‘సలాం సాహో’ అంటున్న జాతీయ మీడియా!


– కార్తికేయ
'సలాం సాహో' అంటున్న జాతీయ మీడియా!

‘సలాం సాహో’ అంటున్న జాతీయ మీడియా!

శంకర్ ‘రోబో’ తీసినా, ‘2.0’ తీసినా దేశవ్యాప్తంగా అమితాసక్తి వ్యక్తమైంది. రజనీకాంత్ రోబోగా చేయడం, మొదటి దాంట్లో రోబోనే విలన్‌గా మారడం, రజనీ, ఐశ్వర్య జంటగా నటించడం ఆసక్తికి కారణమైతే, రెండో సినిమా మొదటి దానికి సీక్వెల్ కావడం, అక్షయ్ కుమార్ విలన్‌గా చెయ్యడం కారణం. అవే ఆ సినిమాలకు ప్లస్ పాయింట్లుగా మారి విపరీతమైన ప్రచారాన్ని కల్పించాయి. వందల కోట్ల రూపాయల వ్యయంతో తీసిన వాటికి అందుకు తగ్గ వసూళ్లు లభించాయి.

ఎస్.ఎస్. రాజమౌళి ‘బాహుబలి’ తీసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఆ సినిమా కోసం ఎదురు చూశారు. కారణం కరణ్ జోహార్ వంటి వ్యాపారవేత్త అయిన హిందీ దర్శకనిర్మాత ఆ సినిమాని భారీ ధర చెల్లించి హిందీలో విడుదల చెయ్యడం. అందుకు తగ్గట్లే ఆ సినిమా సంచలన విజయాన్ని నమోదు చెయ్యడం, దాని సీక్వెల్ ‘బాహుబలి: ద కంక్లూజన్’కు మరింత ప్రచారం రావడం మనం చూశాం. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ఒకే ఒక్క అంశంతో రెండో సినిమా మొదటిదాన్ని మించి ప్రచారానికి నోచుకొని, వసూళ్ల విషయంలో దేశంలోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరలేదు.

'సలాం సాహో' అంటున్న జాతీయ మీడియా!

ఇప్పుడిదంతా చెప్పడం ఎందుకంటే.. ‘సాహో’ గురించి మాట్లాడుకోడానికి. ‘బాహుబలి’కి అంత ప్రచారం రావడానికి కారణం అది రాజమౌళి సినిమా కావడమేననీ, హీరో ప్రభాస్‌కు మించి దేశవ్యాప్తంగా ఆయనకున్న ఇమేజే ఆ సినిమాకి అంత క్రేజ్ వచ్చిందనీ అంతా భావించారు. కానీ రాజమౌళి లేకుండానే ‘సాహో’ సినిమా అదే స్థాయిలో ప్రచారం పొందడం విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఒక తెలుగు నటుడు నటిస్తున్న, ప్రధానంగా తెలుగులో రూపొందుతున్న ‘సాహో’ రెండు తెలుగు రాష్ట్రాల్లోని మీడియాని అమితంగా ఆకర్షించడంలో ఆశ్చర్యం లేదు కానీ, జాతీయ స్థాయి వార్తా పత్రికలు, టీవీ చానళ్లు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా సైతం ఒక బాలీవుడ్ టాప్ స్టార్ సినిమా స్థాయిలో ప్రచారాన్ని ఇస్తుండటం నిస్సంశయంగా విస్మయానికి గురిచేసే అంశమే. ఎందుకు కట్టగట్టుకున్నట్లు మీడియా ‘సాహో’కి అంత ప్రాధాన్యాన్నీ, ప్రచారాన్నీ ఇస్తున్నట్లు?

'సలాం సాహో' అంటున్న జాతీయ మీడియా!

యూట్యూబ్‌లో విడుదలచేసిన ‘సాహో’ అధికారిక టీజర్‌కు వారం రోజుల్లోనే మూడు భాషల్లో కలిపి 73 మిలియన్ వ్యూస్ రావడమంటే మాటలా! ఇదంతా దానికి లభిస్తున్న ప్రచార ఫలితమే. ‘బాహుబలి’కి ముందు ప్రభాస్ ఇమేజ్ వేరు. టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్, మహేశ్, జూనియర్ ఎన్టీఆర్ తర్వాతే అతని పేరుండేది. కానీ ‘బాహుబలి’తో అతను జాతీయ స్థాయి స్టార్ అయిపోయాడు. ‘బాహుబలి 2’ సాధించిన రికార్డుల దరిదాపుల్లోకి మరే టాలీవుడ్ హీరో సినిమా లేదు.

అందుకే ‘సాహో’ సినిమాకు ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ డైరెక్ట్ చేస్తున్నప్పటికీ దేశవ్యాప్త సినిమా అభిమానుల్లో క్రేజ్ లభిస్తోంది. ఇవాళ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందయ్యా అంటే కేవలం ఓవర్సీస్ బిజినెస్సే రూ. 40 కోట్లకు పైగా జరిగేంతగా. రానున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘సైరా’ సైతం ఆ విషయంలో ‘సాహో’తో పోటీలోనే లేదు. అంటే ఇవాళ టాలీవుడ్‌లో అగ్ర నటుడెవరో దీన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు.

'సలాం సాహో' అంటున్న జాతీయ మీడియా!

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఏక కాలంలో ఆగస్ట్ 15న ‘సాహో’ విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ నటులు విలన్లుగా, కీలక పాత్రధారులుగా కనిపించనున్నారు.

అమితమైన ప్రచారంతో విడుదలయ్యే సినిమాపై ప్రేక్షకుల అంచనాలు కూడా అదే తీరులో ఉండటం సహజం. గతంలో చాలా సినిమాలకి ఇదే అంశం ప్రతికూలంగా మారి, వాటి బాక్సాఫీస్ ఫలితాన్ని నిర్దేశించింది. ‘సాహో’పై అయితే ఆ అంచనాలు మరీ ఎక్కువ. అయితే తన సమ్మోహన శక్తితో అందరికీ డార్లింగ్‌గా మారిన ప్రభాస్ మరోసారి ‘సాహో’తో సమ్మోహితుల్ని చేస్తాడనీ, ‘సలాం సాహో’ అనిపిస్తాడనీ ఆశిద్దాం.

‘సలాం సాహో’ అంటున్న జాతీయ మీడియా! | actioncutok.com

More for you: