ఆఫ్‌బీట్: చిన్ని చిన్ని ఆనందాలు.. ఉద్వేగాలు!


– వి. రంగనాథ్
ఆఫ్‌బీట్: చిన్ని చిన్ని ఆనందాలు.. ఉద్వేగాలు!

ఆఫ్‌బీట్: చిన్ని చిన్ని ఆనందాలు.. ఉద్వేగాలు!

ఆ మధ్య మా అబ్బాయి ఒక లగ్జరీ యస్‌యూవీ కొన్నాడు. పేపర్లపై సంతకాలు పెట్టే ముందు, టెస్ట్ డ్రైవ్ కోసం కారును మా ఇంటికి తీసుకొచ్చాడు. దాని వల్ల మా ఇంట్లో వాళ్లందరం ఆ కారుపై మా అభిప్రాయం చెప్పొచ్చు. అది మ్మా ఇంటికి వచ్చేప్పుడు అదెట్లా ఉంటుందోననే కుతూహలంతో ఎదురు చూశాం. ఎందుకంటే మార్కెట్‌కి అది పూర్తిగా కొత్త. కానీ గుర్తించదగ్గ విషయమేమంటే, సాధారణంగా ఒక కొత్త వస్తువు.. అదీ అంతంటి ఖరీదైన వస్తువు కొనేప్పుడు ఉండే ఉద్వేగం అప్పుడు కనిపించలేదు.

అదే మా అబ్బాయి మారుతి-ఆల్టో కారు కొన్నప్పుడు మా కుటుంబ సభ్యుల కళ్లల్లో ఆనంద బాష్పాలు నిండటం నాకిప్పటికీ బాగా జ్ఞాపకం. అది వాడి తొలి కారు! నేను నోస్టాల్జియాలోకి వెళ్లిపోయా. నేను కుర్రాడిగా ఉన్నప్పటి రోజులు, పరిస్థితులు ఎలా ఉండేవో నా మనసు రివైండ్ చేసుకుంటే, ఇప్పుడు ఎదుగుతున్న పిల్లల కాలంలో ఆ పరిస్థితులు ఎంతగా మారిపోయాయో తెలిసొస్తోంది. అవి అనూహ్యమైన స్థాయిలో మారాయి. అంతగానూ మనుషుల దృష్టీ, దృక్పథమూ మారిపోయాయి.

ఆ రోజుల్లో, ఏదైనా విలువైన వస్తువు కొనాలంటే కుటుంబమంతా కలిసి వివరంగా చర్చించేది. సాధారణంగా సంవత్సరానికొకసారి సంక్రాంతికి కొత్త బట్టలు కుట్టించుకొనేవాళ్లు. ఇంట్లో ఎవరిదైనా పెళ్లో, ఇంకేదైనా శుభకార్యమో జరిగితే ఇంకో జత అదనంగా సమకూరేది. దాంతో కొత్త బట్టలు కుట్టించుకొని, అవి చేతికి వచ్చినప్పుడు ఉండే ఉద్వేగం కానీ, వాటిని తొలిసారి వేసుకున్నప్పుడు కానీ అనుభవించే ఉద్వేగం గొప్పగా అనిపించేది.

ఒక క్లాసు పూర్తిచేసుకొని, ఇంకో క్లాసుకి వెళ్లేప్పుడు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు తెచ్చుకొనేవాళ్లం. సిలబస్ మారినప్పుడు మాత్రమే కొత్త పుస్తకాలు కొనేవాళ్లం. ఆ కొత్త పుస్తకాలను చేత్తో పట్టుకుంటే ఎంత థ్రిల్‌గా ఉండేదో! ఆ తర్వాత సంవత్సరం వాటిని జూనియర్లకో, దగ్గరి చుట్టాల పిల్లలకో ఇచ్చేవాళ్లం.

దూరప్రాంతాలకు, ప్రత్యేకించి పగటి పూట రైలు ప్రయాణమంటే.. అదో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్. ఎందుకంటే అలాంటి ప్రయాణాలు ఉండేదే బహు తక్కువ. ప్రయాణం విషయం తెలిసినప్పుడు, చాలా ఉద్వేగానికి లోనయ్యేవాళ్లం. మా ప్రయాణం గురించి ఫ్రెండ్స్‌తో గొప్పగా చెప్పేవాళ్లం. దారి మధ్యలో ఏమేం చూడబోతున్నామో, ఏదైనా స్టేషన్‌లో రైలు ఆగితే, కంపార్ట్‌మెంట్లోంచి దిగి, అక్కడ ప్లాట్‌ఫాంపై అమ్మే వేరుశనగ గుగ్గిళ్లు, జామకాయలు, రేగ్గాయలు ఎట్లా తింటామో ఎగ్జయిట్ అవుతూ చెప్పేవాళ్లం.

నా ఉద్యోగం రెగ్యులర్ అయిన మొదటి నెల జీతంతో ఒక జత షూస్ కొన్నాను. ఆఫీస్‌లో షూస్‌తో నడవాలనేది ఎప్పట్నుంచో ఉన్న కోరిక. అది నెరవేరిన క్షణాన ఎంత ఉద్వేగానికి గురయ్యానో! కానీ కొత్త కావటాన ఆ షూస్ నా కాలి మడమపైన బాగా కరిచి నొప్పి పుట్టాయనుకోండి!

ఆఫ్‌బీట్: చిన్ని చిన్ని ఆనందాలు.. ఉద్వేగాలు!
Happy family

ప్రతి నెలా జీతంలోంచి కొంత డబ్బును పక్కన పెడుతూ వచ్చేవాడ్ని. ఏడాది గడిచాక, మంచి సైకిల్ కొన్నాను. అది కొనడానికి వెళ్లినప్పుడు నాలో అదే ఉద్వేగం! అది తలచుకొంటే ఇప్పుడు కూడా నా ముఖంపై నవ్వు వచ్చేస్తుంది. కొనాల్సిన వస్తువుల లిస్టులో తర్వాతది చేతి వాచీ. దాని కోసం డబ్బు కూడబెట్టి, కొనే రోజు వచ్చినప్పుడూ ఆ క్షణాలు ఉద్వేగాన్నిచ్చాయి.

పిల్లలు పుట్టాక ఒక ఫ్రిజ్, ఒక టీవీ కొనాలనిపించింది. అప్పటి రోజుల్లో అవి విలాస వస్తువులే. వాటిని వాయిదాల పద్దతిలో కొందామా, లేక డబ్బు కూడబెట్టి అప్పుడు కొందామా.. అని అందరం సావధానంగా చర్చించుకున్నాం. నేను డబ్బు కూడబెట్టడం మొదలుపెట్టాను. ఈ వస్తువులు ఒక దాని తర్వాత ఒకటిగా ఇంటికి వస్తున్నాయని తెలిసినప్పుడు నా కుటుంబం, ప్రత్యేకించి మా పిల్లలు అనుభవించిన ఆనందం చెప్పడానిలి అలవికాదు. మా ఇంటికి టెలిఫోన్ కనెక్షన్ వచ్చినప్పుడు, మోటార్ సైకిల్ కొన్నప్పుడు.. ఇదే కథ!

ఈ వస్తువులన్నీ ఒక్కొక్కటిగా వస్తున్నప్పుడు, వాటి కోసం ఎదురుచూడ్డంలోని థ్రిల్‌ని మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. చూడ్డానికి ఇవి ఏ ఇంట్లోనైనా సర్వ సాధారణ విషయాలుగానే అనిపిస్తాయి. కానీ అవిచ్చే అనుభూతులు మాటలకు అందనివి. ఉదాహరణకు సంక్రాంతి పండగనే తీసుకోండి. తెలుగువాళ్లకు దాన్ని మించిన పండగ ఇంకోటి ఉండదు. రెండు మూడు నెలలకు ముందుగానే పండగ సెలవుల్ని ప్లాన్ చేసుకుంటారు. నగరాలు పలచనై, పల్లెలు నిండుకుండల్లా కళకళలాడుతుంటాయి. ఆ పండగకు ఎలాంటి బట్టలు కొనాలి, ఫ్రెండ్స్‌తో ఎప్పుడు సరదాగా గడపాలి, సామూహిక సంతర్పణ భోజనాల్ని ఎలా ప్లాన్ చేయాలి, బోగిమంటల్లో ఏమేం పాతవస్తువులు వేయాలి.. వంటివి ఆలోచిస్తుంటాం.

ఈ పండగకు అయ్యే ఖర్చును కూడా ముందుగానే లెక్కలు వేసుకుంటాం. సిటీ నుంచి ఊరికి బయలుదేరే క్షణాల నుంచే ఒక విధమైన ఉద్వేగం మనసుని ఆవరించి, శరీరాన్ని కూడా పులకరింపజేస్తుంది. దసరా పండగకీ దాదాపు ఇదే పరిస్థితి! ఈ ఉద్వేగాలు నిజం.. ఆ అనుభవాలు, అనుభూతులు నిజం! ఆలోచిస్తే ఆశ్చర్యమనిపిస్తుంది కానీ, చాలా చిన్న విషయాలే మనకు ఉల్లాసాన్నీ, ఆనందాన్నీ ఇస్తాయనేది నిఖార్సయిన నిజం.

ఆఫ్‌బీట్: చిన్ని చిన్ని ఆనందాలు.. ఉద్వేగాలు! | actioncutok.com

More for you: