సరిలేరు ఆమెకెవ్వరూ!


– కార్తికేయ
సరిలేరు ఆమెకెవ్వరూ!
Vijaya Shanthi

సరిలేరు ఆమెకెవ్వరూ!

లేడీ సూపర్‌స్టార్.. లేడీ అమితాబ్.. అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విజయశాంతి. నాయికగా అదివరకు ఏ తెలుగు తారా అందనంత ఎత్తుకు ఎదిగి, తను ప్రధాన పాత్రలు పోషించిన సినిమాలతో కాసుల వర్షం కురిపించిన నటి. 2006లో వచ్చిన ‘నాయుడమ్మ’ సినిమా తర్వాత ఆమె సినీ రంగానికి దూరమై, రాజకీయ రంగంలోకి వెళ్లారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న 13 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత తెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. మహేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి రూపొందిస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో అత్యత కీలక పాత్ర చేస్తున్నారు. ఆమె చేస్తున్న పాత్ర గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ఒకప్పుడు మహేశ్ బాలనటుడిగా నటించే కాలంలో ‘కొడుకు దిద్దిన కాపురం’లో అతనికి తల్లిగా నటించిన ఆమె, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మరోసారి అతనికి తల్లిగా నటిస్తోందనే ప్రచారం ఓ వైపూ, కాదు.. సినిమాలో ఆమె విలన్‌గా కనిపించనున్నదనే ప్రచారం ఇంకోవైపు నడుస్తున్నాయి. ఈ రెండూ కాదు.. ఆమె మరో పాత్రకు తల్లిగా కనిపిస్తుందనీ, చిన్నప్పుడెప్పుడో తప్పిపోయిన ఆమె కొడుకు స్థానంలోకి మహేశ్ వెళ్తాడనీ కూడా ఇంకో ప్రచారం ఉంది.

ఆమె పాత్ర విషయం అలా ఉంచితే.. 13 ఏళ్ల తర్వాత నటిస్తోన్న విజయశాంతి ప్రేక్షకుల్ని ఇదివరకటిలా ఆకట్టుకుంటారా?.. అనే సందేహం చాలా మందిలో వ్యక్తమవుతోంది. ‘ఒసేయ్ రాములమ్మా’ కాలంలో అగ్ర హీరోలను తలదన్నే పారితోషికాన్ని అందుకొని, చరిత్ర సృష్టించిన ఆమె కరిష్మా అలాగే ఉందా? అప్పట్లో తెరపై ఆమెను చూడ్డం కోసం ఎగబడ్డ జనం ఇప్పుడు ఆమెని చూడ్డాని అలాగే ఎగబడతారా?

ఆమెని అభిమానించిన తరం వేరు. నేటి నవతరం వేరు. నవతరానికి ఆమెపై క్రేజ్ లేదు. ఈ నేపథ్యంలో అనేక సంవత్సరాల తర్వాత తెరపై కనిపించనున్న విజయశాంతి నేటి తరం ప్రేక్షకుల హృదయాలపై ఎలాంటి ముద్ర వేస్తారనేది ఆసక్తికరం. అప్పటి లాగే ఇప్పుడు కూడా ‘సరిలేరు ఆమెకెవ్వరూ’ అనిపించుకుంటారా?

సరిలేరు ఆమెకెవ్వరూ! | actioncutok.com

More for you: