తమ్ముడ్ని పట్టించుకోని విజయ్ దేవరకొండ


– వనమాలి
తమ్ముడ్ని పట్టించుకోని విజయ్ దేవరకొండ

తమ్ముడ్ని పట్టించుకోని విజయ్ దేవరకొండ

స్వల్ప కాలంలో టాలీవుడ్‌లో స్టార్‌డం సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ‘పెళ్ళిచూపులు’, ‘అర్జున్‌రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలతో అతను నేటి తరం హీరోల్లో టాప్‌కు దూసుకెళ్లాడు. రవితేజ, నాని తరహాలో ఎలాంటి సినీ నేఅప్థ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన విజయ్.. తన నటనతో, తన యాటిట్యూడ్‌తో యువతరం ఆరాధ్య నటుడిగా రూపొందాడు.

కాగా అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ సైతం హీరో కావాలనే ఆశతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ‘దొరసాని’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ద్వారా డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక సైతం నాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజై కొన్ని రోజులు గడిచిపోయాయి. జూలైలో సినిమాని విడుదల చెయ్యడానికి నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి సన్నాహాలు చేస్తున్నాడు.

అయితే ఇప్పటివరకూ తమ్ముడి సినిమా గురించి విజయ్ ఎక్కడా ఒక్క మాట మాట్లాడలేదు. తమ్ముడ్ని ప్రమోట్ చేయడానికి కనీస ప్రయత్నం చెయ్యలేదు. సాధారణంగా తనవాళ్లకు సంబంధించిన సినిమా ఫస్ట్‌లుక్ వెల్లడైతే ఏ హీరో అయినా దాన్ని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేయడం పరిపాటి. విజయ్ ఆ పని కూడా చెయ్యలేదు. కానీ తన స్నేహితుడు, శేఖర్ కమ్ముల సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో తన సహనటుడు అయిన నవీన్ పోలిశెట్టి హీరోగా పరిచయమవుతున్న ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాను ప్రమోట్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఆ సినిమా ట్రైలర్‌ను షేర్ చేసి, నవీన్ ఎప్పుడూ తనను ఇన్‌స్పైర్ చేస్తుంటాడని తెలిపాడు.

తమ్ముడి విషయంలో విజయ్ ఇలా ఎందుకు చేస్తున్నాడా?.. అని ఇప్పటికే టాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు. కనీసం ‘దొరసాని’ ట్రైలర్ రిలీజయినప్పుడైనా దాని గురించీ, తమ్ముడి గురించీ విజయ్ మాట్లాడతాడేమోనని చర్చించుకుంటున్నారు.

తమ్ముడ్ని పట్టించుకోని విజయ్ దేవరకొండ | actioncutok.com

More for you: