావరణం టాలీవుడ్‌లో కనిపిస్తుండటం అందర్నీ సతోషపరుస్తోంది. నిజ జీవితంలో జూనియర్, చరణ్ మంచి మిత్రులు. తమ ముందు తరం హీరోలు చెయ్యలేని పనిని ఆ ఇద్దరూ ఇప్పుడు చేస్తున్నారు. ఇగోలకు దూరంగా అందరితో పాటు వాళ్ల అభిమానులూ ఈ పరిణామాన్ని స్వాగతించడం, వాళ్లూ స్నేహితుల్లాగా వ్యవహరిస్తుండటం ఏ రకంగా చూసినా తెలుగు సినిమాకు మేలు చేకూర్చే అంశం.

భిన్న తరాలకు చెందిన వెంకటేశ్, మహేశ్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో వేసిన బీజం ఇప్పుడు మొక్కగా మారిందనుకోవాలి. మున్ముందు అగ్ర హీరోలు ఇగోలు, భేషజాలకు తావు లేకుండా మల్టీస్టారర్లు చేయడాన్ని అలవాటుగా చేసుకుంటే ప్రేక్షకులకూ, అభిమానులకూ కన్నుల పండుగే!

  • వనమాలి

ఆర్ ఆర్ ఆర్: మళ్లీ మల్టీస్టారర్ల యుగం వచ్చినట్లేనా!? | actioncutok.com

Trending now: