హీరోయిన్ అవ్వాలనేది నా కల: శివాత్మిక


హీరోయిన్ అవ్వాలనేది నా కల: శివాత్మిక

హీరోయిన్ అవ్వాలనేది నా కల: శివాత్మిక

డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల గారాల పట్టి, శివాని ముద్దుల చెల్లెలు శివాత్మిక హీరోయిన్‌గా పరిచయమవుతున్న చిత్రం ‘దొరసాని’. కేవీఆర్ మహేంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బేనర్లపై మధుర శ్రీధర్, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. డి. సురేశ్‌బాబు సమర్పిస్తోన్న ఈ సినిమా జూలై 12న విడుదలైన సందర్భంగా ఆ సినిమా గురించీ, ఇతర విషయాల గురించీ శివాత్మిక చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే..

నా డెబ్యూగా ఈ సినిమాని ప్లాన్ చెయ్యలేదు. హీరోయిన్ అవ్వాలనే ఇష్టమైతే ఉండింది. నాన్నను, అమ్మను చూసి అక్కకూ అదే కల, నాకూ అదే కల. అక్క సినిమాలకు సంతకం చేసింది. వాటి వర్క్ నడుస్తోంది. ‘దొరసాని’గా 18 ఏళ్ల తెలుగమ్మాయి కోసం మధుర శ్రీధర్ గారు వెతుకుతున్నారు. మా ఫ్యామిలీకి ఆయన మంచి ఫ్రెండ్. ఆయనకు నేను తెలుసు. “ఒకసారి కథ వినండి. మీకు నచ్చిదే చూద్దాం” అన్నారు. అప్పుడే నేను 12 క్లాస్ ఎగ్జామ్స్ రాశాను. నేనేమో ఒక సంవత్సరం డ్రామానో, డాన్సో చేద్దామనుకుంటున్నా. ఆ టైంలో ఈ కథ వినమన్నారు. సరేనని కథ విన్నాను. చాలా చాలా నచ్చింది. మొదటి సినిమాకే అలాంటి కథ రావడం అదృష్టం. అంత గొప్ప కథ. ఆ తర్వాత ఆడిషన్, స్క్రీన్ టెస్ట్ చేశారు. అలా నేను ఈ ప్రాజెక్టులోకి వచ్చాను.

తెలుగు సంజయ్‌లీలా భన్సాలి

ఇది పాతకాలం ప్రేమకథ లాంటిది కాదు. పాత కాలం సెటప్‌లో ఒక మంచి ప్రేమ కథ. ఇప్పుడొచ్చే తరహా సినిమాల్లో లాంటి పాత్రలే చెయ్యాలనే ఐడియా లేదు. మంచి మంచి కేరెక్టర్స్ చెయ్యాలనేది నా కోరిక. నేను సంజయ్‌లీలా భన్సాలీ అభిమానిని. తెలుగు సంజయ్‌లీలా భన్సాలి (కేవీఆర్ మహేంద్ర) వచ్చి సినిమా చేస్తావా అని అడిగినప్పుడు ఎలా కాదంటాను! హెయిర్ స్టైల్ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ ఆయన చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. ఆ కాలంలో ఒక పద్దెనిమిదేళ్ల దొరసాని ఎలా ఉంటుంది, తనకు ఎదురైన ఒక సందర్భంలో ఎలా వ్యవహరిస్తుందనే కథని బ్యూటిఫుల్‌గా రాసుకున్నారు.

ఆయన కాన్ఫిడెన్స్ ఇచ్చారు

నేను సినిమాలో నటించడం మొదలుపెట్టి మేం ఫ్రెండ్స్ అయ్యాక మహేంద్రగారిని  “ఎందుకు సార్.. పర్టిక్యులర్‌గా ఈ కేరెక్టర్‌కు నన్ను ఎంచుకున్నారు?” అనడిగా. “నువ్వు నడిసొచ్చి కూర్చొనే విధానంలో నాకు దొరసాని కనిపించింది” అని ఆయన చెప్పారు. దాంతో ఆయనకు థాంక్స్ చెప్పా. ఆయనిచ్చిన కాన్ఫిడెన్స్‌తోటే అనుకుంటా.. దేవకి పాత్రను బాగా చెయ్యగలిగాను.

ఫస్ట్ షాట్‌లో ఫ్రీజ్ అయిపోయా

సినిమాలో ఫస్ట్ షాట్‌ను నాపైనే తీశారు. కెమెరాకు వీపు చూపిస్తూ ఆ షాట్ చెయ్యాలి. ఫోన్ వస్తే దాన్ని ఎత్తి పట్టుకోవాలంతే. వెళ్లి నిల్చోమన్నారు. నేను నిల్చున్నాక “యాక్షన్” అన్నారు. అంతే.. ఫ్రీజ్ అయిపోయా. తర్వాత చేశాననుకోండి. ఆ షాట్‌కు మూడు టేకులు తీసుకున్నా. అది కూడా డైరెక్టర్ బాగా పర్టిక్యులర్ కావడం వల్లే. ఆ షాట్ చేసేప్పుడు నా హార్ట్ గట్టిగా కొట్టుకోవడం నాకు తెలిసింది. ఏదేమైనా తొలి షాట్ అనుభవం బాగుంది.

అతడి ప్లేస్‌లో ఇంకొకర్ని ఊహించుకోలేను

ఆనంద్ దేవరకొండతో కలిసి పనిచేయడాన్ని బాగా ఆస్వాదించా. మొదట నాకు విజయ్ దేవరకొండకు ఒక బ్రదర్ ఉన్నాడనీ, అతను ఆనంద్ అనీ నాకు తెలీదు. స్క్రీన్ టెస్ట్ రోజు మేం తొలిసారి కలుసుకున్నాం. అప్పుడే మేం ఫ్రెండ్స్ అయిపోయాం. రాజు పాత్రను అతను చాలా బాగా చేశాడు. నాకంటే ముందుగానే అతడ్ని సెలక్ట్ చేసుకున్నారు. మొదట అతను ఏం చేస్తాడో అనుకున్నా. అయితే ఒకసారి సెట్స్‌పైకి వెళ్లాక ఇప్పటికి కూడా అతడి స్థానంలో మరో యాక్టర్‌ను నేను ఊహించుకోలేకపోయా. అతను చాలా హార్డ్‌వర్కర్. చాలా ప్రోపర్‌గా ఆ పాత్రను పోషించాడు. అతనికి జోడీగా నటించడం గర్వంగా ఫీలవుతున్నా.

నాలో అమ్మ పోలికలున్నాయి

సినిమా చేస్తున్నప్పుడే నేను అమ్మలాగా ఉన్నానని జనం అంటూ వచ్చారు. అమ్మ పోలికలు నాలో ఉన్నాయి. ఆమె 18 ఏళ్ల వయసున్నప్పటి ఫొటోలు చూసే నేను ఈ సినిమాలో నా ఆభరణాలు, జడకు రిఫరెన్స్ తీసుకున్నా.

హీరోయిన్ అవ్వాలనేది నా కల: శివాత్మిక

కళ్లతోటే ఎమోషన్స్ పలికించాను

సినిమా మొత్తమ్మీద నాకుండే డైలాగ్స్ పదో, పదకుండో! నాపై క్లోజప్ షాట్స్ ఎక్కువ. నా ఎదుటివాళ్లు మాట్లాడుతున్నప్పుడు కెమెరా వాళ్ల మీద కాకుండా నామీద ఫోకస్ చేసి ఉంటుంది. వాళ్ల మాటలకు నా కళ్లతో భావాలు పలికించాలి. ప్రేమైనా, కోపమైనా, చిరాకైనా సరే.. నా కళ్ల ద్వారా చూపించాలి. నేనెలా ఎమోషన్స్ పలికించానో ప్రేక్షకులే చెప్పాలి.

ఎక్కువ ప్రయోగాలు చెయ్యను

ఇప్పటికే కొన్ని ఆఫర్స్ వచ్చాయి. ఇంకా దేనికీ ఓకే చెప్పలేదు. ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నా. ఏదేమైనా నా వయసుకు తగ్గ మంచి పాత్రలు ఎంచుకోవాలని అనుకుంటున్నా. మరీ ప్రయోగాలు చేయాలని అనుకోవట్లేదు.

నేనెవర్నీ అనుకరించను

నాన్నెప్పుడూ ఒక డైరెక్టర్స్ యాక్టర్‌లాగే ఉంటారు. సెట్లోకి వచ్చాక డైరెక్టర్ ఏది చెప్తే అదే చేస్తారు. ‘గరుడవేగ’లో కానీ, ‘కల్కి’లో కానీ డైరెక్టర్ నీళ్లల్లో దూకి యాక్ట్ చెయ్యమంటే దూకి యాక్ట్ చేశారు. నాపై తెలీకుండానే అమ్మానాన్నల ఇన్‌ఫ్లుయెన్స్ ఉండవచ్చు. అయితే ఎవర్నీ కాపీ కొట్టొద్దని వాళ్లు చెప్తుంటారు. ఒకర్ని అనుకరిస్తూ నటిస్తుంటే మన ఒరిజినాలిటీ పోతుందని చెప్తుంటారు. అందువల్ల నటిగా నేనెవర్నీ అనుకరించను.

మేం నలుగురం ఫ్రెండ్స్

నా జీవితంలో అమ్మానాన్నలు, అక్క చాలా ముఖ్యమైన వ్యక్తులు. నలుగురం ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఈ మధ్య ఒకసారి రాత్రి ఐస్ గోల ఇందామని నలుగురం కలిసి బయటకు వెళ్ళాం. కానీ ఐస్ గోల దొరకలేదు. అలా ఉంటాం. మా ఫ్రెండ్స్ కూడా అమ్మానాన్నలకు ఫ్రెండ్సే.

ఆ ప్రెజర్ ఫీలవుతున్నా

నటిగా అమ్మానాన్నల వారసత్వాన్ని తీసుకోవడం ఒకవైపు ప్లెజర్, ఇంకోవైపు ప్రెజర్. వాళ్ల పిల్లలుగా అక్క, నేను గర్వపడుతుంటాం. రాజశేఖర్ పేరును క్యారీ చేస్తున్నందుకు గర్వపడుతుంటాం. అది ప్లెజర్. అయితే వాళ్లెప్పుడూ మాపై ప్రెజర్ పెట్టింది లేదు. ఇప్పుడు నాపై ఉన్న ప్రెజరంతా దేవకి కేరెక్టర్‌ను నేను సరిగా పోషించానా, లేదా.. అనేదే. ఆ కేరెక్టర్‌కు నేను న్యాయం చేశానా, లేదా.. ప్రేక్షకులు ఏం చెప్తారనే ప్రెజర్ ఫీలవుతున్నా.

హీరోయిన్ అవ్వాలనేది నా కల: శివాత్మిక | actioncutok.com

More for you: