ప్రభాస్‌కి దూరదృష్టి ఎక్కువ.. అందుకే ‘సాహో’ చేశాడు!

ప్రభాస్‌కి దూరదృష్టి ఎక్కువ.. అందుకే ‘సాహో’ చేశాడు!
“ప్రభాస్‌కి దూరదృష్టి ఎక్కువ. ‘బాహుబలి’ సినిమా చేసేటప్పుడు.. దీని తర్వాత ఏ సినిమా చేయాలని తపన పడేవాడు. ‘బాహుబలి’ తర్వాత మరో పెద్ద డైరెక్టర్‌తో సినిమా చేయాలని కాకుండా సుజిత్ చెప్పిన కథను నమ్మి ‘సాహో’ సినిమా చేశాడు” అన్నారు ఇండియన్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన యస్.యస్. రాజమౌళి.
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. బాలీవుడ్ తార శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. యు.వి. క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘సాహో’ ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం రామోజీ ఫిలింసిటీలో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గోన్న రాజమౌళి మాట్లాడుతూ “సాధారణంగా ఏహీరో ఫ్యాన్స్ అయినా వారి హీరో సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటారు. కానీ ప్రభాస్ సినిమా హిట్ కావాలని అందరి హీరోల ఫ్యాన్స్ కోరుకుంటారు. ప్రభాస్ చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. తను ఎవరి గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడడు. అదే తనకి అంత మంది ఫ్యాన్స్‌ని సంపాదించిపెట్టింది. ఇప్పుడు ‘సాహో’ వస్తోంది. సుజిత్ చాలా చిన్న కుర్రాడు. ఇంత పెద్ద సినిమాను హ్యాండిల్ చేయగలడా? లేదా?.. అని చాలా మంది అనుకున్నారు. టీజర్కన్నా ముందు ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే చాలా మందికి అర్థమైపోయుండాలి. టీజర్ తర్వాత వచ్చిన ట్రైలర్‌తో సుజిత్ సామర్థ్యం ఏంటో అందరికీ అర్థమైపోయింది. తను చాలా బాగా చేశాడు. అంత పెద్ద టెక్నీషియన్స్, అంత పెద్ద బడ్జెట్‌ని, ప్రభాస్‌లాంటి ఆల్ ఇండియా స్టార్‌ని హ్యాండిల్ చేయడం అంత సులభం కాదు. తనే బ్యాక్‌బోన్‌లా నిల్చొని సినిమా తీశాడు. ప్రమోద్, వంశీలకు సింహాలు, పులులకు ఉండే గుండె ఉండాలి. ప్రభాస్ ఏమడిగితే అదిచ్చారు. అందరూ సుజిత్ కథను నమ్మారు. ఆగస్ట్ 30న వస్తోన్న సినిమా చాలా పెద్ద రేంజ్ రికార్డులు సాధిస్తుంది. నిర్మాతలకు వాళ్లు పెట్టినదానికి డబుల్, ట్రిపుల్ రావాలని కోరుకుంటున్నాను. ప్రభాస్ ఆల్ రెడీ ఆల్ ఇండియా స్టార్. తనని ఇక్కడి నుండి ఎంత ముందుకు తీసుకెళ్లగలిగితే అంత ముందుకు తీసుకెళ్లాలి” అని ఆయన చెప్పారు.
ప్రభాస్ లాంటి స్నేహితుడుంటే చాలు
డైరెక్టర్ వి.వి. వినాయక్ మాట్లాడుతూ “అందరికీ భయం ఉంటుంది కానీ.. యు.వి.క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీలకు మాత్రం భయం లేదు. అందుకు కారణం వారి వెనక ప్రభాస్ ఉన్నాడనే ధైర్యం. ప్రభాస్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళతారనే ధైర్యం. ‘బాహుబలి’ తర్వాత ఎలాగైతే రాజమౌళి గురించి ప్రపంచం అంతా మాట్లాడుకున్నారో.. ‘సాహో’ తర్వాత సుజిత్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకోవాలనుకుంటున్నాను. ప్రభాస్ మీ అందరికీ హీరోగానే తెలుసు. మా అందరికీ తనో గొప్ప స్నేహితుడు. తనలాంటి ఫ్రెండ్ మన జీవితంలో ఉంటే మనకేం అవసరంలేదు. ఫ్రెండ్స్‌కి అంత గొప్ప వేల్యూ ఇస్తాడు. ట్రైలర్ చూసి ఆల్ రెడీ పిచ్చెక్కిపోయింది. ఇప్పుడు సాంగ్ చూసి పిచ్చెక్కింది. ప్రభాస్ అంత సూపర్‌గా ఉన్నాడు. తన లుక్ అదిరిపోయింది. ఇప్పటి వరకు హిందీలో తొలి రోజు రూ.42 కోట్లు హయ్యస్ట్ షేర్ అంటున్నారు. ‘సాహో’కు రూ.50 కోట్లు షేర్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మన ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయినందుకు హ్యాపీగా ఉంది. తను ఇంకా తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాలి. రూ. 1000 కోట్లు, రూ. 2000 కోట్ల రూపాయల బడ్జెట్‌కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ప్రభాస్ నిజంగా ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడు
రెబల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ “నేను విన్నదాన్ని బట్టి, ప్రభాస్ ఇంటర్వ్యూస్‌లో చెప్పిన దాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మొదటి టీజర్ తర్వాత చాలా ఫోన్స్ వచ్చాయి. ప్రభాస్ ఇంకా కాసేపు కనపడి ఉండుంటే బావుండని అన్నారు. కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేసిన తర్వాత చాలా బావున్నాయని అన్నారు. తర్వాత టీజర్ విడుదల తర్వాత అహో, ఓహో అన్నారు. ట్రైలర్ విడుదల తర్వాత అబ్బో అన్నారు. అది ఇంటర్నేషనల్ లెవల్‌కి వెళ్లింది. హాలీవుడ్ లెవల్ స్థాయి సినిమాలకు పోటీగా నిల్చొనే గొప్ప సినిమా అని చాలా మంది చెప్పారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ఇక్కడకు వచ్చి రిహార్సల్స్ చేసుకుని స్టంట్స్ చేశారు. ప్రభాస్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సుజిత్ చిన్నవాడైనా శభాష్ అనిపించుకున్నాడు. సినిమా 150 శాతం అభిమానుల అంచనాలను మించేలానే ఉంటుంది. ఆగస్ట్ 30 తర్వాత మరో ‘బాహుబలి’ అంతటి పేరు వచ్చి ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడనే నమ్మకంతో ఉన్నాను” అన్నారు.
సుజిత్ అదృష్టవంతుడు
దిల్ రాజు మాట్లాడుతూ “నేను ప్రభాస్‌తో చేసిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కంటే యు.వి. క్రియేషన్స్ వాళ్లు ‘మిర్చి’ సినిమాను ఎక్కువ బడ్జెట్ పెట్టి చేశారు. అంత బడ్జెట్లో ఎందుకు సినిమా చేస్తున్నారని అడిగితే “మా ప్రభాస్ కోసం” అన్నారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ డేట్స్ ఇస్తే ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తుంది. ‘బాహుబలి 2’ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి ఈ సినిమాను చేశారు. మళ్లీ “ఎందుకు ఇంత బడ్జెట్?” అంటే.. “అన్నా ప్రభాస్ కోసమే” అన్నారు నిర్మాతలు. నేను వారిని చూసి ఆల్ ఇండియా సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటున్నాను. ఆగస్ట్ 30 కోసం వెయిట్ చేస్తున్నాం. సుజిత్ అదృష్టవంతుడు. రాజమౌళికి తెలుగు సినిమాను ఆల్ ఇండియా రేంజ్ మూవీగా చేయడానికి 15 ఏళ్లు పడితే, సుజిత్ రెండో సినిమాకే ప్రభాస్‌తో ఆల్ ఇండియా మూవీ చేశాడు. టీజర్ చూసి అతని విజన్‌కి ఆశ్చర్యపోయాను. టీజర్ చూస్తుంటే ప్రభాస్ ఏ రేంజ్లో కొట్టబోతున్నాడో అర్థమవుతుంది. ‘సాహో’ కూడా ఆల్ ఇండియా లెవల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద హిట్ కావాలి. తెలుగు సినిమా, తెలుగు ప్రజలు గర్వపడేంత హిట్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ఆ ధైర్యాన్నిచ్చింది రాజమౌళి
గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మాట్లాడుతూ “మామూలు హీరో అయిన ప్రభాస్ ‘బాహుబలి’తో ఆల్ ఇండియా స్టార్స్‌తో పోల్చే రేంజ్‌కి ఎదిగాడు. మన తెలుగువాడు, మన హీరో ఇంత పెద్దవాడు కావడం చాలా గర్వించదగ్గ విషయం. నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీలకు భయమేంటో తెలియదు. దానివల్ల వందల కోట్లు ఖర్చు పెట్టి ‘సాహో’ సినిమాను చేశారు. ‘ఇంత పెద్ద సినిమా రాలేదు.. ఇక ఎప్పటికొస్తదో’ అనే రేంజ్‌కి ఈ సినిమాని దర్శకుడు, నిర్మాతలు తీసుకెళ్లారు. వాళ్లకు ఆ ధైర్యాన్నిచ్చింది రాజమౌళి. తర్వలోనే రాబోతున్న ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ప్రభాస్ నాలో కాన్ఫిడెన్స్ పెంచారు
చిత్ర దర్శకుడు సుజిత్ మాట్లాడుతూ “సాధారణంగా ఫ్యాన్స్ అందరికీ ఉంటారు. కానీ ప్రభాస్‌కి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ‘బాహుబలి’ తర్వాత వెంటనే ప్రభాస్ సినిమా రావాలని కోరుకున్నా, మరోసారి రెండేళ్లు ‘సాహో’ కోసం వెయిట్ చేశారు. ప్రభాస్‌గారికి సినిమా అంటే ప్యాషన్. రాజమౌళిగారితో పనిచేసిన ప్రభాస్ ‘సాహ’ సినిమాలో నాతో వర్క్ చేశారు. నన్ను నమ్మి ప్రభాస్ అన్న.. సినిమా చేశాడు. ‘నువ్వు తీయగలుగుతావ్ డార్లింగ్’ అంటూ నాలో కాన్ఫిడెంట్‌ను పెంచారు. కథను నమ్మి నాతో వర్క్ చేసిన టెక్నీషియన్స్‌కు థ్యాంక్స్. జిబ్రాన్ నా సోదరుడితో సమానం. సినిమా కోసం ది బెస్ట్ ఔట్పుట్ ఇచ్చారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీలు నా అన్నయ్యల్లా నా పక్కన నిలబడ్డారు. నాపై ఎలాంటి ప్రెషర్ లేకుండా చూసుకున్నారు. హీరోయిన్గా శ్రద్ధాకపూర్ ఎంత కష్టపడిందో ట్రైలర్ చూస్తే అర్థమై ఉంటుంది. రేపు సినిమాలో చూస్తారు. తను తెలుగును చాలా కష్టపడి నేర్చుకుని మరీ నటించింది” అన్నారు.

సుజిత్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అవుతాడనిపించింది
ప్రభాస్ మాట్లాడుతూ “సినిమాలో ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ డైలాగ్స్ రాసింది డైరెక్టర్ సుజితే. తనకు మాస్ పల్స్ బాగా తెలుసు. మది నా కుటుంబ సభ్యుడిలా సపోర్ట్ చేశారు. సాబు సిరిల్గారిని నేను ఈ సినిమా చేయమని అడిగాను. కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర ప్రసాద్ గారు చేసిన సాయం చాలా పెద్దదే. కమల్ కణ్ణన్‌గారు సినిమాకు ఇంటర్నేషనల్ లుక్ తీసుకొచ్చారు. జిబ్రాన్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. సుజిత్ నిక్కరేసుకొచ్చి కథ చెప్పాడు. వంశీ, ప్రమోద్, విక్కీలు అప్పటికే కథ విన్నారు. వారికి నచ్చింది. సుజిత్ కథ చెప్పినప్పుడు తన వయసు 23 ఏళ్లు. నలభై ఏళ్ల వ్యక్తిలా కథ చెప్పాడు. సుజిత్ ఈ సినిమా కోసం చాలా ప్రీ ప్రొడక్షన్ చేశాడు. సినిమా షూటింగ్ సమయంలో పెద్ద పెద్ద స్టార్స్, టెక్నీషియన్స్ ను హ్యాండిల్ చేసిన విధానానికి గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిపోతాడనిపించింది. శ్రద్ధా కపూర్.. రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం పనిచేసింది. ఓ నటి ముంబై నుండి వచ్చి ఇక్కడ రెండేళ్లు పనిచేసింది. ఒక్క రోజు కూడా సమస్య రాలేదు. శ్రద్ధ లాంటి హీరోయిన్ ‘సాహో’కు దొరకడం మా అదృష్టం. తను సూపర్బ్ పెర్ఫామర్. యాక్షన్ సీన్స్ ఇరగదీసింది. గత సినిమా సమయంలో ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని మాటిచ్చా.. మిస్సయ్యా. కానీ ఈసారి మాట ఇవ్వకుండా ఏడాది రెండు సినిమాలు చేయాలనుకుంటున్నాను. వంశీ, ప్రమోద్, విక్కీ వంద కోట్ల లాభం వదులుకుని ఈ సినిమా చేశారు” అని చెప్పారు.
ఈ వేడుకలో హీరోయిన్ శ్రద్ధా కపూర్, నటులు అరుణ్ విజయ్, మురళీ శర్మ, రవివర్మ, నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీ, ఎం.ఎస్. ఆర్ట్ మూవీస్ అధినేత ఎం. శ్యాంప్రసాద్‌రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ‘జిల్’ డైరెక్టర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రభాస్‌కి దూరదృష్టి ఎక్కువ.. అందుకే ‘సాహో’ చేశాడు! | actioncutok.com
More for you: