Manmadhudu 2 Movie Review: 2 Ups & 4 Downs


Manmadhudu 2 Movie Review: 2 Ups & 4 Downs

Manmadhudu 2 Movie Review: 2 Ups & 4 Downs

తారాగణం: నాగార్జున, రకుల్‌ప్రీత్ సింగ్, వెన్నెల కిశోర్, లక్ష్మి, రావు రమేశ్, ఝాన్సీ, దేవదర్శిని, నిశాంతి, కీర్తి సురేశ్ (అతిథి పాత్ర), సమంత (స్పెషల్ అప్పీరెన్స్), బ్రహ్మానందం (స్పెషల్ అప్పీరెన్స్)

దర్శకుడు: రాహుల్ రవీంద్రన్

విడుదల తేదీ: 9 ఆగస్ట్ 2019

నాగార్జున టైటిల్ రోల్ చేసిన ‘మన్మథుడు 2’ మూవీ ఎంతో పాజిటివ్ బజ్‌తో ప్రేక్షకుల్ ముందుకు వచ్చింది. ఫ్రెంచ్ ఫిల్మ్ ‘ఐ డు’కు అధికారిక రీమేక్‌గా తయారైన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. మొత్తం పోర్చుగల్‌లో షూట్ చేసిన తొలి తెలుగు సినిమాగా ఊదరగొట్టిన ‘మన్మథుడు 2’ టైటిల్‌కు నాగార్జున నాయం చేశారా? విడుదలకు ముందే కామెడీ ఎంటర్‌టైనర్‌గా మొదటే ప్రచారం పొందిన ఈ సినిమా నవ్వులతో అలరించిందా? చూద్దాం.

కథ

మూడు తరాలుగా పోర్చుగల్‌లో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబంలోని సాంబశివరావు అలియాస్ శ్యాం (నాగార్జున) కథ ఇది. 50 ఏళ్ల నడి వయసులోని శ్యాంకు పెళ్లి చెయ్యాలని అతని తల్లి (లక్ష్మి), అక్కలు (ఝాన్సీ, దేవదర్శిని), చెల్లెలు (నిశాంతి) ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. శ్యాం మాత్రం కంటికి నచ్చిన అమ్మాయితో గడిపేస్తూ, పెళ్లికి మాత్రం దూరంగా ఉంటాడు. చివరకు ఇంట్లోవాళ్ల పోరుపడలేక అక్కడే ఒక రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పనిచేసే అవంతిక (రకుల్‌ప్రీత్)ను తన ప్రేయసిగా నటించమనీ, పెళ్లిరోజు ఎస్కేప్ అయిపొమ్మనీ అడుగుతాడు. ఇద్దరి మధ్యా 25 వేల యూరోలకు బేరం కుదురుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అవంతికను శ్యాం ప్రేయసిగా భ్రమపడ్డ కుటుంబం, ఆ తర్వాత నిజం తెలిసి ఎలా స్పందించింది? సాంబశివరావు, అవంతిక జీవితాలు ఏ తీరానికి చేరాయి?.. అనేది మిగతా కథ.

కథనం

పెళ్లి చేసుకోకుండా సరదాగా జీవితం గడపాలనుకొనే వ్యక్తికి ఇంట్లోవాళ్లు పెళ్లి చెయ్యాలని తలపెట్టడం, వాళ్ల పోరు పడలేక అతను అద్దె భార్యను తీసుకురావడమో, లేక అద్దె ప్రేయసిని తీసుకురావడమో కొత్త కథేమీ కాదు. ఇప్పటికే మనం ఇదే తరహాలో ‘అల్లుడుగారు’, ‘గ్రీకువీరుడు’ సినిమాల్ని చూశాం. నిజానికి ‘మన్మథుడు 2’ చూస్తుంటే మనకు ఆ రెండు సినిమాలు గుర్తురాక మానవు. చిత్రమేమంటే ‘గ్రీకువీరుడు’ కూడా నాగార్జునే. అదివరకు తనే చేసిన సినిమాని కొన్ని మార్పులతో ‘మన్మథుడు 2’గా నాగార్జున చేశారన్న మాట.

ఫ్రెంచ్ ఫిల్మ్ ‘ఐ డు’కు ‘మన్మథుడు 2’ రీమేక్. ‘ఐ డు’ చూసిన నాగార్జున, అది నచ్చి తెలుగులో తియ్యాలనుకున్నారు. కానీ ఆయనకు ఆ సినిమా చూసినప్పుడు తన ‘గ్రీకువీరుడు’ సినిమా గుర్తురాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ‘గ్రీకువీరుడు’లో నయనతార చేసిన కేరెక్టర్‌ను ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ చేసిందంతే. ఈ సినిమా లైన్ చాలా చిన్నది. సాంబశివరావు అలియాస్ శ్యాం అనే నడివయసు వ్యక్తి పెళ్లి చుట్టూ అల్లిన సంఘటనల సమాహారమే ‘మన్మథుడు 2’. బలమైన కథ కాబట్టి సహజంగానే కామెడీపై ఆధారపడ్డాడు దర్శకుడు. సినిమాలో బలమైన అంశం ఏదైనా ఉందంటే అది కామెడీయే.

శ్యాం అసిస్టెంట్ కిశోర్‌గా వెన్నెల కిశోర్ కేరెక్టర్‌ను ఆ హాస్యానికి ఉపయోగించుకున్నారు. తెలుగువాళ్లుగా మనం తెలుగు తగ్గించుకొని.. ఇంగ్లీషును ఎక్కువగా మన మాటల్లో వాడేస్తుంటే, పోర్చుగల్‌లోని తెలుగువాళ్లు శుభ్రమైన తెలుగు (సంస్కృతం కూడా) వాడటాన్ని కూడా కామెడీకి ఉపయోగించుకున్నారు. కిశోర్‌ను శ్యాం “కిశోరా” అని పిలవడం బాగుంది. శ్యాం, కిశోర్ మధ్య సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. కాకపోతే శ్యాం అమ్మయిలతో శృంగారం జరుపుతుంటే, ఇవతలి గదిలోని కిశోర్ ఆ శబ్దాలు భరించలేక దిళ్లతో చెవులు మూసుకున్నట్లు చూపించడం, అక్కడి వస్తువులన్నీ వైబ్రేట్ అవుతున్నట్లు చూపించడం కుటుంబ ప్రేక్షకుల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. పిల్లల్ని తీసుకొని వెళ్లిన పెద్దలకి చికాకు పుట్టిస్తాయి.

అవంతిక పాత్ర ప్రవేశించాక కథలో డ్రామా మొదలవుతుంది. శ్యాం, అవంతిక మధ్య అగ్రిమెంట్ కుదిరి.. శ్యాం ఇంటికి అవంతిక రాకపోకలు మొదలయ్యేప్పుడు తీసిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. శ్యాం పెళ్లి విషయం తెలిసి ఊరి నుంచి పోర్చుగల్‌కు వచ్చిన శ్యాం మేనమామ (రావు రమేశ్) పాత్రను కూడా వినోదాత్మకంగా మలవడం ప్లస్ పాయింట్. పెళ్లి జరిగే సమయంలో పథకం ప్రకారం అవంతిక ఎస్కేప్ అయితే శ్యాం తల్లి స్పృహతప్పి పడిపోతుంది. దానికి తనే కారకుడని తెలిసి కూడా శ్యాంలో పశ్చాత్తాపం కలగకపోవడం, అక్కడ్నుంచి ఇంకో గంటసేపు సినిమా నడించి, క్లైమాక్స్‌లో శ్యాం అలియాస్ సాంబశివరావుకు జ్ఞానోదయం కలిగినట్లు చూపించడం కన్విన్సింగ్‌గా లేదు.

తల్లి స్పృహతప్పి హాస్పిటల్ పాలయినప్పుడే సాంబశివరావులో మార్పు కలిగినట్లు చూపించి, డ్రామాను మరో రకంగా చూపించినట్లయితే కథలో కొత్తదనం వచ్చి ఉండేది. అలా లేని ఫలితంగా ‘మన్మథుడు 2’లో కామెడీ పండినట్లు డ్రామా, ఆ డ్రామాలోని ఎమోషన్స్ సరిగా పండలేదు. ఫ్లాష్‌బ్యాక్‌లో సాంబశివరావు ప్రేయసిగా కీర్తి సురేశ్ చేసిన అతిథి పాత్ర కానీ, సమంత, బ్రహ్మానందం ఇచ్చిన స్పెషల్ అపీరెన్సులు కానీ సినిమాకి ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఈ మూవీలో వాళ్ల ప్రెజెన్స్ వృథా.

Manmadhudu 2 Movie Review: 2 Ups & 4 Downs

నటీనటుల అభినయం:

సినిమాలో బాగా డిజప్పాయింట్ కలిగించింది నాగార్జునే అని చెప్పడం బాధాకరమైన విషయమే అయినా అదే నిజం. 17 ఏళ్ల క్రితం ‘మన్మథుడు’గా అలరించిన ఆయన, ఇప్పుడు ‘మన్మథుడు 2’గా ఆకట్టుకోలేకపోయాడు. క్లోజప్ షాట్స్‌లో ఆయన వయసు బాగా తెలిసిపోతోంది. మేకప్ పొరబాటో, కెమెరా లోపమో కానీ ఆ షాట్స్‌లో నాగ్ ముఖం ‘మన్మథుడు’కు ఏ మాత్రం న్యాయంచెయ్యని రీతిలో కనిపిస్తుంది. ఆయన నటనకు సాధారణంగా వంకపెట్టలేం. కానీ ఇందులో కొన్ని సన్నివేశాల్లో ఆయన హావభావాలు, సంభాషణలు పలికే తీరు సహజంగా కాక కృతకంగా అనిపిస్తాయి. కామెడీ కోసం ఆయన అలా చేశారని సరిపెట్టుకోలేం. మొత్తంగా ఈ సినిమాలో సాంబశివరావు అలియాస్ శ్యాంగా నాగ్ నిరాశపర్చారు.

అవంతిక పాత్రలో రాకుల్‌ప్రీత్ రాణించింది. ఒకవైపు జోవియల్‌గా ఉంటూ, ఇంకోవైపు తన జీవితంలోని ఎమోషనల్ కోణాన్ని ఆమె బాగా ఆవిష్కరించింది. సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ వెన్నెల కిశోర్. ఆల్మోస్ట్ హీరో కేరెక్టర్‌కు సమానమైన నిడివి కలిగిన కేరెక్టర్‌లో అతను చెలరేగిపోయాడు. తను బాధపడుతూ ప్రేక్షకుల్ని బాగా నవ్వించాడు. అతని మాటలకు నవ్వుతాం, అతని హావభావాలకు నవ్వుతాం. హీరో తల్లి పాత్రలో లక్ష్మి పర్ఫెక్టుగా ఒదిగిపోయారు. ఆమెను తప్ప మరొకర్ని ఆ కేరెక్టర్‌లో ఊహించలేం. సినిమాలో ఇంకో రిలీఫ్ పాయింట్ రావు రమేశ్. అత్తరు మావయ్యగా మంచి వినోదాన్ని పండించాడు. ఝాన్సీ, దేవదర్శిని తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు.

సాంకేతిక అంశాలు

విడిగా వింటే ఫర్వాలేదన్నట్లు ఉన్న పాటలు సినిమాలో ఎఫెక్టివ్‌గా లేవు. రీరికార్డింగ్ కూడా అదే బాపతు. సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల బాగుందనిపించినా నాగార్జునను సరిగా ప్రెజెంట్ చెయ్యలేకపోయింది. ‘మన్మథుడు’గా ఆయనను ఎలివేట్ చెయ్యడంలో కెమెరా విఫలమైంది. నాగ్ మేకప్ కూడా తీసికట్టుగా ఉంది. క్లోజప్ షాట్స్‌లో మేకప్ లోపాలు స్పష్టం. కళా దర్శకత్వం ఫర్వాలేదు. ఎడిటింగ్ కత్తెరకు మొదటి అరగంట ఆటలో కత్తెరకు పనిచెప్పాల్సింది.

చివరి మాట

నవ్వుల పరంగా ఓకే అనిపించే ‘మన్మథుడు 2’ మూవీ టైటిల్‌కు న్యాయం చేకూర్చలేదు. డ్రామా, ఏమోషన్స్ సరిగా పండకపోవడంతో అసంతృప్తికి గురవుతాం. ‘మన్మథుడు’కు సీక్వెల్ కాకపోయినా, ఆ టైటిల్ పెట్టారు కాబట్టి దానితో పోలిస్తే ఏ రకంగానూ సరితూగని సినిమా.

Manmadhudu 2 Movie Review: 2 Ups & 4 Downs | actioncutok.com

More for you: