డబుల్ బొనాంజా ఎప్పుడు?


– సజ్జా వరుణ్
డబుల్ బొనాంజా ఎప్పుడు?
Mahesh and Allu Arjun

డబుల్ బొనాంజా ఎప్పుడు?

టాప్ స్టార్స్‌లో ముగ్గురు మినహా మిగిలిన వాళ్లంతా ప్రేక్షకులకు డబుల్ బొనాంజా అందించినవాళ్లే. అంటే డబుల్ రోల్స్ చేసినవాళ్లే. సీనియర్లలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ పలు సినిమాల్లో ద్విపాత్రలు పోషించి ప్రేక్షకుల్ని అలరించారు. చివరగా చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణ ‘లెజెండ్’, నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’, వెంకటేశ్ ‘నాగవల్లి’ చిత్రాల్లో డబుల్ రోల్స్‌లో కనిపించారు. రవితేజ ‘విక్రమార్కుడు’లో డ్యూయల్ రోల్స్‌తో ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాతి తరం టాప్ స్టార్స్‌లో పవన్ కల్యాణ్ ‘తీన్ మార్’లో డ్యూయల్ రోల్ చేశాడు కానీ అలరించలేకపోయాడు. ప్రభాస్ ‘బాహుబలి’ రెండు సినిమాల్లో డబుల్ రోల్స్ చేసి ఎంతగా ఆకట్టుకున్నాడో తెలుసు. వాటికంటే ముందే అతడు ‘బిల్లా’లో ద్విపాత్రలు పోషించాడు. రాంచరణ్ ‘నాయక్’లో డబుల్ రోల్స్‌తో అలరించాడు. జూనియర్ ఎన్టీఆర్ ‘అదుర్స్’లో చేసిన ద్విపాత్రలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అయితే ‘ఆంధ్రావాలా’, ‘శక్తి’ సినిమాల్లో చేసిన డ్యూయల్ రోల్స్ దెబ్బ తియ్యడం వేరే సంగతి. అతను ‘జై లవ కుశ’లో ఏకంగా త్రిపాత్రలు చేసి, ఆ విషయంలో తన తరం హీరోల్లో ముందున్నాడు.

కాగా మహేశ్, అల్లు అర్జున్ ఇంతవరకు డ్యూయల్ రోల్స్‌లో కనిపించలేదు. మహేశ్ బాలనటుడిగా ఉన్నప్పుడు ‘కొడుకు దిద్దిన కాపురం’లో ద్విపాత్రలు చేసి అలరించాడు కానీ హీరో అయ్యాక వాటి జోలికి పోలేదు. ఈ ఇద్దరికీ ఇంతవరకు డబుల్ రోల్స్ స్క్రిప్టులు రాలేదా, వచ్చినా నచ్చక చెయ్యలేదా? అనే విషయం తెలీదు.

నాని వంటి మిడిల్ క్లాస్ స్టార్ సైతం ఇప్పటికే మూడు సినిమాల్లో డబుల్ రోల్స్ చేసేయగా, మహేశ్, బన్నీ ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నట్లు? ఆ ఇద్దరూ డబుల్ రోల్స్ చేసి ఎప్పుడు తమకు డబుల్ బొనాంజా అందిస్తారా అని వాళ్ల ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

డబుల్ బొనాంజా ఎప్పుడు? | actioncutok.com

More for you: