Hippi Review: 2 Ups And 4 Downs
– బుద్ధి యజ్ఞమూర్తి

Hippi Review: 2 Ups And 4
తారాగణం: కార్తికేయ, జె.డి. చక్రవర్తి, దిగాంగన సూర్యవంశీ, జజ్బా సింగ్, వెన్నెల కిశోర్
దర్శకత్వం: టి.ఎన్. కృష్ణ
విడుదల తేదీ: 6 జూన్ 2019
‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో కార్తికేయ గుమ్మకొండ హీరోగా కేవలం గుర్తింపునే కాకుండా, యువతలో క్రేజ్ తెచ్చుకున్నాడు. చక్కని రూపం, ఫర్వాలేదనిపించే నటనతో మెప్పించాడు. ఆ సినిమా తర్వాత వస్తుండటంతో సహజంగానే ‘హిప్పీ’పై ప్రేక్షకులు ఆసక్తి చూపించారు, అంచనాలు వేసుకున్నారు. ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్. థాను నిర్మించడం కూడా ఈ సినిమా ఆకర్షణను పెంచింది. మరైతే సినిమా ఎలా ఉంది?
కథ
హిప్పీ అలియాస్ దేవదాస్ (కార్తికేయ) కేవలం సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి మాత్రమే కాదు, కిక్ బాక్సర్ కూడా. స్నేహ (జజ్బా సింగ్) అనే యువతితో సహ జీవనం చేస్తున్న హిప్పీ, ఆమె స్నేహితురాలు ఆముక్త మాల్యద (దిగాంగన)తో ప్రేమలో పడతాడు! హిప్పీ జీవితంలోంచి తప్పుకున్న స్నేహ, మరో యువకుడ్ని పెళ్లి చేసుకున్నాకే, హిప్పీ ప్రేమను స్వీకరిస్తుంది ఆముక్త. అప్పట్నుంచీ ఇద్దరూ సహ జీవనం మొదలుపెడతారు. కానీ తాను అనుకున్నదొకటి, జరుగుతున్నదొకటని హిప్పీ బాధపడతాడు. జీవితంలోని ఆనందం నాశనమయ్యిందని భావిస్తాడు. ఆ తర్వాత హిప్పీ ఏం చేశాడు? అతని జీవితంలోకి ఆనందం వచ్చిందా, లేదా?.. అనేది మిగతా కథ.

కథనం
హిప్పీ ఆత్మహత్యకు ప్రయత్నించి, మనసు మార్చుకొని, తన గాళ్‌ఫ్రెండ్ వెనుక మౌనంగా నడుస్తుండటంతో సినిమా ఆసక్తికరంగా మొదలైంది. ప్రఖ్యాత ఆంగ్ల కవి, వర్తకుడు జాన్ మెల్టన్ కవిత్వమంటే తనకు పిచ్చి అనీ, దాని ప్రభావం తనపై చాలా ఉందనీ, ‘హిప్పీ’ కథపై కూడా ఆ ప్రభావం ఉందనీ ఇదివరకే డైరెక్టర్ కృష్ణ చెప్పాడు. కానీ ‘హిప్పీ’ చూశాక అతని మాటలకీ, అతని సినిమాకీ సంబంధమేమీ కనిపించదు. ఒక క్లాసిక్ తరహాలో సినిమాని రూపొందించాడని భావించుకున్నవాళ్లు తీవ్ర అసంతృప్తికి గురవుతారు. కథని డైరెక్టర్ ఏ పాయింట్ మీద నడిపాడో అతనికే తెలియాలి. మనకైతే అర్థం కాదు.
హీరోతో హీరోయిన్ చేసిన చాకొలేట్ కామెడీ వల్గర్‌గా ఉండి జుగుప్స కలిగిస్తుంది. హీరోయిన్‌పై హీరోకు మనసుపుట్టే సన్నివేశం కూడా డైరెక్టర్ మానసిక స్థితిపై సందేహాన్ని కలిగిస్తుంది. హైదారాబాద్-గోవా హైవేపై ఉన్న మైలురాయిపై హీరోని అతని గాళ్‌ఫ్రెండ్ కౌగిలించుకుంటే, ఆమెను హీరో ముద్దుపెట్టుకుంటూ ఉన్నప్పుడు హీరోయిన్ అక్కడికి బైక్‌పై వస్తుంది. ఆమె హీరో గాళ్‌ఫ్రెండ్‌కి ఫ్రెండ్. ఆమెను చూడగానే హీరో మనసు పారేసుకుంటాడు. ఏమైనా అర్థముందా!
సినిమాలో డబుల్ మీనింగ్స్కి కొదవ లేదు. హీరో బాస్ (జె.డి. చక్రవర్తి) చేత ‘లేచింది’ లాంటి బూతు మాటలు పలికించి ఈ సినిమా క్వాలిటీని చేజేతులా తగ్గించేసుకున్నారు. హీరో హీరోయిన్లు కలిసి జీవనం మొదలుపెట్టాక వచ్చే సన్నివేశాలు చికాకు కలిగిస్తాయి. హిప్పీ కేరెక్టరైజేషన్ విసుగు పుట్టిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగికి కావాల్సిన లక్షణం దొమ్మీలో నలుగుర్ని చితగ్గొట్టడం! కాదన్నవాళ్లకు ‘హిప్పీ’ని చూపించండి! నిజం సార్. హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన లేడీ బాస్ హిప్పీని చూసి, అతని పనితనాన్ని శంకిస్తే, బాస్ ఆర్డర్ మేరకు చొక్కా విప్పి నలుగుర్ని కొడతాడు హిప్పీ. లేడీ బాస్ అతని కండల్ని చూసి మైమరచిపోతుంది!! వాట్ ఎ క్రియేటివిటీ!!!

తారల అభినయం
‘ఆర్ ఎక్స్ 100’లో నటుడిగా పాసైన కార్తికేయ ఈ సినిమాలో బాగా మెరుగయ్యాడు. నటుడిగా తనకు భవిష్యత్తు ఉందనిపించాడు. ఇక ‘టోన్డ్ బాడీ’తో యువతను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. డైరెక్టర్ కూడా పదే పదే అతడి నగ్న ఛాతీని చూపించడమే పనిగా పెట్టుకొని కథనాన్ని కంచిలో కలిపేశాడు. తనలో ‘చేవ’ ఉందని నిరూపించుకొనేలా హిప్పీ పాత్రను చిత్రించిన తీరు సినిమా ఆకర్షణని తగ్గించేసింది.
దిగాంగన కానీ, జజ్బా కానీ అందాల ఆరబోతకు పనికొచ్చారు కానీ, అభినయ పరంగా వాళ్లు చేసింది సున్నా. నటన విషయంలో జె.డి. అందర్నీ డామినేట్ చేస్తాడని ఎవరైనా ఊహించుకొంటే నిరాశపడక తప్పదు. తన నటనతో, డైలాగ్ డిక్షన్‌తో విసుగు పుట్టించాడు. సినిమాలో రిలీఫ్ పాయింట్ వెన్నెల కిశోర్. తన మార్క్ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు.
టెక్నీషియన్ల పనితీరు
కొన్ని సినిమాలకు అన్ని అంశాలూ బాగా కుదురుతాయి. కొన్ని సినిమాలకు ఏవీ సరిగా కుద్రలేదనిపిస్తుంది. ‘హిప్పీ’ ఈ రెండో రకానికి చెందిన సినిమా అని చెప్పాలి. సినిమాటోగ్రాఫర్‌గా అర్.డి. రాజశేఖర్ ప్రతిభావంతుడు. కానీ ఈ సినిమాలో అతని కెమెరా పనితనం పాటల్లో మాత్రమే కనిపించింది. సన్నివేశాల చిత్రీకరణ సాదాసీదాగా కనిపించడానికి బహుశా అనాకర్షకమైన సన్నివేశాల కల్పన అని భావించాలి.
నివాస్ ప్రసన్న సంగీతం గురించి గొప్పగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఏదో ఒక పాటలో ట్యూన్స్ క్యాచీగా ఉన్నాయనిపించిందంతే. బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్ని ఎలివేట్ చెయ్యలేకపోయింది. సినిమా బోరింగ్‌గా అనిపించడంలో ఎడిటర్ ప్రవీణ్ కె.ఎల్. తన వంతు పాత్ర పోషించినట్లుగా ఉంది తప్పితే, అతని కత్తెర సమర్థంగా వ్యవహరించినట్లు తోచదు.
చివరి మాట
భరించలేని కథనాన్ని చూడ్డానికి డబ్బులు పెట్టాలా!
Hippi Review: 2 Ups And 4 | actioncutok.com
More for you: