‘జార్జి రెడ్డి’ ట్రైలర్ రివ్యూ


డేరింగ్ అండ్ డాషింగ్ స్టూడెంట్ లీడర్‌గా పేరు తెచ్చుకొని, పాతికేళ్ల వయసులోనే ప్రత్యర్థుల చేతుల్లో హత్యకు గురైన ‘జార్జి రెడ్డి’ బయోపిక్ వస్తోంది. ‘దళం’ ఫేం జీవన్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ దసరా సందర్భంగా విడుదలైంది.

జార్జి రెడ్డి…దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా మారిన పేరు. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జి రెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఊపిరిని అందిస్తూ వస్తోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగాడు జార్జి.

“పేదలు పేదలుగానే ఉండిపోతుంటే, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. దీనికి వ్యతిరేకంగా మన గొంతుకల్ని వినిపించాం. కానీ మన నిరసనలను ఎవరూ వినిపించుకోవడం లేదు.” అని నిజ జీవితంలో జార్జి రెడ్డి చెప్పాడు. ఆ మాటల్నే యథాతథంగా ఇందులోని జార్జి రెడ్డి చెపుతుండగా ట్రైలర్ ఆరంభమయ్యింది.

2 నిమిషాల 44 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో జార్జి రెడ్డి అత్యంత ధైర్యవంతుడిగా, దేనికీ తలవంచని ధీరోదాత్తుడిగా, నిమ్న వర్గాల ఆశాజ్యోతిగా, అదే సమయంలో కండబలాన్నీ ఉపయోగించే యాక్షన్ హీరోగా కనిపించాడు. యూనివర్సిటీ క్యాంపస్‌లో, హాస్టల్‌లో పెత్తనం చేసేవాళ్లపై తిరగబడి వాళ్లను చావగొట్టే వీరుడిగా మన ముందు జార్జి ప్రత్యక్షమవుతాడు.

చిన్నప్పట్నుంచే తల్లి ద్వారా భగత్ సింగ్, చేగువేరా వంటి విప్లవ వీరుల జీవితాలను చదివి ప్రభావితుడైన జార్జి.. అన్యాయాల్ని, అక్రమాల్ని ప్రశించే, ఎదిరించే తత్వాన్ని అలవరచుకున్నాడు. పెద్దయ్యాక రష్యన్ విప్లవాన్ని అధ్యయనం చేశాడు. అలాంటివాడు పెత్తందారుల దాష్టీకాల్ని ఎలా సహిస్తాడు? “అప్పర్ కేస్ట్ అంటే అసలు ఆలోచించకుండా కొడుతున్నాడు” అని ఒక పాత్ర చెప్పడాన్ని బట్టి జార్జి ఎవరి పక్షాన నిల్చున్నాడనేది స్పష్టం.

“స్కాలర్‌షిప్పులు రాకుండా చేసినా, ఏం చేసినా సరే గల్లా పట్టుకొని మరీ ప్రశ్నించండి” అని తోటి విద్యార్థులకు పిలుపునిచ్చాడు జార్జి. ఎన్ని గొడవల్లో తలదూర్చినా, చదువునెప్పుడూ ఆయన నిర్లక్ష్యం చెయ్యలేదు. ఎమ్మెస్సీలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆయన పరిశోధనా దృష్టి, అధ్యయన శక్తి చూసి, భవిష్యత్తులో గొప్ప సైంటిస్ట్ అవుతాడని ఆయన గురువులు, సహ విద్యార్థులు భావించేవారు.

“వాడి వంటినిండా 22 కత్తిపోట్లు.. అన్నింటికీ కారణం మీరే” అని ఒక కేరెక్టర్ ఎదుటివాళ్లతో చెప్పడాన్ని బట్టి, ఒక గొడవలో జార్జి అన్ని కత్తిపోట్లు తిన్నాడని తెలుస్తోంది. అయినా ఆయన తన పోరాటం ఆపలేదు. విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించడమే కాదు, రైతుల కష్టాలకు చలించిపోయి, వాళ్ల తరపునా గొంతు వినిపించాడు.

“రైజ్ యువర్ వాయిస్ బిఫోర్ ద ట్రూత్ డైస్” అని పిలుపునిచ్చిన జార్జి రెడ్డి ఆ మాటలకు అసలైన అర్థంలా నిలిచాడు. అందుకే పాతికేళ్ల ఆ యువకుడిని క్యాంపస్‌లోనే కిరాతకంగా ప్రత్యర్థులు హత్య చేశారు. ఆయన జీవితంలోని ఘటనలను ఆధారం చేసుకొని, ఇప్పుడు డైరెక్టర్ జీవర్ రెడ్డి మన ముందుకు ‘జార్జి రెడ్డి’ మూవీని తీసుకు వస్తున్నాడు.

మొత్తంగా ఒక ఫర్‌గాటెన్ స్టూడెంట్ లీడర్ స్టోరీతో వస్తున్న ఈ మూవీపై తాజా ట్రైలర్ ఆసక్తిని ఒక్కసారిగా పెంచేసింది. 1960, 70లలో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను ‘జార్జి రెడ్డి’ మూవీ కళ్లకు కట్టబోతోంది. రాంగోపాల్ వర్మ ‘వంగవీటి’ మూవీలో వంగవీటి మోహన రంగా కేరెక్టర్ చేసిన సందీప్ మాధవ్ అలియాస్ శాండీ ఈ మూవీలో జార్జి రెడ్డిగా నటించాడు. నిజ జార్జి రెడ్డి పోలికలు శాండీలో స్పష్టమవుతుండటం గమనార్హం.

జార్జి జీవితాన్ని తీర్చిదిద్దిన తల్లి పాత్రలో పేరుపొందిన మరాఠీ నటి దేవిక నటించారు. మరాఠీ మూవీ ‘నాల్’లో నటనకు బెస్ట్ చైల్డ్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్న శ్రీనివాస్ పోకలే.. ఈ మూవీలో చిన్ననాటి జార్జిగా కనిపించనున్నాడు. మన నటులు మనోజ్ నందం, శత్రు, చైతన్యకృష్ణ కీలక పాత్రలు చేశారు.

‘నాల్’ సినిమాకు డెబ్యూ డైరెక్టర్‌గా నేషనల్ అవార్డ్ పొందిన సుధాకర్ యెక్కంటి ‘జార్జి రెడ్డి’కి సినిమాటోగ్రాఫర్‌గా పనిచెయ్యడం మరో విశేషం. మైక్ మూవీస్, సిల్లీ మాంక్స్, త్రీ లైన్స్ సంస్థలు నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే సినిమాని రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.