మాస్‌ను మెప్పించే హీరో ఎవరు?


– గోవర్ధన్
మాస్‌ను మెప్పించే హీరో ఎవరు?
Chiranjeevi

మాస్‌ను మెప్పించే హీరో ఎవరు?

హీరోయిజం.. సినిమా రంగానికి చెందినవాళ్లకూ, సినిమాను ప్రేమించేవాళ్లకూ ఆ పదం నిత్య స్మరణం. ఆ పదం వింటేనే అభిమానులు తమ హీరోల వీరోచిత కార్యాలు (సినిమాల్లోనే) గుర్తుకు తెచ్చుకొని పులకించిపోతారు. హీరోయిన్‌ను ఎత్తుకుపోతున్న దుండగులను వెంబడించి, వాళ్లను అడ్డగించి, ‘హీరో’చితంగా పోరాడి ఆమెను హీరో కాపాడగానే థియేటర్‌లో ఈలలు వెల్లువెత్తుతాయి. చప్పట్లు జయజయధ్వానాలవుతాయి.

ఐతే టాలీవుడ్‌లోని కొద్దిమంది హీరోలు మాత్రమే అటువంటి ‘హీరోయిజం’తో అభిమానులను అలరిస్తుంటే, ఎక్కువమంది హీరోలు ‘సంసారపక్ష’ లేదంటే ‘యువతపక్ష’ సినిమాలతో సరిపుచ్చుకుంటూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రేంజిలోనే ఉండిపోతున్నారు. ఆది నుంచీ తెలుగు తెరమీద హీరోల స్థానాన్ని పదిలంగా నిల్పుతున్నది ధీరత్వ ప్రదర్శనలేనన్న సంగతిని ఉపేక్షిస్తున్నారు.

మాస్‌ను మెప్పించే హీరో ఎవరు?
Prabhas

ఇవాళ సూపర్ సీనియర్లను పక్కనపెడితే పవన్ కల్యాణ్, మహేశ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్, నాని, నాగచైతన్య, రానా, నితిన్, రాం, కల్యాణ్ రాం, వరుణ్ తేజ్, సుధీర్‌బాబు, సాయితేజ్, విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్.. వగైరా హీరోలు చాలామందే ఉన్నారు. అయితే వారిలో తొలి ఆరుగురికే ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. మాస్ ఫాలోయింగ్ ఉంది. ‘అర్జున్‌రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాలతో విజయ్ దేవరకొండ ఇప్పుడే మాస్‌ను ఆకట్టుకుంటున్నాడు.

వీరిలా మిగతా హీరోలు మాస్‌ను ఆకట్టుకోలేకపోతున్నారు. కారణం.. ఇంతకు ముందు చెప్పుకున్నదే. తమ సినిమాల్లో ‘హీరోయిజం’కు తగినంత ప్రాముఖ్యం ఇవ్వకపోవడం వల్లే ‘ఇమేజ్’ విషయంలో వాళ్లు వెనుకబడుతున్నారు. ఇమేజ్ అనేది ఏ స్థాయిలో ఉన్నదనే సంగతి ఓపెనింగ్ కలెక్షన్లు చెబుతాయి. ‘ఇమేజ్’ బాగా ఉన్న హీరో సినిమా ఫ్లాపైతే వచ్చే కలెక్షన్లు, ఇమేజ్ తక్కువగా ఉన్న హీరో సినిమా హిట్టయితే వచ్చే కలెక్షన్లకంటే ఎక్కువగా ఉంటున్నాయి.

మాస్‌ను మెప్పించే హీరో ఎవరు?
Ram Charan

హీరోకి ఎంత ఇంకే ఉన్నదనేది ట్రేడ్ మార్కెట్‌లో వాళ్ల సినిమా పలికే ధరను ఆధారం చేసుకొని చెప్పవచ్చు. యాక్షన్, వినోదం కలగలసిన కథలతో సినిమాలు చేస్తూ కొంతమంది ఇమేజ్ పెంచుకుంటూ పోతుంటే, యాక్షన్ ప్లేస్‌లో ప్రేమను లేదంటే సంసారం గొడవలను నింపుతున్న కథలతో సినిమాలు చేస్తూ మిగతావాళ్లు ఎదగలేకపోతున్నారు. ఈ విషయం గ్రహించడానికి పెద్ద పరిశీలన జరపనక్కరలేదు. టాప్ హీరోలకు మాస్ అభిమానులెక్కువ. అందుకే రికార్డుల కోసం వాళ్ల అభిమానులు పోటీపడుతుంటారు.

ఇండస్ట్రీ హిట్లు, ఏడాది టాప్ గ్రాసర్లు వాళ్ల సినిమాలే ఉంటాయి. టాప్ గ్రాసర్ల పరంగా చూస్తే ప్రభాస్ (బాహుబలి 2), రాంచరణ్ (రంగస్థలం), మహేశ్ (మహర్షి), చిరంజీవి (ఖైదీ నంబర్ 150), జూనియర్ ఎన్టీఆర్ (అరవింద సమేత), వెంకటేశ్ (ఎఫ్ 2), పవన్ కల్యాణ్ (అత్తారింటికి దారేది) వరుస స్థానాల్లో ఉన్నారు. టాప్ 20 గ్రాసర్స్ చూసుకుంటే అల్లు అర్జున్ (సరైనోడు), విజయ దేవరకొండ (గీత గోవిందం) లిస్ట్‌లోకి వస్తారు. టాప్ 25 గ్రాసర్స్‌లో మరే హీరో సినిమాకీ ఇప్పటివరకూ చోటు దక్కలేదు.

మాస్‌ను మెప్పించే హీరో ఎవరు?
Mahesh

నాగచైతన్య లవ్, ఫ్యామిలీ ఎమోషనల్ సినిమాలకే పరిమితమై ఫ్యామిలీ హీరోగా స్థిరపడ్డాడు. నాని మిడిల్ క్లాస్ ఆడియెన్స్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. రానాకు ఒక ఇమేజ్ అంటూ లేదు. రాం ఏ కేటగిరిలోకి వస్తాడో తెలీనట్లుగా అతని సినిమాలుంటాయి. వరుణ్‌తేజ్ ‘ఎఫ్2’లో బాగంగా ఉన్నా, ఆ సినిమా బ్లాక్‌బస్టర్ క్రెడిట్ అతనికి దక్కలేదు. సోలోగా మాస్‌లో అతనికి ఇమేజ్ తక్కువే. సాయితేజ్ ఇమేజ్ కోసం తంటాలు పడుతున్నాడు. అల్లు శిరీష్ ఉనికి కోసం తిప్పలు పడుతున్నాడు. సుధీర్‌బాబు తనకు ఏ తరహా సినిమాలు నప్పుతాయో ఇంకా పరీక్షించుకుంటూనే ఉన్నాడు. కొంత కాలం క్రితం కెరీర్‌లో బాగా దెబ్బతిన్న నితిన్.. లేచి హిట్లు కొట్టి ఇమేజ్ పెంచుకున్నాడని అనుకొనేంతలో మళ్లీ డౌన్ అవుతూ వస్తున్నాడు.

అయితే వీరత్వాన్ని ప్రదర్శించే పాత్రలన్నిట్నీ మాస్ మెచ్చుకుంటారా? లేదు. ఏడు ఫైట్లు, ఆరు పాటలూ ఉండే సినిమాలనెన్నిట్నో వాళ్లు తిరస్కరించారు. ‘వినయ విధేయరామ’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘స్పైడర్’, ‘నా పేరు సూర్య’, ‘అమర్ అక్భర్ ఆంటొని’, ‘రభస’ తదితర సినిమాలే ఇందుకు ఉదాహరణ. మరి ఎట్లాంటి పాత్రల్ని మాస్ ప్రేక్షకులు ఇష్టపడతారు?

మాస్‌ను మెప్పించే హీరో ఎవరు?
Pawan Kalyan

సాధారణంగా ప్రేక్షకులు ఓ సినిమాను పాత్ర ద్వారానే గుర్తుంచుకుంటారు. చాలామందికి సినిమా ఇతివృత్తాల కంటే వాటిలోని పాత్రలే గుర్తుకు వస్తాయి. పాత్ర పేరు సినిమాలో చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. మహర్షి, ‘అర్జున్‌రెడ్డి’, బాహుబలి, ధృవ, గబ్బర్ సింగ్, సింహా, లక్ష్మీ, ఆర్య, ఠాగూర్, శివ వంటి హిట్ సినిమాలకు హీరోల పేర్లు ప్లస్సయ్యాయి. హీరో పాత్రను ఎలా చిత్రించారన్నది సినిమా విజయంలో ప్రధాన పాత్ర వహించే అంశం. పాత్ర చిత్రణా శిల్పం తెలిసిన దర్శకుడు మాస్ హీరోతో సినిమా చేసేప్పుడు వీలైనంత రాజసంతో ఆ పాత్రను తీర్చిదిద్ది మాస్‌ను మెప్పించేందుకు కృషి చేస్తాడు. దాని ఔన్నత్యం ఎక్కడా దెబ్బతినకుండా చూస్తాడు.

పాత్ర అంతరంగం, బహిరంగ ప్రదర్శన, ఆశయాలు, ఆశలు, కలలు, భయాలు.. వంటివన్నీ రచయిత ఊహల్లో కలిసిపోయి ఊపిరి పోసుకున్నప్పుడు మంచి నాయక పాత్రలు పుడతాయి. వాటికి తన సృజనశక్తితో ప్రాణం పోసి తెరమీదకు తీసుకువస్తాడు దర్శకుడు. అందువల్లే ‘ఖైదీ’, ‘శివ’, ‘నరసింహనాయుడు’, ‘ఆర్య’, ‘మగధీర’, ‘శ్రీమంతుడు’, ‘బాహుబలి’, ‘జనతా గారేజ్’ వంటి చిత్రాల్లోని హీరో పాత్రలు అంతగా ప్రజలను ఆకట్టుకున్నాయి.

మాస్‌ను మెప్పించే హీరో ఎవరు?
Jr NTR

ఆ చిత్రాల్లోని ఏ హీరో పాత్రను చూసుకున్నా దానికో ఆశయం కనిపిస్తుంది. ఆ ఆశయం సాధించేందుకు అది పడే సంఘర్షణ కనిపిస్తుంది. ఆ సంఘర్షణలో ఆ పాత్ర తన ఆశయాన్ని నెరవేర్చుకోలేదోమోనన్న సందేహం కలుగుతుంది. ఆ స్థితి పతాక స్థాయికి చేరుతుంది. అప్పుడే ఆ పాత్రలు చిత్రకథను రక్తి కట్టించగలిగాయి. అంతే కాదు, ఆ పాత్రలు తమ ఆశయ సాధన కోసం చేసే పనులు నమ్మశక్యంగా ఉంటాయి. ఆ పాత్రల స్పందనను తమ స్పందనగా ప్రేక్షకులు భావించడం వల్లే ఆ పాత్రలు అంతగా వాళ్లను ఆకట్టుకున్నాయి.

ప్రస్తుత యువ హీరోలు ఈ సంగతిని గ్రహించలేదో, గ్రహించినా తమ ధోరణి తమదే అన్నట్లుగా ఉన్నారో తెలీదు కానీ, మాస్ ప్రేక్షకుల ఆదరణ కోసం ప్రయత్నించడం లేదు. మల్టీప్లెక్సుల ప్రేక్షకుల కోసమే సినిమాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. నిజానికి ఏ హీరో అయినా ఎస్టాబ్లిష్ అయ్యేది మాస్ సినిమాలతోనే. ఈ యథార్థాన్ని గ్రహించగలిగే యువ హీరోలే మునుముందుకు దూసుకుపోతారు. అలా గ్రహించలేనివాళ్లు రేసులో ఎప్పుడూ వెనుక స్థానంతో సరిపెట్టుకుంటారు.

మాస్‌ను మెప్పించే హీరో ఎవరు?
Allu Arjun

మాస్‌ను మెప్పించే హీరో ఎవరు? | actioncutok.com

More for you: