Sye Raa Narasimha Reddy Teaser Reactions


Sye Raa Narasimha Reddy Teaser Reactions

Sye Raa Narasimha Reddy Teaser Reactions

“చరిత్ర స్మరించుకుంటుంది.. ఝాన్సీ లక్ష్మీబాయ్, చంద్రశేఖర ఆజాద్, భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాల్ని. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు” అంటూ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్‌తో మొదలైంది ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్. అవును.. ఎప్పుడెప్పుడా అని మెగాస్టార్ ఫ్యాన్స్ ఐదు రోజులుగా ఎదురు చూస్తూ వచ్చిన టీజర్ వచ్చేసింది. అదీ.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్‌తో.. ఐదు రోజుల క్రితం వచ్చిన ‘సైరా’ మేకింగ్ వీడియో అదిరిపోయేలా ఉంటే, టీజర్ దానికి మించి మరింత ఆకర్షణీయంగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి శూరత్వానికి నీరాజనాలు పట్టేలా ఉంది.

Here is the teaser for you:

టీజర్‌లో వచ్చే ప్రతి షాట్ రోమాలు నిక్కబొడుచుకొనేలా ఉందండంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక బ్రిటీష్ దొర “హూ ఈజ్ దిస్ నరసింహారెడ్డి?” అని ప్రశ్నిస్తే.. భగభగమండుతున్న సూర్యగోళం నేపథ్యంలో గుర్రంపై స్వారీచేస్తూ రేనాటి సూర్యుడిలా లాంగ్ షాట్‌లో ప్రత్యక్షమయ్యాడు నరసింహారెడ్డి. బ్రిటీష్ దొరకు సమాధానమిస్తూ అతని కింద పనిచేసే ఆఫీసర్ “సింహం లాంటోడు దొరా.. అతడే వాళ్ల ధైర్యం దొరా” అని చెప్పాడు.

ఏదో పెద్ద ఉత్సవం జరుగుతున్నట్లు, ఆ ఉత్సవంలో అఘోరాలవంటివాళ్లు కూడా పాల్గొన్నట్లు చూపించారు. నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ వెంటనే ఒక యుద్ధ సన్నివేశం.. ఎక్కడ్నించి, ఎటు నుంచి వచ్చాడో తెలుసుకొనే లోపలే గుర్రాలపైనున్న ఇద్దరు బ్రిటిష్ సైనికుల్ని చెరో చేత్తో ప్రచండ వేగంతో కింద పడేశాడు నరసింహారెడ్డి. కళ్లలో మహా రౌద్రాన్ని కురిపిస్తూ చేతులతో కాళ్లను తట్టాడు. చెరో ఒర నుంచి రెండు కత్తులు పైకి లేచి అతని చేతుల్లో ఇమిడాయి.

“రేనాటి వీరులారా చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ చరిత్ర ఈరోజు మనతోనే మొదలవ్వాలి” అని తన సహచరులకు పిలుపునిచ్చాడు నరసింహారెడ్డి. ఆ వెంటనే వీపు మీద అమర్చిన ఒరల్లోంచి రెండు కత్తుల్ని దూసి పట్టుకున్నాడు, చరిత్రను మొదలుపెట్టడానికి.

గోసాయి వెంకన్న, అవుకు రాజు, రాజా పాండీ, సిద్ధమ్మ, లక్ష్మి, వీరారెడ్డి పాత్రలు మనకు దర్శనమిచ్చాయి. ఆ వెంటనే బ్రిటిష్ సైనికులున్న ఒక ప్రదేశానికి గుర్రంపై చెట్లను చేదించుకుంటూ మహోగ్రరూపుడై దూసుకువచ్చాడు నరసింహారెడ్డి. రెండు పక్షాల నడుమ భీకర సంగ్రామం మొదలైంది. అరివీర పరాక్రమంతో శత్రు సైనికుల్ని చీల్చి చెండాడాడు నరసింహారెడ్డి. బ్రిటిషర్ల ఫిరంగి గుండ్లు దూసుకువస్తున్నా లెక్కచెయ్యకుండా కత్తులతో కుత్తుకలు తెగనరుకుతూపోయాడు. నేపథ్యంలో “సైరా నరసింహారెడ్డి” అనే సింహనాదానికి “సై సైరా” అని వంత వినిపిస్తుంది. ప్రళయకాల రుద్రుడిలా భీకర గర్జనలు చేస్తూ రెండు కత్తులతో నరసింహారెడ్డి కదన రంగంలో ముందుకు ఉరుకుతుండగా టీజర్ ముగిసింది. నరసింహారెడ్డిగా మెగాస్టార్ కనిపించిన తీరు, మహావీరుడిలా రణరంగంలో ఆయన కదులుతున్న, శత్రు సైనికుల్ని దునుమాడుతున్న తీరు చూస్తుంటే, ఎన్నడో ఆయనను స్టార్‌గా మార్చిన ‘ఖైదీ’ నాటి చిరంజీవి గుర్తుకు వస్తున్నాడు. ఆరు పదులు దాటిన వయసులో పాతికేళ్ల నవ యువకునిలోని శక్తిని ప్రదర్శిస్తున్నట్లుగా ఉన్నాడు. ‘సైరా’తో చిరంజీవి కెరీర్ మరో మలుపు తిరగబోతోందనేది ఖాయం.

గమనించాల్సిన విషయమేమంటే కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన మూవీ మేకింగ్ వీడియో నిడివి ఎంత ఉందో, సరిగ్గా అంతే నిడివితో.. అంటే 1 నిమిషం 47 సెకన్ల నిడివితో ఈ టీజర్‌ను రూపొందించారు. ఈ అతికొద్ది నిడివిలోని విజువల్స్ చూస్తుంటేనే ఒళ్లు జలదరించిపోతోందంటే, ఇక సినిమా మొత్తంగా ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే. యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ, ఆ విజువల్స్ చూస్తుంటే.. తెలుగు సినిమా మేకింగ్‌ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ‘బాహుబలి’ చరిత్రను ‘సైరా’ కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నిజం. ఇవాళ తెలుగు సినిమా ఎల్లలు చెరిపేసుకుంటూ, ఆకాశమే హద్దుగా పైపైకి ఎగబాకుతోంది. అందుకు ‘సైరా’ మరో మంచి ఉదాహరణ కాబోతోంది.

సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ‘సైరా’ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్‌పై రాంచరణ్ నిర్మిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి సుప్రసిద్ధ తారలు కీలక పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి అక్టోబర్ 2న వస్తోన్న ‘సైరా.. నరసింహారెడ్డి’కి ఎన్ని రికార్డులు పాదాక్రాంతమవుతాయో, తెలుగు సినిమా యవనికపై కొత్త చరిత్ర ఎలా లిఖింపబడుతుందో చూడాల్సిందే!

Sye Raa Narasimha Reddy Teaser Reactions | actioncutok.com

More for you: