సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: పలనాటి బ్రహ్మనాయుడు


– వనమాలి
సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: పలనాటి బ్రహ్మనాయుడు

సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: పలనాటి బ్రహ్మనాయుడు

తారాగణం: బాలకృష్ణ, సోనాలీ బెంద్రే, ఆర్తీ అగర్వాల్, జయప్రకాశ్‌రెడ్డి, ముఖేశ్ రుషి, సత్యనారాయణ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అలీ, జతిన్, లహరి, సుధ, చలపతిరావు, ఆహుతి ప్రసాద్, శివాజీ రాజా, గుండు హనుమంతరావు, శ్రీలక్ష్మి

దర్శకత్వం: బి. గోపాల్

స్టోరీ, స్క్రీన్‌ప్లే: పోసాని కృష్ణమురళి

సంభాషణలు: పరుచూరి బ్రదర్స్

సంగీత దర్శకుడు: మణిశర్మ

స్టంట్స్: విక్రం ధర్మా, రాజు

విడుదల తేదీ: 5 జూన్ 2003

బాలకృష్ణ, బి. గోపాల్ కాంబినేషన్ బ్లాక్‌బస్టర్స్ సాధించడానికే పుట్టిందని అనుకున్నారు ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ సినిమాలతో. ఆ అభిప్రాయాన్ని పటాపంచలు చేసింది ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమా. బాలకృష్ణ కెరీర్‌లోని అతిపెద్ద డిజాస్టర్స్‌లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. అప్పట్లో యువ ప్రేక్షకుల కలల రాణులు సోనాలీ బెంద్రే, ఆర్తీ అగర్వాల్.. ఇద్దరూ ఈ సినిమాలో నటించినా ఏమాత్రం ప్రయోజనం కలగలేదు. అప్పటికి దాదాపు రొటీన్ అయిన రాయలసీమ బ్యాక్‌ద్రాప్‌ను పక్కనపెట్టి కథను పలనాడుకు మార్చినప్పటికీ, ఆ కథలో ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే సరుకేమీ లేకపోవడంతో మరో ఆలోచన లేకుండా జనం తిరస్కరించారు.

సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: పలనాటి బ్రహ్మనాయుడు

‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమా ఫెయిలవడానికి దోహదం చేసిన ప్రధాన అంశాలేమిటి? హాస్యాస్పదమైన సన్నివేశాలు, కథనమే సినిమా వైఫల్యానికి ప్రధాన బాధ్యత వహించాయని చెప్పాలి. అదివరకు ‘ఇంద్ర’ సినిమాని రూపొందించి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన బి. గోపాల్.. ఆ సినిమాలో సోనాలీ బెంద్రే, ఆర్తీ అగర్వాల్ చేసిన పాత్రల్ని ఈ సినిమాలో రివర్స్ చేశాడు. అంటే అందులో సోనాలీ బెంద్రే పాజిటివ్‌గా కనిపిస్తే, ఇందులో నెగటివ్‌గా కనిపిస్తుంది. అందులో ఆర్తీ అగర్వాల్ లేడీ విలన్ టైపులో అగుపిస్తే, ఇందులో హీరోతో ఆడిపాడే హీరోయిన్‌గా దర్శనమిస్తుంది.

టైటిల్ అలా పెట్టినప్పటికీ, మనం చరిత్రలో చదువుకున్న పల్నాడు కథకీ, ఈ ‘పలనాటి బ్రహ్మనాయుడు’ కథకీ ఎలాంటి సంబంధమూ లేదు. తనది బ్రహ్మనాయుడి వంశమని ఈ సినిమాలో భవానీప్రసాద్ పాత్రధారి బాలకృష్ణ చెప్తూ ఉంటాడు. ఆ రకంగా చూస్తే నాయకురాలు నాగమ్మ తరహా పాత్ర సోనాలే బెంద్రే చేసిన శివనాగేశ్వరిది. బాలయ్యతో సోనాలీ ప్రేమయుద్ధాన్ని ప్రారంభించి ఓడిపోతుంది. ఆమె పాత్ర ద్వారా చరిత్రలోని నాగమ్మ ఒక రాక్షసి అనే ముద్రను కలిగించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

సినిమాలో బలమైన సన్నివేశాలు కానీ, అలరించే హాస్యం కానీ లేకపోవడం ఈ సినిమాని బలహీనపర్చింది. పైగా హాస్యం బదులు హాస్యాస్పద సన్నివేశాలు మాత్రం తగినన్ని ఈ సినిమాలో ఉన్నాయి. బాలకృష్ణ హెలికాప్టర్‌ని పేల్చేయడం, అతను తొడగొట్టి చిటికేస్తే జయప్రకాశ్‌రెడ్డి కుర్చీతో సహా ముందుకు రావడం, రైలు వెనక్కి వెళ్లిపోవడం, ఒక రైలుని ఆపేందుకు అదే ట్రాక్‌లో ఎదురుగుండా ఇంకో రైలేసుకోని, దాని టాప్‌పై నిల్చొని బాలకృష్ణ రావడం వంటి విన్యాసాలు ప్రేక్షకుల మైండుల్ని బ్లాంక్ చేసేశాయి. కోడి పందేల్లో ఒక విలన్‌తో తలపడి కోడి అతడ్ని చంపెయ్యడం కళ్లు బైర్లు కమ్మేలా చేసే ఘట్టం.

సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: పలనాటి బ్రహ్మనాయుడు

క్లైమాక్స్‌లో కార్తీక అమావాస్య రాత్రి వేడుకలని డైలాగుల్లో చెప్పించి, పగటి పూటే ఆ వేడుకలు జరపడం చూస్తే స్క్రీన్‌ప్లేలో ఎన్ని బొక్కలున్నాయో అర్థమవుతుంది. పైగా ఆ వేడుకలకు దేశం నలుమూలల నుంచీ వీరులు ఆయుధపూజ చెయ్యడానికొస్తారని చెప్తారు. కానీ వాళ్ల జాడ అసలు కనిపించదు. బాలకృష్ణ ఒక్కడే ఆయుధపూజ చేస్తాడు.

స్క్రీన్‌ప్లేలో దొర్లిన ఇంకో ప్రధాన తప్పు సినిమాలో ఎక్కడా పల్నాడు వాతావరణం కనిపించకపోవడం. నేటివిటీ మిస్సయిందంటే అర్థం దర్శకుడికీ, కథకుడికీ పల్నాడుపై సరైన అవగాహన లేదనే. సున్నపురాయి గనులెక్కడ? కోటప్పకొండేదీ? సత్రశాల తిరునాళ్లేవీ? రికార్డింగ్ డాన్సులేవీ? అసలు కృష్ణానది ఎక్కడా కనిపించలేదే?.. మరి ఇది ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమా ఎలా అవుతుంది? అందుకే ప్రేక్షకులు ఈ సినిమాని ఫెయిల్ చేశారు.

సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: పలనాటి బ్రహ్మనాయుడు | actioncutok.com

More for you: