‘వజ్ర కవచధర గోవింద’ అలరిస్తాడా?


– సజ్జా వరుణ్
'వజ్ర కవచధర గోవింద' అలరిస్తాడా?

‘వజ్ర కవచధర గోవింద’ అలరిస్తాడా?

కమెడియన్‌గా మంచి డిమాండ్ ఉండగా హీరోగా మారి మొదట్లో విజయాలు సాధించి, తర్వాత వరుస ఓటములతో కెరీర్ ప్రమాదంలో పడి, తిరిగి కమెడియన్లుగా మారిన వాళ్లను కళ్ల ముందు చూస్తూనే ఉన్నాం. అలీ, సునీల్ వంటి టాప్ కమెడియన్లకు సైతం ఈ పరిస్థితి తప్పలేదు.

అయినప్పటికీ ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’తో హీరో అయ్యాడు కమెడియన్ సప్తగిరి. ఆ సినిమాకి ముందు అతను హాస్యంలో తనదైన ముద్రను వేశాడు. ‘ప్రేమకథా చిత్రం’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘కొత్త జంట’, ‘పవర్’, ‘టెంపర్’, ‘రాజుగారి గది’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వంటి సినిమాలతో సప్తగిరి కమెడియన్‌గా ప్రేక్షకుల్ని అమితంగా అలరించి, టాలీవుడ్‌లోని టాప్ కమెడియన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.

అరుణ్ పవార్ డైరెక్షన్‌లో చేసిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ (2016) సినిమాతో హీరోగా మారాడు సప్తగిరి. ఇది తమిళ హిట్ ఫిల్మ్ ‘తిరుడాన్ పోలీస్’కు రీమేక్. ప్రేక్షకులు ఈ సినిమాని ఓ మోస్తరుగా ఆదరించారు. ఆ వెంటనే హిందీ హిట్ ఫిల్మ్ ‘జాలీ ఎల్ఎల్‌బీ’ని ‘సప్తగిరి ఎల్ఎల్‌బీ’ (2017)గా రీమేక్ చేశాడు. కానీ ప్రేక్షకులు దీన్ని తిరస్కరించారు.

హీరోగా మారినంత మాత్రాన కమెడియన్ కేరెక్టర్స్ పూర్తిగా వదిలేయలేదు సప్తగిరి. అడపాదడపా ఇతర చిత్రాల్లో రెగ్యులర్ కమెడియన్ కేరెక్టర్స్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఇదివరకు ఏడాదికి 15 సినిమాల్లో కనిపించే అతను రెండు మూడు సినిమాలకు పరిమితమయ్యే పరిస్థితిని కావాలని తెచ్చుకున్నాడు. 2018లో అయితే ‘నీవెవరో’ అనే సినిమాలో మాత్రమే అతను కనిపించాడు.

ఇప్పుడు మరోసారి ‘వజ్ర కవచధర గోవింద’ సినిమాతో హీరోగా రేపు (జూన్ 14) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సప్తగిరి. హీరోగా తన తొలిచిత్ర దర్శకుడు అరుణ్ పవార్‌తో మరోసారి ఈ సినిమాలో కలిసి పనిచేశాడు. ఈ సినిమాని జనం ఆదరిస్తారనీ, కామెడీ హీరోగా తన కెరీర్‌కు ఈ సినిమా టానిక్‌లా పనిచేస్తుందనీ సప్తగిరి ఆశిస్తున్నాడు. అతని ఆశలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.

‘వజ్ర కవచధర గోవింద’ అలరిస్తాడా? | actioncutok.com

More for you: