‘సవారి’ టీజర్ విడుదలైంది


'సవారి' టీజర్ విడుదలైంది

‘సవారి’ టీజర్ విడుదలైంది

‘బంధం రేగడ్’ అనే ఇండిపెండెంట్ మూవీతో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించిన సాహిత్ మోత్కూరి రూపొందిస్తోన్న చిత్రం ‘సవారి’. నందు, ప్రియాంకా శర్మ జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో గుర్రం ఒక కీలక పాత్రను పోషించడం గమనార్హం. కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్, నిసా ఫిలిమ్స్ బేనర్లపై సంతోష్ మోత్కూరి, నిషాంక్‌రెడ్డి కుడితి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శుక్రవారం (జూలై 5) ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో ‘పెళ్లిచూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ‘అర్జున్‌రెడ్డి’ ప్రొడ్యూసర్ వంగా ప్రవీణ్‌రెడ్డి, సినీ పాత్రికేయుడు టీవీఆర్ ‘సవారి’ టీజర్‌ను ఆవిష్కరించారు. టీజర్ మస్తుగా ఉందని తరుణ్ భాస్కర్ ప్రశంసించారు. “తమిళ, మలయాళ సినిమాల తరహాలో లోకల్ ఫ్లేవర్ కనిపిస్తోంది. నందుని డీగ్లామరైజ్ చేసి బాగా చూపించారు. ‘పెళ్లిచూపులు’లో చాలా బాగా చేశాడు. అతని డెడికేషన్, అతని హార్డ్వర్క్‌కు హ్యాట్సాఫ్. ఇంత ప్యాషన్‌తో ఉండే యాక్టర్స్ తక్కువమంది. ఇలా ఎలాంటి ఇగోస్ లేని యాక్టర్స్ ఇప్పుడు వస్తున్నారు. రేపు నందు పెద్ద స్టార్ అయినా వినయంగానే ఉంటాడు. అతనిది అంత మంచి మనసు. గత కొన్ని వారాలుగా చూస్తుంటే ప్రతి శుక్రవారం వచ్చే సినిమాలు పాన్-ఇండియా లేవల్లో ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. ఇతర ప్రాంతీయ భాషా చిత్రాలకు మన సినిమాలు ప్రేరణగా నిలుస్తున్నాయనిపిస్తోంది. లోకల్ సినిమాలే గ్లోబల్‌గా పేరు తెచ్చుకుంటాయి. లోకల్ స్టోరీస్ చెప్పగలిగి, దాంతో బిజినెస్ చెయ్యగలిగి, ఇతర భాషల్లో రీమేక్ చెయ్యగలుగుతున్నామంటే.. తెలుగు సినిమాకు ఇది గోల్డెన్ పీరియడ్. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్’ వసూళ్లు రూ. 300 కోట్లు దాటుతున్నాయంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనా పొజిషన్‌లో లేననే ఒక్క ఔన్స్ జెలసీ కూడా నాలో లేదు. తెలుగు సినిమా జెండాని అలా ఎగరవేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్రం సినిమా వచ్చాకా నా గుర్రం సినిమా కూడా వస్తుంది. ఎందుకంటే నా రాబోయే సినిమా కూడా గుర్రం గురించే. ఇప్పటికే ‘సవారి’ టీజర్ వైరల్ అయిపోయింది” అని ఆయన చెప్పారు.

'సవారి' టీజర్ విడుదలైంది

హీరో నందు మాట్లాడుతూ “మంచి కథ దొరకాలి, మంచి రిలీజ్ దొరకాలి, మంచి దర్శకుడు దొరకాలి.. అన్నీ కుదరాలి. నందుగాడు ఏం చేస్తున్నాడు.. అన్నీ ఫ్లాపులే అనుకుంటారు. కాదు భాయ్. ఈసారి మంచి సినిమాతోనే వస్తున్నా. ఈ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ సాహిత్‌దే. అందుకే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. అప్నా టైం ఆయేగా. అందరికీ ఒకరోజు టైం వస్తుంది. ఇప్పుడు నాకు టైం వచ్చిందనుకుంటున్నా” అన్నారు.

‘అర్జున్‌రెడ్డి’ నిర్మాత ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ “సినిమా తియ్యడం ఎంత కష్టమో నేను చూశాను. ‘ఇల్లుకట్టి చూడు.. పెళ్లిచేసి చూడు’ అంటారు. అదికాదు. ఒక సినిమా తీసి చూస్తే ఆ కష్టమేందో తెలుస్తుంది. ఈ సినిమాని ఎంత కష్టపడి తీశారో నాకు తెలుసు. నాకు సాధ్యమైనంతలో ఈ సినిమాకి సహాయపడుతున్నా. ఇది కేరెక్టర్ ఆధారంగా నడిచే సినిమా అని టీజర్ చూస్తే అర్థమైంది. ‘అర్జున్‌రెడ్డి’ తరహాలో ఈ సినిమా సక్సెస్ కావాలని ఆశిస్తున్నా” అని చెప్పారు.

కొత్త తరం దర్శకుల్లో తాను బాగా ఇష్టపడే దర్శకుడు సాహిత్ అని టీఎన్ఆర్ అన్నారు. “ఇంత పేషనేట్‌గా పనిచేసే దర్శకుడ్ని నేని ఈ మధ్య కాలంలో చూడలేదు. తెలంగాణావాడు కాకపోయినా తెలంగాణ యాసలో నందు బాగా మాట్లాడాడు. అతనికి ఈ సినిమా బ్రేక్‌నిస్తుందని నమ్ముతున్నా” అని ఆయన చెప్పారు.

'సవారి' టీజర్ విడుదలైంది

డైరెక్టర్ సాహిత్ మాట్లాడుతూ “టీజర్ నచ్చితే, పోస్టర్స్ నచ్చితే, రాబోయే ట్రైలర్ నచ్చితే మూవీకి రండి. నందుకీ, టెక్నీషియన్స్‌కీ థాంక్స్ చెప్పుకుంటున్నా” అన్నారు. హీరోయిన్ ప్రియాంకా శర్మ మాట్లాడుతూ “డైరెక్టర్ సాహిత్ లేకపోతే ఇలాంటి పాత్ర నాకు వస్తుందని కూడా నేను ఊహించుకోలేను. ఇందులో నేను చేసిన ‘బాఘి’ కేరెక్టర్ పూర్తిగా నాకు భిన్నమైంది. నాలో నమ్మకం నింపి, ఈ పాత్ర నాతో చేయించాడు దర్శకుడు. నందు ఫెంటాస్టిక్ యాక్టర్. అంతకు మించి మంచి మనసున్న మనిషి” అని చెప్పారు.

సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర మాట్లాడుతూ “టీజర్ చూస్తేనే సాహిత్ ఎంత ప్రామిసింగ్ డైరెక్టరో అర్థమవుతుంది. మ్యూజిక్ విషయంలోనూ ఎంతో కేర్ తీసుకొని నాతో వర్క్ చేయించుకున్నారు. ఇందులో ఒకదానికొకటి భిన్నంగా ఉండే 5 పాటలున్నాయి. ఇప్పటివరకూ నేను ఇట్లాంటి ప్రయోగాలు చెయ్యలేదు. నందు నుంచి అంత్దరు యాక్టర్లూ చాలా బాగా చేశారు. క్లాస్‌గా కనిపించే నందు ఈ సినిమాలో దానికి పూర్తి భిన్నమైన కేరెక్టర్లో కనిపిస్తాడు. ఆ పాత్రను తను తప్ప ఇంకెవరూ చెయ్యలేరనిపించింది” అన్నారు. ఈ కార్యక్రంలో నటులు మ్యాడీ, జీవన్, శివ, ఎడిటర్ సంతోష్ మీనం, సినిమాటోగ్రాఫర్ మోనిష్ భూపతిరాజు, ఆర్ట్ డైరెక్టర్ అర్జున్ సూరిశెట్టి, ప్రొడక్షన్ డిజైనర్ అభిజిత్ గుముడవెల్లి, ఇతర యూనిట్ మెంబర్స్ పాల్గొన్నారు.