‘ఓ బేబీ’ చరిత్ర తిరగరాసే సినిమా అని చెప్పను: డైరెక్టర్ నందినీరెడ్డి ఇంటర్వ్యూ


'ఓ బేబీ' చరిత్ర తిరగరాసే సినిమా అని చెప్పను: డైరెక్టర్ నందినీరెడ్డి ఇంటర్వ్యూ
Nandini Reddy

‘ఓ బేబీ’ చరిత్ర తిరగరాసే సినిమా అని చెప్పను: డైరెక్టర్ నందినీరెడ్డి ఇంటర్వ్యూ

సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘ఓ బేబీ’ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కొరియన్ హిట్ ఫిల్మ్ ‘మిస్ గ్రానీ’కి అధికారిక రీమేక్ అయిన ఈ సినిమాకి నందనీరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ ప్రాజెక్టును సమంతే తన వద్దకు తెచ్చిందని చెబ్తున్న నందినీరెడ్డి ‘ఓ బేబీ’ గురించి చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే…

ఇది సమంతకూ, నాకూ నచ్చిన కథ. మేం బాగా కనెక్టయిన కథ. ఆ కథని నిజాయితీగా తీశామన్న కాన్ఫిడెన్స్ ఉంది. నందినీరెడ్డి బాగా తీసిందా, లేదా అనే విషయం పక్కనపెడితే, బేసిగ్గా కథలోనే క్వాలిటీ ఉంది. ప్రేక్షకులకు నచ్చే క్వాలిటీ ఉంది. సినిమాలోని యాక్టర్లందరూ చాలా బాగా చేశారు. ఈ రెండూ పకడ్బందీగా ఉన్నప్పుడు 70 శాతం పాసైపోతాం. ఈ రోజు సినిమా చూస్తే, మరుసటి రోజు కూడా అందులోని ఏదో ఒక విషయం మనకు గుర్తుంటుంది. దాని గురించి మాట్లాడుకుంటారు. ఆ కాన్ఫిడెన్స్ నాలో ఉంది. ఇది తెలుగు సినిమా చరిత్రని తిరగరాసే సినిమా అని ఎప్పుడూ, దేనికీ చెప్పను. చెప్పకూడదు కూడా. కానీ కచ్చితంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచే ఒక సినిమా అవుతుంది. ఎందుకంటే ఒరిజినల్ కొరియన్ స్టోరీలోనే ఆ క్వాలిటీ ఉంది.

ఈ కథకు సమంతే కావాలి

కేరెక్టర్‌కు తగిన ఆర్టిస్ట్ దొరికితేనే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఈ కథకు కావలసిన ఆర్టిస్ట్ సమంత. ఆమె నటనకు కావాల్సిన ప్లాట్‌ఫాంను ఈ కథ ఇచ్చింది. కాబట్టి రెండూ సమానమని చెప్పాలి. సమంతనే ఈ ప్రాజెక్ట్ నా వద్దకు తీసుకొచ్చింది. తను 100 శాతం తన పాత్రకు న్యాయం చేసింది. రేపు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది.

బేబక్కగా ఆమే కనిపించింది

లక్ష్మిగారు నాకు ‘మురారి’ రోజుల నుంచీ పరిచయం. నిజంగా ఆమె మహానటి. 70 యేళ్ల బేబక్క అనే ముసలావిడతో మనం కనెక్టవ్వాలంటే ఒక గొప్ప నటి కావాలి. తర్వాత సమంత ఆ కేరెక్టర్‌లోకి వస్తుంది. అందుకని నాకు బేబక్క పాత్రకు లక్ష్మిగారు తప్పితే వేరే ఆర్టిస్ట్ కనిపించలేదు. ఆ కేరెక్టర్‌లో కామెడీ, వెటకారం ఉండాలి. అవి చెయ్యగలిగే ఆర్టిస్టుగా నాకు లక్ష్మిగారే కనిపించారు. ఆ పాత్రను లక్ష్మిగారు చెయ్యకపోతే బహుశా సమంత, నేను ఈ సినిమా చేసుండేవాళ్లం కామేమో.

40 శాతం మార్చాం

ఇందులో ఒరిజినల్ కొరియన్ కథ 60 శాతం ఉంటుంది. 40 శాతం మార్చాం. మన కల్చర్, మన వాల్యూస్ పెట్టుకుంటూ మార్చాం. అక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండదు. ఇక్కడ ఉంటుంది. ఇది పూర్తి స్థాయి కమర్షియల్ ఫిల్మ్. మెసేజ్ ఇచ్చే ఫిల్మ్ కాదు. జీవితానికి దగ్గరగా ఉండే సినిమా.

వాళ్లది అందమైన స్నేహం

రాజేంద్రప్రసాద్ గారు, లక్ష్మి గారు సినిమాలో బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పట్నుంచీ కలిసి పెరిగిన ఫ్రెండ్స్. లక్ష్మి గారు కంటే రాజేంద్రప్రసాద్ వయసులో ఐదేళ్లు చిన్న. వాళ్లది అందమైన స్నేహం. వాళ్లది రొమాంటిక్ రిలేషన్ కాదు. వాళ్ల స్నేహం చూస్తే మనకు కూడా అలాంటి స్నేహితులు ఉంటే బాగుండనిపిస్తుంది.

అలా అయితే ఆయనతో ఇబ్బందుండదు

సురేశ్‌బాబుగారితో కలిసి పనిచెయ్యడం కష్టమేమీ కాదు. ఆయన ప్రతి డిటైల్ అడుగుతారు. మనం పర్ఫెక్టుగా ప్లాన్ చెయ్యగలిగితే ఆయనతో ఏ ఇబ్బందీ ఉండదు.

సమంత ఇన్వాల్వ్ అయ్యింది

సమంత నాకు ఫ్రెండ్ అనే విషయం పక్కనపెడితే ఆమె ఈ సినిమాకు బాధ్యత తీసుకున్నారు. ఈ సినిమాలో సమంతను ఇన్వాల్వ్ అవ్వమని సురేశ్‌బాబుగారు చెప్పారు. ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్‌లో సమంత ఇన్వాల్వ్ అయ్యారు. దానివల్ల మా మధ్య ఓపెన్‌గా డిస్కషన్స్ జరిగేవి. సినిమా స్టార్ట్ అయ్యే ముందు మేం మాట్లాడుకున్నాం. మా మధ్య ఇగో అడ్డు రాకూడదని ముందే మాట్లాడుకున్నాం. ఇద్దరం క్లియర్‌గా ఒకటే సినిమాని చూశాం. దానివల్ల నా పని సులువైంది.

అమ్మపట్ల నా ప్రవర్తన మారింది

ఈ సినిమా చేయడం మొదలుపెట్టాక మా అమ్మ మీద కసురుకోవడం తగ్గించాను. అమ్మ విషయంలో నా ప్రవర్తన ఎలా ఉందనేది ఈ సినిమా ఆలోచింపజేసింది. అమ్మ పట్ల కొంచెం ఓపిక పెరిగింది నాలో. ఆమె విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకుంటున్నా.

వైజయంతీ మూవీస్‌లో చెయ్యబోతున్నా

నా తదుపరి సినిమా వైజయంతీ మూవీస్‌లో ఉంటుంది. అందులో విజయో, అజయో, సునీలో, అనీలో.. ఎవరుంటారో తెలీదు. క్యాస్టింగ్‌ని తర్వాత డిసైడ్ చేస్తాం. స్క్రిప్ట్ లాక్ చేశాం. అది వినోదాత్మక చిత్రం. నిజానికి రెండు స్క్రిప్టులున్నాయి. దేంతో ముందుగా వెళ్తామో తెలీదు. ఒకటి మల్టీస్టారర్ సబ్జెక్ట్, ఇంకోటి సింగిల్ హీరో సబ్జెక్ట్.

‘ఓ బేబీ’ చరిత్ర తిరగరాసే సినిమా అని చెప్పను: డైరెక్టర్ నందినీరెడ్డి ఇంటర్వ్యూ | actioncutok.com

More for you: