‘ఆర్ఎక్స్ 100’ తర్వాత కార్తికేయ మళ్లీ కిక్కునిస్తాడా?


హీరోగా నాలుగు సినిమాలు.. మూడు ఫ్లాపులు, ఒక్కటే హిట్టు. అయినా కార్తికేయ గుమ్మకొండ యూత్‌లో క్రేజ్ ఉన్న స్టారే. ఒకే ఒక్క సినిమా ‘ఆర్ఎక్స్ 100’తో అతను రాత్రికి రాత్రే సెన్సేషనల్ హీరో అయిపోయాడు. హీరోగా అది అతనికి రెండో సినిమా. ఆ మూవీని నిర్మించింది అతని సొంత ప్రొడక్షన్ హౌసే. రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి డైరెక్టర్‌గా పరిచయమైంది ఆ సినిమాతోటే. తను బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సొంత బేనర్‌లోనే ఇప్పుడు మరోసారి సినిమా చేస్తున్నాడు కార్తికేయ.

“కిక్కిచ్చే టైటిల్‌తో మళ్లీ ఒచ్చేస్తున్నాం.. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ నుంచి ‘ఆర్ఎక్స్ 100’ వంటి సెన్సేషనల్ మూవీ తర్వాత మా రెండో ప్రొడక్షన్‌ను లాన్ చెయ్యడానికి ఇదే సమయం. ఆ క్రేజీ టైటిల్‌ను, ఫస్ట్ లుక్‌నూ మీతో షేర్ చేసుకోవడానికి వెయిట్ చెయ్యలేకపోతున్నా” అని అతను ట్వీట్ చేశాడు. టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ నెల 9న అనౌన్స్ చెయ్యనున్నట్లు అతను తెలిపాడు. ఈ సందర్భంగా అతను షేర్ చేసిన పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. ఒక బీరు బాటిల్, దాని పక్కనే పిల్లలు పాలు తాగే పాల పీక ఉన్న బాటిల్, అందులో పాలకు బదులు బీరు, దాన్ని అందుకోబోతున్న ఓ పసివాడి చెయ్యి.. ఇదీ ఆ పోస్టర్!

ఈ సినిమాకి శేఖర్‌రెడ్డి యెర్రా డైరెక్టర్. రైటర్ కూడా అతనే. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ పాటలు రాస్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’కు మ్యూజిక్ బిగ్ ఎస్సెట్ అయిన విషయం మనకు తెలుసు. అయితే దానికి మ్యూజిక్ ఇచ్చిన చైతన్ భరద్వాజ్, పాటలు రాసిన చైతన్య ప్రసాద్, శ్రీమణి, సిరాశ్రీలలో ఏ ఒక్కరూ ఈ మూవీకి పనిచేయకపోవడం గమనార్హం. పాటలన్నింటినీ చంద్రబోస్ రాస్తున్నారు. ‘రంగస్థలం’కు అద్భుతమైన సాహిత్యం అందించిన ఆయన వైపే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ మొగ్గు చూపాడు.

కార్తికేయ విషయానికి వస్తే.. సొంత బేనర్‌పైనే మరోసారి అతను నమ్మకం పెట్టుకున్నాడు. హీరోగా ఈ మూవీ తనకు రెండో బ్లాక్‌బస్టర్‌ని అందిస్తుందనే ఆశ అతనిలో బాగా కనిపిస్తోంది. 2017లో ‘ప్రేమతో మీ కార్తీక్’తో హీరోగా పరిచయమైన కార్తీక్్‌ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ డబ్యూ డైరెక్టర్ అజయ్ భూపతి అతనికి ఏకంగా సెన్సేషనల్ హిట్‌ని అందించాడు. ఆ మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, యూత్ ఆడియెన్స్‌లోనూ కార్తికేయ పేరు మారుమోగిపోయింది. కానీ ఆ మూవీతో వచ్చిన క్రేజ్‌ను తర్వాతి సినిమాలతో అతను క్యాష్ చేసుకోలేకపోయాడు. ఎన్నో ఆశలతో అతను చేసిన ‘హిప్పీ’, ‘గుణ 369’ సినిమాలు ఫ్లాపయ్యాయి.

ఈ నేపథ్యంలోనే విలన్‌గా నటించేందుకు వచ్చిన అవకాశాన్ని ఓకే చేశాడు. కారణం.. అందులో నాని హీరో కావడం. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’లో నానితో విలన్‌గా అతను ఫైట్లు చేశాడు. ఈ నెల 13న ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో నెగటివ్ రోల్‌లో కార్తికేయ ఎలా రాణిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.