‘ఎన్జీకే’ ఎందుకు బాగాలేదంటే…


'ఎన్జీకే' ఎందుకు బాగాలేదంటే...

‘ఎన్జీకే’ ఎందుకు బాగాలేదంటే…

సూర్య, సెల్వ రాఘవన్ కాంబినేషన్ అనేసరికి ఎంత ఆసక్తి కలిగిందో.. సినిమా చూశాక ఆ ఉత్సాహమంతా నీరుకారిపోయింది. సూర్య లాంటి ప్రతిభావంతుడైన నటుడు, క్లాసిక్ టేకింగ్‌తో ఆకట్టుకొనే సెల్వ రాఘవన్ కలిసి చేసిన సినిమా అంటే ఎలా ఉండాలి! ఆ ఊహలకు విరుద్ధంగా ఉండి తీవ్ర ఆశాభంగం కలిగించింది ‘ఎన్జీకే’.

సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే అది నందగోపాల కృష్ణగా సూర్య నటనే. రెండేళ్ల పాటు నిర్మాణంలో ఉన్న సినిమా ఫైనల్ ఔట్‌పుట్ ఇలా ఉంటుందని ఎవరు ఊహిస్తారు! తికమక స్క్రీన్‌ప్లేతో సినిమాని ప్రేక్షకులకు దూరం చేశాడు డైరెక్టర్. తమిళనాడు రాజకీయాల్లో కొంత కాలంగా చోటుచేసుకున్న ఘటనలపై తన దృక్కోణంతో ఈ సినిమా చేశాడు సెల్వ రాఘవన్. ఒక సేంద్రియ వ్యవసాయ రైతు, సామాజిక కార్యకర్త మురికి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఏం చేశాడనే కథ అంతే మురికిగా కనిపించింది.

సాయిపల్లవి లాంటి నటిని ఎన్జీకే భార్యగా ఏమాత్రం నటనకు అవకాశం లేని, సరైన కేరెక్టరైజేషన్ లేని పాత్రలో చూసి నిరుత్సాహం కలిగింది. సెల్వ రాఘవన్ ఇదివరకు రూపొందించిన ‘7/జి, బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘యుగానికి ఒక్కడు’ వంటి సినిమాల్లో స్త్రీ పాత్రలు ఎంత బలంగా కనిపించాయి! కానీ ఈ సినిమాలో సాయిపల్లవి పాత్ర వృథా. ఆమె కంటే రకుల్‌ప్రీత్ కేరెక్టర్ ఒకింత బెటర్. సినిమాకి సంబంధించిన మరో మైనస్.. కథలో బలమైన విలన్ లేకపోవడం. దాని వల్ల ఎన్జీకే కేరెక్టర్ ఆశించినంతగా ఎలివేట్ కాలేదు.

ఫస్టాఫ్ కొంత వినోదాన్ని పంచిందనుకుంటే, సెకండాఫ్ చికాకు పుట్టించింది. చాలా సన్నివేశాలు సహజంగా కాకుండా బలవంతంగా చొప్పించినట్లు అనిపించాయి. రెస్ట్ రూం ఫైట్ సీన్ అయితే మరీనూ. నాకు తెలిసి మాస్‌నీ, క్లాస్‌నీ ఏక కాలంలో నిరాశపర్చిన సినిమా ‘ఎన్జీకే’.

– వనమాలి

‘ఎన్జీకే’ ఎందుకు బాగాలేదంటే… | actioncutok.com

More for you: