స్పెషల్ ఆర్టికల్: సినిమాకి ఏవి కీలకం?


స్పెషల్ ఆర్టికల్: సినిమాకి ఏవి కీలకం?

స్పెషల్ ఆర్టికల్: సినిమాకి ఏవి కీలకం?

ప్రతి కథనీ సినిమా తీసి చూపించడం సులువే. కానీ చూసేవాళ్లని మెప్పించడం మాత్రం సులువు కాదు. అందుచేతే సినిమా కథ ఎలా వుండాలనే ఓ పెద్ద ప్రశ్న ప్రతి నిర్మాత బుర్రనీ తినేస్తోంది. సినిమా కథ ఇలా వుండాలని ఇదమిత్థంగా నిరూపించడం ఎవరి తరం? నిర్మాతా మంచి కథనే కోరుతాడు, కథకుడూ మంచి కథ రాయడానికే ప్రయత్నిస్తాడు. తీరా ఆ కథ తెరకెక్కాక ప్రేక్షకులు పెదవి విరిచి “అబ్బే.. ఏం సినిమా?” అనేస్తారు.

“ఎప్రిషియేట్ చెయ్యలేని యెదవ జనం” అని నిర్మాతా, దర్శకుడూ (సాధారణంగా అతనే కథకుడుగానూ ఉంటాడు కాబట్టి) తిట్టుకుంటారు. రచయిత రాసింది నిజంగా మంచి కథే కావచ్చు. కాని జనానికి నచ్చనినాడు అది పనికిరాని కథకిందే లెక్క. ఇన్నేళ్ల పరిశీలన తర్వాత కథల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రేక్షకుల్ని మెప్పించవచ్చని నా అభిప్రాయం.

పాత్రలు

కథకి ముఖ్యమైనవి పాత్రలు. ప్రతి పాత్రకీ తనదైన ‘పర్పస్’ ఉండి తీరాలి. అనవసర పాత్రలు జనానికి విసుగు పుట్టించడమే కాకుండా, ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెంచుతాయి. పర్పస్‌తో పాటు పాత్రోచితమైన ‘డిగ్నిటీ’ చాలా అవసరం. కథ నడకతో పాటు పాత్ర పోషణ (కేరక్టర్ డెవలప్‌మెంట్) విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.

అలా సృజించిన పాత్రల్ని చివరకు నట్టడవిలో వదిలేయకుండా  సముచితంగానూ, సమంజసం అనిపించేట్లు గానూ ముగించాలి. ఎలాంటి సన్నివేశాల్లోనూ పాత్రల్లో ఏమాత్రం కృత్రిమత్వం కనిపించకూడదు. కనిపించిందంటే ప్రేక్షకుల్ని దూరం చేసుకున్నట్లే.

స్పెషల్ ఆర్టికల్: సినిమాకి ఏవి కీలకం?

సంభాషణలు

కథలో పాత్రల తర్వాత, ముఖ్యంగా జనాకర్షణకి తోడ్పడేవి సంభాషణలు. పాత్రలకి ప్రాణం ఈ సంభాషణలే. కథలో పటుత్వం ఏమీ లేకపోయినా కేవలం సంభాషణల మీద ఆధరపడి సక్సెసయిన సినిమాలెన్నో ఉన్నాయి. కథకి మంచి సంభాషణలు ఎంత ముఖ్యమో వాటిని రాయడం అంత కష్టం. గొప్ప కథలు సృష్టించిన వాళ్లంతా గొప్పగా సంభాషణలు రాయలేరు.

మన తెలుగులో రచయితలకి ఇవ్వాల్సినంత గుర్తింపూ, గౌరవం ఇవ్వకపోవడం వల్లే అడపాదడపా తప్ప గొప్ప కథలు కానీ, సందర్భోచితమైన చక్కని డైలాగులు కానీ సినిమాల్లో కనిపించడం లేదు. అందుకే నిర్మాతలు కేవలం పెట్టుబడి పెట్టడమే తమ పని అనుకోకుండా, క్రేజీ కాంబినేషన్లని సంపాదించడమే తమ పని అనుకోకుండా, మంచి కథ సంపాదించే విషయంలో చాలా శ్రద్ధ చూపాలి.

అవసరమనుకుంటే ఒక్కరితోనే కాకుండా ఇద్దరు ముగ్గురిని కలిపి కథ రాయించాలి. దాన్ని మరో ఇద్దరిచేత ‘అడాప్ట్’ చేయించాలి. ఈ మధ్య మన పేరుపొందిన కొంతమంది దర్శకులు ఇలా తమ వద్ద పనిచేసే రచయితల చేత ఈ పనులన్నీ చేయించుకుని టైటిల్స్‌లో వారికి క్రెడిట్ ఇవ్వకుండా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం అని తమ ఒక్కరిపేరే వేయించుకుంటూ ఆ రచయితలకు అన్యాయం చేస్తున్నారు.

ఈ విషయంలో యస్.యస్. రాజమౌళి అభినందనీయుడు. కథ, సంభాషణల క్రెడిట్‌ను ఆయా రచయితలకు ఇచ్చేస్తుంటాడు. ఈ విషయంలో ఆయన్ని అనుసరిస్తే రచయితలు మరింతమంది వెలుగు చూస్తారు. మంచి కథలు రాసే ఉత్సాహం వారిలో కలుగుతుంది.

ప్రేక్షకులకి ఇంటరెస్ట్ కలిగించకుండా కొంతవరకు సినిమా నడిచినా ఒక్క సన్నివేశంతో వాళ్లని గొల్లుమని నవ్వించేట్లు చేసి, సినిమాని రక్తి కట్టించవచ్చు. ఇటీవలి ‘ఎఫ్2’, ‘చిత్రలహరి’ సినిమాలు ఇందుకు చక్కని ఉదాహరణలు. సంభాషణల్లో సాధ్యమైనంతవరకూ సున్నితమైన హాస్యం, భావ గాంభీర్యం, సమయస్ఫూర్తి కలిగిన ‘రిపార్టీ’ ఉండాలి.

చెప్పవలసినదెంత పెద్ద విషయమైనా వీలైనంత క్లుప్తంగా చెబితేనే బోర్‌కొట్టకుండా ఉంటుంది. డైలాగ్స్ పేలవంగా ఉన్న సినిమా దెబ్బతిన్నదన్న మాటే. భాష ఎంత పొంకంగా ఉంటే అంత మంచిది. పొల్లు మాటలు లేకుండా ఉంటే మరీ మంచిది.

పాత్రలమీద ప్రేక్షకులకి కలిగే ఇంటరెస్టంతా సంభాషణల మీదే ఆధరపడి ఉంటుంది కాబట్టి, వాటిని రాయడంలో ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. కొంతమంది రచయితలు కథ నడపడం చేతకాక, మాటలతో కథ చెబుతారు. అలా చెయ్యడం చాలా తప్పు. జరగబోయే కథని ముందే మాటల్లో తెలియజేయడమంటే, సినిమాని చేతులార ఖూనీ చేయడమే.

రాబోయే కథని సస్పెన్సులో పెట్టి, ముందేం జరుగుతుందో అని జనం అనుకునేట్లు చేయాలి. కథ నడుస్తున్న కొద్దీ, ఇంటరెస్టు, స్పీడు పెరిగేట్లు చేయాలి. అన్నింటికంటే ముఖ్యం – కథారంభాన్ని ఆకర్షణీయంగా ఎత్తుకొని, ముగింపు ప్రేక్షక హృదయాల్లో నిల్చిపోయేటట్లు చూడాలి.

– వనమాలి

స్పెషల్ ఆర్టికల్: సినిమాకి ఏవి కీలకం? | actioncutok.com

Trending now: