‘మహర్షి’కి రూ. 150 కోట్లు సాధ్యమేనా?


'మహర్షి'కి రూ. 150 కోట్లు సాధ్యమేనా?

‘మహర్షి’కి రూ. 150 కోట్లు సాధ్యమేనా?

మహేశ్ హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా మే 9న వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో విడుదలవుతోంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా నిజానికి ఏప్రిల్ 25న విడుదలవ్వాల్సింది. 26న హాలీవుడ్ సినిమా ‘అవెంజర్స్: ఎండ్‌గేం’ విడుదల ఉండటంలో కలెక్షన్లను అది మింగేస్తుందనే భయంతో విడుదల తేదీని మే 9కి మార్చారు.

వాళ్ల భయం నిజమేనని ‘అవెంజర్స్: ఎండ్‌గేం’ రాకతో స్పష్టమైంది. ఇప్పుడు 9న ఎలాంటి భయాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ‘మహర్షి’. ప్రి రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ రిలీజ్‌తో సినిమాపై అంచనాలు అనూహ్య స్థాయిలో పెరిగాయి. ఇప్పుడు అందర్ మనసుల్నీ తొలుస్తున్న ప్రశ్న.. ‘మహర్షి’ ఏ క్లబ్బులో చేరతాడు?.. అని.

కొంతమంది రూ. 100 కోట్ల క్లబ్బులో చేరడం గ్యారంటీ అంటుంటే, ఇంకొంత మంది రూ. 150 కోట్ల క్లబ్బులో చేరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘స్పైడర్’ సినిమా అన్ని భాషల్లో కలిపి ప్రి రిలీజ్ బిజినెస్ రూ. 125 కోట్ల దాకా జరగడంతో ఆ సినిమా రూ. 150 కోట్ల క్లబ్బులో చేరుతుందని అభిమానులు, విశ్లేషకులు భావించారు.

కానీ ఆ సినిమా రూ. 100 కోట్ల క్లబ్బుకు కూడా చాలా దూరంలో ఉండిపోయి డిజాస్టర్ అయ్యింది. మహేశ్ కెరీర్‌లో ఇప్పటి దాకా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ‘భరత్ అనే నేను’. అది రూ. 94.80 కోట్ల షేర్ సాధించింది.

మహేశ్ కెరీర్‌లో హీరోగా నటించిన 25వ సినిమాగా, ఒక మైలురాయికి గుర్తుగా విడుదలవుతున్న ‘మహర్షి’ రూ. 100 కోట్లను ఈజీగా దాటేసి, రూ. 150 కోట్ల క్లబ్బులో చేరతాడని అతని అభిమానులు ఆశపడుతున్నారు. అది అత్యాశ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం మహేశ్ ఇమేజ్ పీక్ స్టేజ్‌లో ఉందనీ, వేసవి సీజన్ కావడంతో ఏ రికార్డులైనా సాధించడానికి ఇది అనువైన సమయమనీ, సినిమా బావుందని టాక్ వస్తే మాత్రం కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమనీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇటు అభిమానుల, అటు విశ్లేషకుల అంచనాల్ని ‘మహర్షి’తో మహేశ్ అందుకుంటాడా? వారం రోజుల్లో ఏ విషయమూ తేలనున్నది.

  • సజ్జా వరుణ్

‘మహర్షి’కి రూ. 150 కోట్లు సాధ్యమేనా? | actioncutok.com

Trending now: