50 ఏళ్ల అక్కినేని ‘ఆదర్శ కుటుంబం’

50 ఏళ్ల అక్కినేని ‘ఆదర్శ కుటుంబం’
అక్కినేని నాగేశ్వరారావు కథానాయకుడిగా కె. ప్రత్యగాత్మ డైరెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 50 వసంతాలు. అంటే 1969 జూన్ 6న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జయలిత నాయికగా నటించిన ఈ సినిమాలో సాలూరి రాజేశ్వరరావు స్వరపరచిన పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి, కనిపిస్తూనే ఉంటాయి. “చేయీ చేయీ కలిపి”, “హల్లో సారూ ఓ దొరగారూ”, “బిడియమేలా ఓ చెలీ” పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఉమ్మడి కుటుంబం గొప్పతనాన్ని తెలియజేసిన ఈ సినిమాకు ఆ ఏడాది ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు లభించడం విశేషం.
కథ
రాఘవేంద్రరావు, రాజ్స్యలక్ష్మి దంపతులకు నలుగురు కొడుకులు, ఒక కూతురు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలతో పాటు వ్యవసాయం పనులు కూడా పెద్ద కొడుకు పట్టాభి, పెద్ద కోడలు జానకి చూసుకుంటూ ఉంటారు. రెండో కొడుకు ప్రకాశం ఊరి రాజకీయాల్లో ఆసక్తి చూపిస్తూ సమయాన్ని వృథా చేస్తుంటే, అతని భార్య జయ ఇంటి పనుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా సోమరిగా కాలం వెళ్లదీస్తూ ఉంటుంది. మూడో కొడుకు ప్రతాప్‌కి ఎంతసేపూ తన తండి, తన కండల గురించే ఆలోచన. భార్య రమను ఏమాత్రం పట్టించుకోడు.
ఇక చిన్నవాడు ప్రసాద్ ఒక్కడే ఆ ఇంట్లో ఉన్నత విద్య చదువుకున్నవాడు. సరోజ అనే డాక్టర్‌తో ప్రేమలో పడతాడు. ఇక కూతురు చంద్ర భర్త సూర్యం రేచీకటితో ఇబ్బందిపడుతూ ఉంటాడు. పనీ పాటా లేకుండా ఇల్లరికంలో హాయిగా రోజులు గడిపేస్తూ ఉంటాడు. అతని తల్లి దుర్గమ్మ తరచూ వచ్చిపోతూ ఆ కుటుంబ సభ్యుల మధ్య కలతలు సృష్టించడమే పనిగా పెట్టుకుంటుంది. పట్టాభి, జానకిల మంచితనాన్ని అలుసుగా తీసుకొని అందరూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సరోజను పెళ్లాడిన ప్రసాద్.. ఎలా భార్య సహకారంతో ఆ ఇంటిలోని కలతల్ని రూపుమాపి, అందరినీ ఒక్కటి చేశాడనేది మిగతా కథ.
తారాగణం
అక్కినేని నాగేశ్వరరావు (ప్రసాద్), సరోజ (జయలలిత), పట్టాభి (గుమ్మడి), జానకి (అంజలీదేవి), ప్రకాశం (నాగభూషణం), జయ (ఎస్. వరలక్ష్మి), చిత్తూరు నాగయ్య (రాఘవేంద్రరావు), హేమలత (రాజ్యలక్ష్మి), సూర్యకాంతం (దుర్గమ్మ), ప్రతాప్ (భీమరాజు), రమ (గీతాంజలి), పద్మనాభం (సూర్యం), అనిత (చంద్ర), రమణారెడ్డి (దామోదరం), సాక్షి రంగారావు (అప్పయ్య పంతులు), విజయలలిత (సునీత), సురభి బాలసరస్వతి, శశికళా మస్తాన్ రావు, సీతారాం, రామకోటి, మాస్టర్ బాబు, మాస్టర్ ఆదినారాయణ, బేబీ విజయలక్ష్మి
కథ: ప్రత్యగాత్మ
స్క్రీన్‌ప్లే: ప్రత్యగాత్మ, ఆత్రేయ
సంభాషణలు: ఆత్రేయ
పాటలు: కొసరాజు, ఆత్రేయ, సి. నారాయణరెడ్డి
ప్లేబ్యాక్: ఘంటసాల, పి. సుశీల, జయదేవ్
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
ఛాయాగ్రహణం: పి.ఎస్. సెల్వరాజ్
ఎడిటింగ్: జె. కృష్ణస్వామి, టీవీ బాలు
కళ: జి.వి. సుబ్బారావు
నృత్యాలు: చిన్ని-సంపత్, చోప్రా
నిర్మాత: ఎ.వి. సుబ్బారావు
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
బేనర్: ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ప్రై.లిమిటెద్.
విడుదల తేదీ: 6 జూన్ 1969
50 ఏళ్ల అక్కినేని ‘ఆదర్శ కుటుంబం’ | actioncutok.com
More for you: