Rakshasudu Movie Review: 4 Ups & 2 Downs


Rakshasudu Movie Review: 4 Ups & 2 Downs

Rakshasudu Movie Review: 4 Ups & 2 Downs

తారాగణం: బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల, శరవణన్, వినోద్ సాగర్, సుజానే జార్జ్, సూర్య, రాధా రవి, అమ్ము అభిరామి, దువా కౌశిక్

దర్శకుడు: రమేశ్‌వర్మ పెన్మెత్స

విడుదల తేదీ: 2 ఆగస్ట్ 2019

తమిళంలో ‘రాచ్చసన్’ పేరుతో విడుదలై హిట్టయిన సినిమాకు ‘రాక్షసుడు’ రీమేక్. ఫ్లాపుల్లో ఉన్న హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అదే పరిస్థితిని ఎదుర్కొంటూ కొంతకాలంగా సినిమాలు లేని డైరెక్టర్ రమేశ్‌వర్మ కలిసి పనిచేసిన ఈ సినిమా విడుదలకు ముందు పాజిటివ్ బజ్ సాధించింది. మర్డర్ మిస్టరీగా తయారైన ఈ సినిమా అంచనాలకు తగ్గట్లే ఉందా? సాయిశ్రీనివాస్ కెరీర్‌ను గాడిన పడేసే తీరులో ఉందా?

కథ

సినీ డైరెక్టర్ కావాలని కలల కంటూ కథలు పట్టుకొని నిర్మాతల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన అరుణ్ (బెల్లంకొండ సాయిశ్రీనివాస్) తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి ఒత్తిడికి తలొగ్గి పోలీస్ డిపార్ట్‌మెంట్లో ఎస్సైగా చేరతాడు. మొదటిరోజే ఒక టీనేజ్ అమ్మాయి హత్యకేసు ఎదురవుతుంది. అంతకు ముందు అదే తరహాలో ఒక హత్య జరిగిన విషయం తెలిసిన అరుణ్, తన పై అధికారిణి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఆ కేసుపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. కృష్ణవేణి (అనుపమ) అనే స్కూల్ టీచర్ పరిచయమవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. పై అధికారులకు విరుద్ధంగా ఒకర్ని రివాల్వర్‌తో కాల్చి చంపాడనే అభియోగంతో మూడు నెలల సస్పెన్షన్‌కు గురవుతాడు అరుణ్. కిల్లర్ నుంచి తన మేనకోడలు సిరి (అమ్ము అభిరామి)ని కూడా రక్షించుకోలేకపోతాడు. కృష్ణవేణి దగ్గరే పెరిగే ఆమె అక్క కూతురు కావ్య కిడ్నాప్ అవుతుంది. ఆ పాపను అరుణ్ కాపాడగలిగాడా? టీనేజ్ అమాయిల్ని చంపుతూ వస్తున్న సీరియల్ కిల్లర్‌ని కనిపెట్టగలిగాడా? ఈ ప్రశ్నలకు సమాధానం పతాక సన్నివేశాల్లో లభిస్తుంది.

కథనం

ఒరిజినల్ ఎలా ఉందో దాదాపు అలాగే తెలుగు వెర్షన్‌ను తీశాడు డైరెక్టర్ రమేశ్‌వర్మ. యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి ఎక్కువ మార్పులు చేయాల్సిన అవసరం కలగలేదు. పైగా ఒరిజినల్‌లో నటించిన నటులతోటి అవే పాత్రల్ని తెలుగులోనూ చేయించారు. ఆద్యంతమూ బిగువైన కథనంతో సినిమా ఉత్కంఠ కలిగిస్తుంది. ఒక వైపు అరుణ్ కేరెక్టర్‌నూ, అతని కథనూ బిల్డప్ చేస్తూ వచ్చిన దర్శకుడు మరోవైపు సీరియల్ మర్డర్స్‌తో కథలో టెన్షన్ నింపాడు.

డైరెక్షన్ చాన్స్ కోసం అరుణ్ పడే తపన, అతని కష్టాలు, అతని ఆవేదన చూస్తే ఇవాళ సినీ ఫీల్డులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అనేకమంది కష్టాలు అర్థమవుతాయి. గత్యంతరం లేక అతను పోలీస్ డిపార్ట్‌మెంట్లో చేరినా, అప్పటివరకూ సినిమా కథ కోసం తాను చేసిన రీసెర్చినీ, దాని ద్వారా తాను కనిపెట్టిన అంశాల్నీ ఎస్సైగా తన ఇన్వెస్టిగేషన్ కోసం అతను ఉపయోగించుకున్న తీరు కన్విన్సింగ్‌గా అనిపిస్తాయి.

హత్యలు ఎవరు చేస్తున్నారనే విషయాన్ని కనిపెట్టడానికి అరుణ్ తీవ్ర ప్రయత్నాలు చేయడం, అతని పైన ఉండే లేడీ ఆఫీసర్ అతన్ని చులకనగా చూస్తూ, అడ్డంకులు కలిగిస్తూ రావడంతో ప్రేక్షకుడిలో.. తర్వాత అరుణ్ ఏం చేస్తాడనే ఆసక్తి కలుగుతుంది. ఇవాళ సొసైటీలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యల నేపథ్యం, ఆ హత్యల్ని చిత్రీకరించిన విధానానికి ప్రేక్షకులు సహానుభూతి చెందుతారు. సిరి హత్యకు గురైందని తెలిసి, ఆమె మృతదేహాన్ని చూసినప్పుడు అరుణ్‌కూ, అతడి బావ (రాజీవ్ కనకాల)కూ మధ్య చిత్రీకరించిన సన్నివేశం హృదయాల్ని ద్రవింపజేస్తుంది. సినిమాలో అదొక హైలైట్ సీన్ అని చెప్పాలి. అయితే చివరి వరకూ కూడా సిరి చనిపోయిందనే విషయం సిరి తల్లికి తెలియనట్లు చూపించడం కన్విసింగ్‌గా అనిపించదు.

సీరియల్ కిల్లర్ ఎవరనే విషయంలో చివరి దాకా సస్పెన్స్ కొనసాగించడంలో డైరెక్టర్ సక్సెసయ్యాడు. కిల్లర్ ఎవరనే విషయం బయటపడక ముందు, బయటపడ్డాక ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లను మరింత ఉత్కంఠభరితంగా దర్శకుడు చిత్రించాడు. ఫస్టాఫ్‌లో మర్డర్ మిస్టరీపై ప్రేక్షకుల్లో కలిగే ఉత్కంఠను సెకండాఫ్‌లోనూ కొనసాగించడం వల్ల సినిమా థ్రిల్‌ను కలిగిస్తుంది. అదే సమయంలో టీనేజ్ అమ్మాయిలను అత్యంత క్రూరంగా చంపడం ప్రేక్షకుల్లో సానుభూతిని రేకెత్తించే అంశం. అయితే అమ్మాయిల్ని చంపే సన్నివేశాల్ని చూపకపోవడం నయమనిపిస్తుంది. డైరెక్టర్ రమేశ్‌వర్మ కెరీర్‌కు ఈ సినిమా బిగ్ రిలీఫ్.

Rakshasudu Movie Review: 4 Ups & 2 Downs

నటీనటుల అభినయం

సినిమాలో చెప్పుకోదగ్గ అంశం పాత్రలకు సరిగ్గా సరిపోయే నటీనటులు లభించడం. ఈ సినిమాతో అమితంగా లాభపడేది హీరో సాయిశ్రీనివాస్. అరుణ్ కేరెక్టర్‌లో పర్ఫెక్టుగా ఒదిగిపోయాడు. అతని యాక్టింగ్ స్కిల్స్‌పై ఇప్పటిదాకా వచ్చిన విమర్శలు అరుణ్ పాత్ర పోషణతో తొలిగిపోయినట్లే. హావ భావాల ప్రదర్శనలో అతను పరిణతి సాధించాడనేందుకు ‘రాక్షసుడు’ మంచి ఉదాహరణ. సిరి చనిపోయినప్పటి సన్నివేశం ఒక్కటి చాలు అతని నటన గురించి చెప్పడానికి. కృష్ణవేణి పాత్రలో అనుపమ ఎంతో హుందాగా కనిపించి, మెప్పించింది. అరుణ బావగా, పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా, కూతుర్ని కోల్పోయిన తండ్రిగా రాజీవ్ కనకాల ఉన్నత స్థాయి నటన ప్రదర్శించాడు.

పోలీసాఫీసర్ లక్ష్మిగా సుజానే జార్జి ఆకట్టుకుంటుంది. మిస్టరీ కిల్లర్‌గా తమిళ నటుడు శరవణన్ ప్రేక్షకుల్ని ఎంత భయపెట్టాలో అంతగా భయపెట్టాడు. తన దగ్గర చదువుకొనే అమ్మాయిలపైనే అత్యాచారాలకు ఒడిగట్టే స్కూల్ టీచర్‌గా వినోద్ సాగర్, పోస్ట్‌మార్టంలు నిర్వహించే డాక్టర్‌గా సూర్య, సిరిగా అమ్ము, కావ్యగా దువా కౌశిక్.. తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు.

చివరి మాట

ఒక నిఖార్సయిన మర్డర్ మిస్టరీకి ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అవన్నీ ఉన్న సినిమా ‘రాక్షసుడు’. సగటు ప్రేక్షకుడిని ‘రాక్షసుడు’ నిరాశపరచడు.

Rakshasudu Movie Review: 4 Ups & 2 Downs | actioncutok.com

More for you: