Interview: Director Arjun Jandyala


Interview: Director Arjun Jandyala

Interview: Director Arjun Jandyala

పదహారేళ్ల క్రితం పందొమ్మిదేళ్ల ఒక కుర్రాడు ప్రకాశం జిల్లా నర్సింగోలు నుంచి సినిమాల్లో నటించానే కోరికతో హైదరాబాద్‌ వచ్చాడు. చాలా ప్రయత్నించాడు కానీ ఎక్కడా వేషాలు దొరకలేదు. అనుకోకుండా అప్పుడే డైరెక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించిన బోయపాటి శ్రీను దగ్గర పని చేసే ఛాన్స్‌ వచ్చింది. ఆ సమయానికి ‘భద్ర’ సినిమా షూటింగ్‌ ముగింపు స్థితిలో ఉంది. కట్‌ చేస్తే.. ఇవాళ ముప్పై ఐదేళ్ల వయసున్న ఆ యువకుడు డైరెక్టర్‌ అయ్యాడు. ‘ఆర్‌ ఎక్స్‌ 100’తో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న కార్తికేయను డైరెక్ట్‌ చేస్తూ ‘గుణ 369’ సినిమా రూపొందించాడు. ఆ యువకుడు.. అర్జున్‌ జంధ్యాల. ఆగస్ట్‌ 2న ఆ సినిమా ప్రేక్షకు ముందుకు వస్తోంది. ఏడెకరాల అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఆ సినిమా డిజిటల్‌ ఇంటర్మీడియేట్‌ పనుల్లో నిమగ్నమై ఉన్న అర్జున్‌.. సినిమా గురించి, ఇతర విషయాల గురించీ ప్రత్యేకంగా చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే…

‘‘నా పూర్తి పేరు మల్లికార్జున్‌ జంధ్యాల. నేను ఒంగోల్లో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చదువుతూ మధ్యలో హైదరాబాద్‌ వచ్చేశాను. తర్వాత దాన్ని పూర్తి చేశాననుకోండి! మా నాన్న డాక్టర్‌ జంధ్యాల శాస్త్రి గారు జ్యోతిష శాస్త్రవేత్త. ఆయన సపోర్ట్‌ ఉండటం వల్లే నేను సినిమా రంగంలోకి రాగలిగాను. నిన్నటి దాకా నన్ను పోషించింది ఆయనే.’’

సొంత తమ్ముడిలా చూసుకున్నారు

‘‘నేను ‘భద్ర’ సినిమా షూటింగ్‌ లాస్ట్‌ స్టేజిలో ఉన్నప్పుడు బోయపాటి గారి దగ్గరకు వచ్చినా.. నేను డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచెయ్యడం మొదుపెట్టింది మాత్రం ‘తులసి’ సినిమా నుంచే. అప్పట్నుంచి ‘వినయ విధేయ రామ’ ఫస్ట్‌ షెడ్యూల్‌ వరకూ పదమూడేళ్ల పాటు ఆయనతోనే ఉన్నా. సొంత తమ్ముడిలా ఆదరించారు. ఆయన దగ్గర దర్శకత్వ మెళకువలతో పాటు ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో కూడా నేర్చుకున్నా.’’

‘ఆర్‌ ఎక్స్‌ 100’ చూసి ఫిక్సయ్యా!

‘గుణ 369’ లైన్‌ను నేను 2012లోనే రాసుకున్నా. ‘ఆర్‌ ఎక్స్‌ 100’ చూసినప్పుడు ఆ లైన్‌ కార్తికేయకు పనికొస్తుందని ఫిక్సయ్యా. నిజానికి వేరే కథలతో నేను పెద్ద హీరోలను అప్రోచ్‌ అయ్యాను. కథలు నచ్చాయన్నారు కానీ ఏవీ వాస్తవ రూపం ధరించలేదు. కార్తికేయను కలిసి 20 నిమిషాల సేపు లైన్‌ చెప్పాను. వెంటనే నచ్చిందని చెప్పాడు. ఫుల్‌ స్క్రిప్ట్‌ చెప్పమన్నాడు. పదిహేను రోజులు టైం తీసుకొని స్క్రిప్ట్‌ పూర్తిచేసి 3 గంటల సేపు వినిపించాను. ఆయనకు బాగా నచ్చేసింది. నిజానికి ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చెయ్యడానికి మా నాన్నగారు ముందుకొచ్చారు. కానీ తర్వాత అనిల్‌ కడియాల, తిరుమల్‌రెడ్డి గార్లు ఈ సినిమా నిర్మించేందుకు ముందుకు రావడంతో వాళ్లకు అప్పగించాం.

అడిగిన దానికన్నా గ్రాండియర్‌గా నిర్మించారు!

కథానుసారం ఒంగోల్లో 90 శాతం సన్నివేశాల్ని షూట్‌ చేశాం. కొన్ని సన్నివేశాల్ని హైదరాబాద్‌లో, రెండు పాటల్ని విదేశాల్లో చిత్రీకరించాం. ఈ సినిమా చూశాక ‘ఒంగోల్లో ఇలాంటి లోకేషన్లు ఉన్నాయా!’ అని అందరూ ఆశ్చర్యపోతారు. 60 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశాం. నేను అడిగిన దానికి మించి గ్రాండియర్‌గా ఈ సినిమాని నిర్మించారు అనిల్‌ గారు, తిరుమల్‌రెడ్డి గారు. ఆ ఖర్చంతా తెరపై కనిపిస్తుంది. టైటిల్స్‌, థాంక్స్‌ కార్డుతో కలిపి 2 గంటల 24 నిమిషాల నిడివి సినిమా ఇది. కచ్చితంగా ప్రేక్షకులు ఒక ఎమోషన్‌తో, ఒక మంచి సినిమా చూశామనే తృప్తితో థియేటర్‌ నుంచి బయటికొస్తారు.

రెగ్యులర్‌ స్టోరీ కాదు..

ఇది నిజ జీవిత ఘటనను ఆధారం చేసుకొని రాసుకున్న కథ. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా స్టోరీ కాదు. మనం చేసే తప్పు మనకు నష్టం కలిగించినా, పక్కవాళ్లకు నష్టం కలిగించకూడదనే పాయింట్‌పై ఈ కథ నడుస్తుంది. ఇందులో హీరో కేరెక్టర్‌ పేరు గుణ. ఒక క్వారీలో పని చేస్తుంటాడు. హీరో క్యారెక్టరైజేషన్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ ప్రధానంగా ఈ సినిమా ఉంటుంది. ‘మనం ఎలా ఉంటే కరెక్ట్‌. ఎలా ఉండకపోతే కరెక్ట్‌’ అనే విషయాన్ని చెప్పే కథ ఇది. అయితే మెసేజ్‌ చెప్పినట్లు ఈ కథ ఉండదు. గుణ కేరెక్టర్‌ను చూస్తుంటే మనల్ని మనం తెర మీద చూసుకున్నట్లు ఉంటుంది. కామన్‌ మ్యాన్‌కు ప్రతినిధిగా గుణ కనిపిస్తాడు. తనకు తెలీకుండా ఒక పరిస్థితిలో చిక్కుకుపోయిన గుణ, దాన్నుంచి ఎలా బయటపడ్డాడనే అంశాన్ని అత్యంత ఉత్కంఠభరితంగా చిత్రీకరించాం. నెక్స్ట్‌ సీన్‌ ఏమిటో ప్రేక్షకులు అంచనా వెయ్యలేని రీతిలో సినిమా ఉంటుంది. దీనికి అందమైన ప్రేమకథనీ మేళవించాను. అది కూడా రియలిస్టిగ్గా ఉంటుంది. స్క్రిప్ట్‌ విషయంలో నాతో పాటు ఇద్దరు యువకులు ప్రయాణించారు. స్క్రిప్ట్‌ నాదే అయినా లక్ష్మీనారాయణ, బాలకిశోర్‌ అనే ఇద్దరు యువకులు దాని డెవలప్‌మెంట్‌లో సాయపడ్డారు. లక్ష్మీనారాయణ వరుసకు నా సోదరుడే.

ఒక డైరెక్టర్‌గా గర్వపడ్డాను

నిజం చెప్తున్నా.. తెలుగు చిత్రసీమలోని ప్రతిభావంతులైన నటుల్లో కార్తికేయ తప్పకుండా ఉంటారు. ‘ఆర్‌ ఎక్స్‌ 100’తో పోలిస్తే ఎన్నో రెట్లు గొప్పగా గుణ కేరెక్టర్‌ను పోషించారు. ఆయనకు ఆ పాత్ర మంచి పేరు తీసుకొస్తుంది. అనేక సన్నివేశాల్లో కార్తికేయ నటన చూసి, ఒక డైరెక్టర్‌గా నేను గర్వపడ్డాను. ఒక మొబైల్‌ షాప్‌ నడిపే హీరోయిన్‌గా అనఘ కూడా చక్కని నటన ప్రదర్శించింది. మనింట్లో అమ్మాయిలా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. హీరో తండ్రిగా నరేశ్‌, విలన్‌గా ఆదిత్య మీనన్‌ తమ నటనతో మెప్పిస్తారు. హీరో ఫ్రెండ్‌గా ‘రంగస్థలం’ మహేశ్‌ అలరిస్తాడు.

అప్పుడు టెన్షన్‌ పడ్డా!

తొలి సినిమాని తెరపై చూసుకున్నాక ఎవరైనా భావోద్వేగానికి గురవుతారు కదా. నేనూ అంతే. నేను రాసుకున్న కథని తెరపై చూసుకున్నాక అనుకున్నట్లు తియ్యగలిగాననే ఆనందం కలిగింది. కార్తికేయ, నిర్మాతలు కూడా సినిమా చూసుకొని హ్యాపీ ఫీలయ్యారు. మా నిర్మాతలు ఈ సినిమాని ఇండస్ట్రీలోని కొంతమంది పెద్ద నిర్మాతలకు చూపించారు. వాళ్లేం చెప్తారో, ఏవైనా మార్పులు చెబితే ఎలా కన్విన్స్‌ చెయ్యాలో అని టెన్షన్‌ పడ్డాను. అయితే వాళ్లు కూడా సినిమా బాగుందనీ, దానిలో ఎలాంటి మార్పులూ చెయ్యాల్సిన అవసరం లేదనీ చెప్పడంతో హాయిగా ఊపిరి ప్చీుకున్నా.

మా గురువు బాగుందన్నారు

మా గురువు బోయపాటి గారు ఈ సినిమా ఓపెనింగ్‌ రోజు వచ్చారు. తర్వాత షూటింగ్‌ చివరి రోజు రమ్మంటే వచ్చి వెళ్లారు. ఈ మధ్యే ఆయనకు సినిమా చూపించాను. బాగుందన్నారు. ఏమైనా సజెషన్స్‌ చెప్పమంటే, ‘ఏమీ అవసరం లేదు.. తమకు ఎలా చెప్పావో, అలాగే తీశావని నిర్మాతలు నాతో చెప్పారు. అది చాలు.. ఇది బాగుంది. దీన్ని కదిలించకూడదు’ అన్నారు. అలా ఆయన ఆశీర్వాదాలు ఈ సినిమాకున్నాయి.

ఇదీ నా కుటుంబం

మా అమ్మానాన్నకు నలుగురం పిల్లలం. నాకు ముగ్గురు అక్కలు. నేనే చిన్నవాడ్ని. రెండేళ్ల క్రితమే నా పెళ్లయింది. మా పెద్దక్క కూతుర్నే చేసుకున్నా. ఆమె ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌.

  • యజ్ఞమూర్తి

Interview: Director Arjun Jandyala | actioncutok.com

More for you: