‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌ని నాని మొయ్యగలడా?


'గ్యాంగ్ లీడర్' టైటిల్‌ని నాని మొయ్యగలడా?

‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌ని నాని మొయ్యగలడా?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోని బిగ్ బ్లాక్‌బస్టర్స్‌లో ముందు వరుసలో ఉండే మూవీ ‘గ్యాంగ్ లీడర్’. విజయ బాపినీడు డైరెక్ట్ చేసిన ఆ సినిమా 1991లో వచ్చింది. 1990లో శ్రీదేవితో కలిసి చిరంజీవి తొలిసారి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాసింది. దాని తర్వాత చిరంజీవి నటించిన ‘కొదమ సింహం’, ‘రాజా విక్రమార్క’, ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ సినిమాలు ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోయాయి.

ఆ టైంలో విజయశాంతి జోడీగా మెగాస్టార్ చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సూపర్ డూపర్ హిట్టయి, బాక్సాఫీసును మరోసారి బద్దలు కొట్టింది. మ్యూజికల్‌గా కూడా అది సూపర్ హిట్. ‘వానా వానా వెల్లువాయే’ పాట రెయిన్ సాంగ్స్‌లో క్లాసిక్‌గా నిలిచింది. ఆ సినిమాలో చిరంజీవి ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడైన రాజారాం అనే కేరెక్టర్‌లో అమోఘంగా రాణించారు. పెద్దన్న రఘుపతిని చంపిన హంతకులపై ప్రతీకారం తీర్చుకొనే, చెడు దారిలో నడిచిన చిన్నన్న రాఘవను దారిలో పెట్టే తమ్ముడిగా చిరంజీవికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఫ్యామిలీ వాల్యూస్‌కు పట్టం కట్టిన ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి జంట ప్రేక్షకులని అమితంగా అలరించింది.

అదిగో.. అలాంటి బ్లాక్‌బస్టర్ హిట్టయిన సినిమా టైటిల్‌తో త్వరలో మన ముందుకు మరో సినిమా వస్తోంది. ఈసారి ‘గ్యాంగ్ లీడర్’గా కనిపించబోతోంది మిడిల్ క్లాస్ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నాని. ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్‌ను అదివరకే మరొకరు ఫిలించాంబర్‌లో రిజిస్టర్ చేయడంతో ‘నానీస్ గ్యాంగ్ లీడర్’గా టైటిల్‌ను సరిచేశారు. అయినప్పటికీ ‘గ్యాంగ్ లీడర్’గానే ఆ సినిమాని అందరూ పిలుస్తున్నారు. సెప్టెంబర్ 13న.. అంటే ఇంకో మూడు వారాల్లోనే గ్యాంగ్ లీడర్‌గా నాని మన ముందుకు వస్తున్నాడన్న మాట. నేచురల్‌గానే నేచురల్ స్టార్ నాని సినిమాని మెగాస్టార్ మూవీతో కంపేర్ చేస్తున్నారు సినీ జనాలు. ఆ టైటిల్‌ని నాని క్యారీ చెయ్యగలడా?.. అని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు నానిని గ్యాంగ్ లీడర్‌గా చూపిస్తున్న్న డైరెక్టర్.. ‘మనం’ మూవీతో తెలుగువాళ్ల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న విక్రం కె. కుమార్. చిరంజీవి చేసిన ‘గ్యాంగ్ లీడర్’తో పోలిస్తే పూర్తి భిన్నమైన కథతో విక్రం ఈ సినిమాని తీస్తున్నట్లు ఇదివరకే నాని ప్రకటించాడు. కేవలం టైటిల్‌లో మాత్రమే పోలిక ఉంటుందనీ, స్టోరీ విషయంలో కానీ, ఇతర విషయాల్లో కానీ చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’తో ఈ సినిమాకి మరే పోలికా ఉండదనీ అతను తెలిపాడు.

ఈ మూవీలో నాని ఏ గ్యాంగ్‌కి లీడర్? నాని గ్యాంగ్‌లో ఉన్నవాళ్లంతా లేడీసే. ఐదుగురు లేడీస్. వాళ్లలో ఆరేళ్ల చిన్నపిల్ల నుంచి ఎనభై ఏళ్ల బామ్మ దాకా ఉండటం ఇంటెరెస్టింగ్ థింగ్. వాళ్లు – బామ్మ.. వరలక్ష్మి.. ప్రియ.. స్వాతి.. చిన్ను.. ఆ లేడీస్‌తో కలిసి నాని ఏం చేశాడనేదే ఈ ‘గ్యాంగ్ లీడర్’ స్టోరీ. ఈ సినిమాలో విలన్‌గా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ యాక్ట్ చేయడం విశేషం. అతనికి సంబంధించిన ఏదో రహస్యాన్ని ఛేదించడానికో, లేక అతని డెన్‌ను గుర్తించడానికో నాని గ్యాంగ్ రంగంలోకి దిగిందని అనుకోవాలి.

దేవి శ్రీప్రసాద్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఈ మూవీకి ఎస్సెట్ అవుతుందని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన ‘హోయ్‌న హోయ్‌నా’ సాంగ్ లిరిక్ వీడియో మ్యూజిక్ లవర్స్ ఆదరణ పొందింది. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ఎప్పుడూ కొత్తదనం కోసం ట్రై చేసే విక్రం కుమార్ ‘గ్యాంగ్ లీడర్’గా నానిని ఎలా ప్రెజెంట్ చేశాడనే దానిపై ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు.

అసలు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్‌కి నాని ఎంతవరకు న్యాయం చేస్తాడనేదే ఇప్పుడు నాని ఫ్యాన్స్‌నీ, చిరంజీవి ఫ్యాన్స్‌నీ వెంటాడుతున్న ప్రశ్న. మరో మూడు వారాల్లో దానికి ఆన్సర్ లభించనున్నది.

‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌ని నాని మొయ్యగలడా? | actioncutok.com

More for you: