విజయనిర్మల ఇక లేరు


విజయనిర్మల ఇక లేరు

విజయనిర్మల ఇక లేరు

తెలుగు సినిమాకు గిన్నిస్ బుక్‌లో స్థానం కల్పించిన అతికొద్ది మంది వ్యక్తుల్లో ఒకరైన నటి, దర్శకురాలు విజయనిర్మల (73) అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుద్ధవారం అర్థరాత్రి చివరి శ్వాస విడిచారు. తెలుగు సినీ పరిశ్రమలో దర్శకురాళ్లే తక్కువమంది కాగా, పేరుపొందిన దర్శకురాళ్ల సంఖ్య మరీ స్వల్పం. భానుమతి తర్వాత అంతటి నటదర్శకురాలిగా పేరు సంపాదించుకున్నది విజయనిర్మల మాత్రమే. ఆమె మృతితో ఒక గొప్ప శకం ముగిసినట్లయింది.

తను అనుకున్నది సాధించడానికి ఎంతటి కష్టానికైనా వెనుతీయని ఆమె గుణమే ఆమెకు ‘పని రాక్షసి’ అనే బిరుదునిచ్చింది. తన కెరీర్‌లో 250 సినిమాలకు పైగా నటించిన ఆమె 47 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఏడేళ్ల వయసులో ఆమె బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. అయితే ఆమె తొలిగా నటించింది టి.ఆర్. మహాలింగం డైరెక్ట్ చేసిన ఒక తమిళ సినిమాలో. బాలనటిగా ఆమె చివరి చిత్రం ‘పాండురంగ మహత్యం’.

మలయాళ సూపర్ స్టార్ ప్రేం నజీర్ సరసన ‘భార్గవి నిలయం’ (1964) అనే మలయాళం సినిమాలో తొలిసారి నాయికగా నటించారు విజయనిర్మల. తెలుగులో నాయికగా ఆమె నటించిన తొలి చిత్రం బి.ఎన్. రెడ్డి దర్శకత్వం వహించిన ‘రంగుల రాట్నం’. కృష్ణ సరసన తొలిసారిగా బాపు రూపొందించిన ‘సాక్షి’లో నటించారు. అది హీరోయిన్‌గా తెలుగులో ఆమెకు మూడో చిత్రం.

ఇక దర్శకురాలిగా ఆమె తొలి చిత్రం మలయాళంలో వచ్చిన ‘కవిత’. తెలుగులో ఆమె డైరెక్ట్ చేసిన తొలి సినిమా ‘మీనా’. అందులో కథానాయకుడు కృష్ణ. పెళ్లికి ముందు 50 సినిమాల్లో నటించిన ఆమె, పెళ్లి తర్వాత 200 పైగా సినిమాల్లో నటించడం గమనార్హం. షిప్ డిజైనింగ్ ఇంజినీర్ అయిన మొదటి భర్త ద్వారా నరేశ్ పుట్టిన కొన్నాళ్లకు ఆమె భర్తకు విడాకులిచ్చి 1969లో తన అత్యధిక చిత్రాల హీరో కృష్ణను ద్వితీయ వివాహం చేసుకున్నారు. దర్శకురాలిగా ఆమె చివరి చిత్రం 2008లో వచ్చిన ‘సోల్జర్’. అందులోనూ కృష్ణ నటించారు.

విజయనిర్మల ఇక లేరు | actioncutok.com

More for you: