2019 ఫస్టాఫ్: ఆశాభంగం.. అయోమయం.. నిండా ముంచిన పెద్ద సినిమాలు!


– వనమాలి
2019 ఫస్టాఫ్: ఆశాభంగం.. అయోమయం.. నిండా ముంచిన పెద్ద సినిమాలు!

2019 ఫస్టాఫ్: ఆశాభంగం.. అయోమయం.. నిండా ముంచిన పెద్ద సినిమాలు!

తెలుగు రాష్ట్రాల్లోని సినిమా బయ్యర్ల స్థితి నేడు ఎంత దయనీయంగా మారిందంటే పెద్ద సినిమాను కొనాలంటేనే వాళ్లు వణికిపోతున్నారు. ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’, ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ ఘోరంగా విఫలం కావడం, ‘వినయ విధేయ రామ’ అంచనాల్ని తలకిందులు చేయడం, ‘మిస్టర్ మజ్ను’ ఫ్లాపవడం, ‘సీత’, ‘ఏబీసీడీ’ ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో వీటిపై అధికంగా ఆశలు పెట్టుకొని, కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు కానీ, వాటిని ప్రదర్శించిన ఎగ్జిబిటర్లు కానీ కంటి మీద కునుకు లేక, భవిష్యత్తులో ఏం చేయాలో తోచని అయోమయంలో పడిపోయారు.

వేసవి కావడం వల్ల ఈ కాలంలో విడుదల చేసే సినిమాలకి కలెక్షన్లు భారీగా ఉంటాయని ఊహించి విడుదల చేసిన నిర్మాతలు ఫలితాలు చూసి తెల్లబోతున్నారు. స్టార్ల పరంగా చూస్తే మహేశ్ ‘మహర్షి’ సినిమా రూ. 100 కోట్ల షేర్‌ను దాటి, అతని గత చిత్రాల రికార్డుల్ని అధిగమించింది. టాలీవుడ్ టాప్ 4 గ్రాసర్‌గా నిలిచింది. అయితే ఈ ఏడాది అసలు సిసలు బ్లాక్‌బస్టర్ ఘనత మాత్రం వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’కు దక్కుతుంది. నిర్మాతలను, బయ్యర్లను ఈ సినిమా వసూళ్ల వర్షంలో ముంచెత్తింది. నాగచైతన్యకు ‘మజిలీ’ కెరీర్ బెస్ట్ ఫిలింగా నిలిచింది.

2019 ఫస్టాఫ్: ఆశాభంగం.. అయోమయం.. నిండా ముంచిన పెద్ద సినిమాలు!

బాలకృష్ణ, రాంచరణ్, అఖిల్, అల్లు శిరీష్, బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలు ప్రేక్షకుల్ని నిరాశపరిస్తే, నిర్మాతల్నీ, బయ్యర్లనీ నిస్పృహకి లోనుచేశాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ రెండు సినిమాలు, ‘వినయ విధేయ రామ’, ‘సీత’ చిత్రాల పరాజం టాలీవుడ్‌ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ‘మహర్షి’ చిత్రానికి మొదట డివైడ్ టాక్ వచ్చినా, క్రమంగా అది పాజిటివ్ టాక్‌గా మారి రూ. 100 కోట్ల క్లబ్బులో స్థానం కల్పించింది. ‘ఖైదీ నంబర్ 150’ వసూళ్లను అది దాటేసింది. విడుదలై 40 రోజులైనా ఇప్పటికీ దానికి కొద్దో గొప్పో షేర్ వస్తుండటం గమనార్హం.

బాలకృష్ణ డ్రీం ప్రాజెక్ట్ అయిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు సినిమాలుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద అనూహ్య రీతిలో విఫలమై బయ్యర్లని మళ్లీ కోలుకోలేని దెబ్బ తీసింది. ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ డిజాస్టర్ కావడంతో, రెండో భాగం ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ను అతి తక్కువ ధరకు ఇచ్చినా ఫలితం లేకపోయింది. బయ్యర్లను ఈ ఏడాది నిండా ముంచిన సినిమాలుగా అవి పేరు తెచ్చుకున్నాయి.

2019 ఫస్టాఫ్: ఆశాభంగం.. అయోమయం.. నిండా ముంచిన పెద్ద సినిమాలు!

మూడో యత్నంతోనైనా హిట్ సాధించాలనే కసితో అఖిల్ అక్కినేని చేసిన ‘మిస్టర్ మజ్ను’పై అంచనాలు భారీ ఎత్తున సాగాయి. కారణం.. దాని దర్శకుడు వెంకీ అట్లూరి అంతకు ముందు ‘తొలిప్రేమ’తో పెద్ద హిట్ కొట్టడం. పైగా అఖిల్‌కు సానుభూతి కూడా తోడై భారీ విజయాన్ని సాధిస్తుందని విశ్లేషకులు భావించినా, సినిమా విడుదలకు ముందూ, తర్వాతా ఈ సినిమాని ఎంతగా ప్రమోట్ చేసినా.. రెండో రోజు నుంచే వసూళ్లు భారీగా పడిపోయాయి. కథలో బలం కానీ, కొత్తదనం కానీ లేకపోవడం, హీరో పాత్ర బలహీనంగా ఉండటం డైరెక్షన్‌లో మెరుపులు లేకపోవడం ఈ సినిమా వైఫల్యానికి కారణమయ్యాయి.

‘వినయ విధేయ రామ’ చిత్రానికి వస్తే, రాంచరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ క్రేజ్‌తో అత్యధిక ధరకు దాన్ని అమ్మారు. కథన లోపాలు, నేల విడిచి సాము చేసే పాత్రల చిత్రణ, లాజిక్‌కు ఏమాత్రం అందని సన్నివేశాలతో ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆశించిన రీతిలో ఆకట్టుకోకపోగా, తీవ్ర విమర్శల పాలయ్యింది.

2019 ఫస్టాఫ్: ఆశాభంగం.. అయోమయం.. నిండా ముంచిన పెద్ద సినిమాలు!

హీరో కేరెక్టర్‌ను ఒక అతీంద్రియ శక్తులు ఉన్నవాడి తరహాలో అసహజంగా చిత్రించడం, మానవమాత్రుడు చెయ్యలేని పనుల్ని అతని చేత చేయించడం, విలన్ కేరెక్టర్‌ను సైతం అదే తరహాలో చూపించడం.. వగైరా అంశాల వల్ల ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురై సినిమాని ఫెయిల్ చేశారు. ఫలితంగా ఈ సినిమాని భారీ రేట్లకు కొనుగోలు చేసిన బయ్యర్లు 25 శాతానికి మించి నష్టపోయారు. ఈ దెబ్బ దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత డీవీవీ దానయ్య మధ్య విభేదాల్ని సైతం సృష్టించడం మనం చూశాం.

ఏదేమైనా, ఏ పద్ధతిలో బిజినెస్ జరిగినా కథలకీ, నాణ్యతకీ ప్రాధాన్యం ఇచ్చి సినిమాలు తీస్తే.. అది చిన్న బడ్జెట్ సినిమా అయినా, పెద్ద స్టార్ సినిమా అయినా విజయం చేకూరుతుందనేది నిస్సందేహం. ఈ సంగతి ఆది నుంచీ రుజువవుతూనే ఉంది. ఎటొచ్చీ పాఠాలు నేర్చుకోడానికి కొంతమంది నిర్మాతలు, దర్శకులు ఇష్టపడటం లేదు. అలా నేర్చుకోనంత కాలం ఇలాంటి గట్టి దెబ్బలు తప్పవు.

2019 ఫస్టాఫ్: ఆశాభంగం.. అయోమయం.. నిండా ముంచిన పెద్ద సినిమాలు! | actioncutok.com

More for you: