సినిమాలెందుకు హిట్టవుతాయి?: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే


– వనమాలి
సినిమాలెందుకు హిట్టవుతాయి?: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

సినిమాలెందుకు హిట్టవుతాయి?: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

ప్రతి యేటా వేసవి సీజన్‌లో విడుదలయ్యే అనేకానేక సినిమాల్లో ఏది విజేతగా నిలుస్తుందనేది అందరిలోనూ ఆసక్తిని కలిగించే అంశం. 2007 వేసవి సీజన్‌లో వెంకటేశ్ మినహా మరే టాప్ హీరో సినిమా విడుదల కాకపోవడం ఆయా హీరోల అభిమానులతో పాటు సినీ, ట్రేడ్ వర్గాల్ని ఒకింత అసంతృప్తికి గురిచేసిన మాట వాస్తవం. అయినప్పటికీ ‘ఢీ’, ‘ఆట’, ‘ఆపరేషన్ దుర్యోధన’ వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని కొద్దో గొప్పో అలరించాయి.

మొదట విమర్శకులు పెదవి విరిచిన, బాగా డివైడ్ టాక్ వచ్చిన ‘ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే’ సినిమా అనూహ్యరీతిలో రోజురోజుకీ వసూళ్లని పెంచుకుంటూ సమ్మర్ విన్నర్‌గా నిలిచి, అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2006లో ‘లక్ష్మీ’తో సంక్రాతి విజేతగా నిలిచిన వెంకటేశ్, 2007 భారీ సీజన్‌లోనూ తనకు ఎదురులేదని నిరూపించుకొని ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మరింత ఇమేజ్ సంపాదించుకున్నాడు.

27 ఏప్రిల్ 2007న 230 ప్రింట్లతో విడుదలైన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమా రూ. 19 కోట్ల షేర్‌తో (గ్రేట్ ఆంధ్రా డాట్ కాం ప్రకారం) ఆ యేడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అప్పటికి వెంకటేశ్ కెరీర్‌లోనూ ఈ సినిమాదే రికార్డ్.

తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన ఈ సినిమాలో తండ్రీ కొడుకుల సెంటిమెంట్, హీరో పాత్రపై సానుభూతి, హీరోయిన్ త్రిష పాత్ర చిత్రణ.. సినిమా విజయానికి ప్రధానంగా తోడ్పడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆఖరుకి విమర్శకులు ఎబ్బెట్టుగా ఉందని తేల్చిన టాయిలెట్ కామెడీ సైతం ప్రేక్షకుల్ని బాగా అలరించిందనేది స్పష్టం.

సినిమాలెందుకు హిట్టవుతాయి?: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

చాలా సినిమాల్లో చూపించిన దానికి భిన్నంగా ఈ సినిమాలో తండ్రీ కొడుకుల పాత్రల్ని చూపించాడు దర్శకుడు. తరచూ పోట్లాడుకుంటున్నట్లు కనిపించే ఆ తండ్రీ కొడుకుల మధ్య ఒకరంటే ఒకరికి ఎంత ఆపేక్ష, అనురాగం ఉందో ఆ తండ్రి మీద త్రిష చేయి చేసుకున్న తర్వాత సన్నివేశాల్లో కనిపించే తీరు ప్రేక్షకుల మీద బలమైన ముద్రనే వేసింది. ఆ పాత్రల్లో కోట శ్రీనివాసరావు, వెంకటేశ్ ప్రదర్శించిన అభినయం వాళ్ల హృదయాల్ని స్పృశించింది. హీరో వెంకటేశ్‌లో వయసు మీరుతున్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నా, పాత్ర కూడా ముప్పయ్యేళ్ల పైబడ్డది కావడం ఆయనకు సరిగ్గా నప్పింది.

సినిమాకీ, టైటిల్‌కీ సంబంధం లేకపోయినా, టైటిల్ మహిళల్ని ఆకట్టుకొనే రీతిలో ఉన్నా.. అన్ని వర్గాల ప్రేక్షకులూ ఈ సినిమాని ఆదరించడం వల్లే అంతటి భారీ విజయం సాధ్యపడింది. ఆ ప్రేక్షకుల్లో యువత కూడా ఎక్కువగానే ఉంది. “నా పాత్రలో ప్రతి ఒక్కరూ తమని తాము ఐడెంటిఫై చేసుకున్నారు. చక్కని ఆరోగ్యకరమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమా ఇది. యువన్‌శంకర్ రాజా సంగీతం సినిమాకి ప్రధాన ఎస్సెట్. ఇవే ఈ సినిమాకి అంతటి విజయాన్ని సాధించిపెట్టాయి” అని చెప్పారు వెంకటేశ్.

ఈ సినిమా విడుదలైన తొలి 50 రోజుల్లో దానికి సంబంధించిన ఒకరు 15 సార్లు చూశారు. ఆ ఒకరు.. త్రిష! అవును. సాధారణంగా తెలుగేతర హీరోయిన్లు తాము నటించిన తెలుగు సినిమాల్ని ఒకసారి చూడటమే గగనమైన ఈ కాలంలో ఆమె ఆ సినిమాని అన్నిసార్లు చూడటం చిన్న విషయమేమీ కాదు. అంతగా ఆ సినిమా ఆమెని కదిలించిందంటే, ఇక సాధారణ ప్రేక్షకుల్ని ఇంకెంతగా ‘ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే’ కదిలించి ఉంటుందో ఊహించుకోవాల్సిందే.

సినిమాలెందుకు హిట్టవుతాయి?: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే | actioncutok.com

More for you: