హాస్య బ్రహ్మ లేని లోటు తెలుస్తోంది! (జంధ్యాల వర్ధంతి)


– వనమాలి
హాస్య బ్రహ్మ లేని లోటు తెలుస్తోంది! (జంధ్యాల వర్ధంతి)
Jandhyala

హాస్య బ్రహ్మ లేని లోటు తెలుస్తోంది! (జంధ్యాల వర్ధంతి)

విఖ్యాత రచయిత, దర్శకుడు జంధ్యాల మరణించి నేటికి 18 సంవత్సరాలు గడిచాయి. బూతుకు దూరంగా ఆరోగ్యకర హాస్యంతో సినిమాలు రూపొందించి ప్రేక్షకుల్ని అలరించిన హాస్యబ్రహ్మ లేని లోటు ఇవాళ మరింతగా కనిపిస్తున్నదనేది పచ్చి నిజం.

నాటక రంగం నుంచి సినీ రంగానికి వచ్చి విజయం సాధించిన అనేక మందిలో జంధ్యాల కూడా ఒకరు. ఆయన పూర్తి పేరు జంధ్యాల వేంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. హాస్యప్రియుడైన జంధ్యాల కాలేజీ రోజుల నుంచే నాటకాలు రచించి, నటించ్, దర్శకత్వం వహించారు. అలా ఒకసారి మద్రాస్ కళాసాగర్‌లో నాటకం వేసినప్పుడు దిగ్దర్శకుడు బి.ఎన్. రెడ్డి దృష్టిలో పడ్డారు.

బీనాదేవి రచన ‘హేంగ్ మి క్విక్’ అనే నవల ఆధారంగా సినిమా తీద్దామని నిర్ణయించుకున్న బి.ఎన్.. అందులో హీరో వేషాన్ని జంధ్యాల చేత వేయించాలనుకొని కబురుపెట్టారు. అలా 1973లో మద్రాసులో సినిమాల కోసమని వచ్చారు జంధ్యాల. అయితే తాననుకున్న సినిమాని తియ్యలేకపోయారు బి.ఎన్. దీంతో చేసేది లేక నటుడవ్వాలని వచ్చిన జంధ్యాల రచయిత అవతారం ఎత్తారు.

‘పెళ్లి కాని పెళ్లి’ అనే సినిమాకు తొలిగా రచన చేశారు. కానీ మొదట విడుదలైన చిత్రం ‘దేవుడు చేసిన బొమ్మలు’ (1976). ఆ సినిమా నుంచే ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. రెండు దశాబ్దాల పాటు తిరుగులేని సంభాషణల రచయితగా రాణించిన జంధ్యాల దాదాపు 360 సినిమాలకు మాటలు రాశారు.

‘ముద్ద మందారం’ (1981)తో దర్శకుడిగా మారిన ఆయన మొత్తం 39 చిత్రాలకు దర్శకత్వం వహించారు. జంధ్యాల అభిమాన నటుడు చార్లీ చాప్లిన్. ఆయన ఇంటికి వెళ్తే మొదట ఎదురయ్యేది గోడపై చార్లీ చాప్లిన్ చిత్రపటమే. ఒక సినిమాలో జంధ్యాల కీలక పాత్ర చేశారు. ఆ సినిమా కె. విశ్వనాథ్ రూపొందించిన ‘ఆపద్బాంధవుడు’. అందులో హీరోయిన్ మీనాక్షి శేషాద్రి తండ్రిగా ఉన్నత స్థాయి నటనను ప్రదర్శించారు. ఆ సినిమాతో బాటు విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ‘సిరిసిరి మువ్వ’, ‘శుభోదయం’, ‘సీతా మహాలక్ష్మి’, ‘సాగర సంగమం’, ‘శంకరాభరణం’ చిత్రాలకు మాటలు రాశారు జంధ్యాల. వాటిలో ‘సాగర సంగమం’, ‘శంకరాభరణం’ ఎంతటి క్లాసిక్సో తెలిసిందే.

తను డైరెక్ట్ చేసిన ‘నాలుగు స్తంభాలాట’ సినిమాలో ‘సుత్తి’ అనే మాటని ప్రయోగించి, దానికి తెలుగునాట అత్యంత ప్రాచుర్యం కల్పించారు. ఎవరైనా ఆగకుండా కబుర్లు చెబుతుంటే ‘సుత్తి కొడుతున్నాడు’ అనడం పరిపాటి అయ్యిందంటే.. ఆ మాట మహత్యం అర్థమవుతుంది. అదే మాట ఇద్దరు నటులకు ఇంటి పేరుగా కూడా మారిపోయింది. ఆ నటులు ‘సుత్తి వీరభద్రరావు’, ‘సుత్తి వేలు’. ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంతోటే ఆ ఇద్దరూ వెలుగులోకి వచ్చారు.

హాయ్సం పేరిట బూతు రాజ్యం చేస్తున్న కాలంలో సినిమాలు తియ్యడానికి ఆయన చాలా ఇబ్బందిపడ్డారు. మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉండిపోయారు. ‘విచిత్రం’ (1999) ఆయన చివరి చిత్రం. అద్భుతమైన హాస్య చిత్రాల్ని ప్రేక్షకులకు అందించినా ఆ హాస్యబ్రహ్మ 19 జూన్ 2001న మృతి చెందారు. హాస్య చిత్రానికి గొప్ప గౌరవం తీసుకొచ్చిన ఆయన లేకపోవడంతో ఒక గొప్ప హాస్య శకం ముగిసింది. ఆ రోజులు మళ్లీ ఇంతవరకూ రాలేదు.

జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రాలు

1. ముద్ద మందారం  2. మల్లె పందిరి  3. నాలుగు స్తంభాలాట  4. నెలవంక  5. రెండుజెళ్ల సీత  6. అమరజీవి  7. మూడు ముళ్లు  8. శ్రీవారికి ప్రేమలేఖ  9. ఆనంద భైరవి  10. ఆనంద భైరవి (కన్నడం)  11. రావూ గోపాల్రావూ  12. పుత్తడిబొమ్మ  13. బాబాయ్ అబ్బాయ్  14. శ్రీవారి శోభనం  15. మొగుడూ పెళ్లాలూ!  16. ముద్దుల మనవరాలు  17. రెండు రెళ్లు ఆరు  18. సీతారామ కల్యాణం  19. చంటబ్బాయ్  20. పడమటి సంధ్యారాగం  21. రాగలీల  22. సత్యాగ్రహం  23. అహ నా పెళ్లంట  24. చిన్ని కృష్ణుడు  25. వివాహ భోజనంబు  26. నీకూ నాకూ పెళ్లంట  27. చూపులు కలసిన శుభవేళ  28. హైహై నాయకా  29. జయమ్ము నిశ్చయమ్మురా  30. లేడీస్ స్పెషల్  31. బావా బావా పన్నీరు  32. ప్రేమ ఎంత మధురం  33. విచిత్ర ప్రేమ  34. బాబాయ్ హోటల్  35. ప్రేమా జిందాబాద్  36. అఆఇఈ  37. ష్.. గప్ చుప్  38. ఓహో నా పెళ్లంట  39. విచిత్రం

హాస్య బ్రహ్మ లేని లోటు తెలుస్తోంది! (జంధ్యాల వర్ధంతి) | actioncutok.com

More for you: