‘మేళా’ (1948) మూవీ రివ్యూ

‘మేళా’ (1948) మూవీ రివ్యూ
తారాగణం: దిలీప్ కుమార్ (మోహన్), నర్గీస్ (మంజు), జీవన్, రెహమాన్, అమర్, రూప్ కమల్, అలాద్దిన్, అబ్బాస్, నూర్జహాన్, చందాబాయ్, ఖలీల్, బేబీ జుబేదా
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: అజ్మ్ బాజిద్పురి
సంగీతం: నౌషాద్
సినిమాటోగ్రఫీ: ఫాలీ మిస్త్రీ
ఎడిటింగ్: మూసా మన్సూర్
నిర్మాత-దర్శకుడు: ఎస్.యు. సన్నీ
బ్యానర్: వాడియా మూవీటోన్
విడుదల తేదీ: 9 ఏప్రిల్ 1948
‘మేళా’ ప్రేమగీతాలతో నిండిన చిత్రం. చిన్నతనం నుంచీ ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం కలిగి, అది ప్రేమగా మారి, ప్రేమ జీవనం కోసం తియ్యని కలలు కని, విధి వైపరీత్యం వల్ల ప్రేమ భగ్నమై ప్రాణాలు పోగొట్టుకున్న ప్రేమికుల గాథ ఈ చిత్రం.
మంజు (నర్గీస్) ఒక స్కూల్ మాస్టారు కుమార్తె. మోహన్ (దిలీప్ కుమార్) ఒక మిఠాయి దుకాణం యజమాని కొడుకు. వారి గ్రామ సరిహద్దుల్లోని కొండచరియ దగ్గరున్న పురాతన పరమేశ్వరుని విగ్రహం దాపున మొండిగోడల దగ్గర ప్రేమ విహారం చేస్తుంటారు ఆ ఇద్దరూ. ఈ కథలో ప్రేమ భగ్రం కావడానికి మోహన్‌కు జరిగిన ప్రమాదం కారణమవుతుంది. ఆ ప్రమాదానికి మోహన్‌తో ఒకప్పుడు కలిసి చదువుకున్న సహ విద్యార్థి కారణం. పెళ్లి విషయాలు కూడా నిర్ణయించే గ్రామ పంచాయితీలో మోహన్‌పై అతను అపవాదు వేస్తాడు.
ప్రమాదానికి లోనై హాస్పిటల్లో ఉన్న మోహన్, గాయం మాని ఇంటికి వచ్చేసరికి మంజు వివాహం ఓ ముసలోడితో జరిగిపోతుంది. దీని వెనుక ఉంది మోహన్ విరోధే. మంజు పెళ్లవడంతో భగ్న హృదయంతో నిద్రాహారాలు మాని విరాగిలా మారిపోతాడు మోహన్. మళ్లీ మంజు, మోహన్ తిరిగి కలుసుకోవడానికి కథకుడు కొన్ని సన్నివేశాలు కల్పించాడు.
ముసలి భర్త చనిపోయిన కొంత కాలానికి మంజు బాల్య స్నేహితురాలు వచ్చి మోహన్ ఎలాంటి దుర్గతిలో ఉన్నాడో చెబుతుంది. ప్రేమను సాఫల్యం చేసుకొమ్మని ప్రోత్సాహమిస్తుంది. మంజు మనసు ఊగిసలాడుతుంది. చివరకు ఓ తుఫాను రాత్రివేళ తమ ప్రేమ స్థావరాన్ని చేరుకొని తమ ఫేవరేట్ సాంగ్ పాడుతుంది. అది విని మోహన్ అక్కడకు వస్తాడు. అతను ఆమె సమీపానికి వస్తున్న కొద్దీ మంజు ఒక్కొక్క అడుగే వెనుకకు వేస్తూ, చివరకు లోయలోపడి ప్రాణాలు విడుస్తుంది. మంజును హత్య చేశాడనే నేరంపై కారాగారవాసం చేస్తాడు మోహన్.
జైలు నుంచి విడుదలయ్యాక, మోహన్ తిరిగి తమ ప్రేమ స్థావరానికి వెళతాడు. మంజు రూపం కళ్లముందు ఉన్నట్లు భ్రమిస్తాడు. ఆ రూపాన్ని అనుసరిస్తూ అతను కూడా అగాధంలో పడి మరణిస్తాడు.
నౌషాద్ సంగీతం, ముఖేష్, మహమ్మద్ రఫీ, షంషాద్ బేగమ్ గానం కలిసి ‘మేళా’ను మ్యూజికల్ హిట్‌గా నిలిపాయి. ఆ రోజుల్లోనే రూ. 50 లక్షలు వసూలు చేసింది. ఈ రోజుల్లో దాని విలువ లెక్కగడితే రూ. 340 కోట్లవుతుంది. ఈ సినిమా ఆధారంగానే తెలుగులో ఎన్టీఆర్, జమున ప్రధాన పాత్రధారులుగా ‘చిరంజీవులు’ (1956) చిత్రం రూపొందింది.

‘మేళా’ (1948) మూవీ రివ్యూ : actioncutok.com
More for you: