మూడేళ్ల నాటి టాలీవుడ్ డ్ర‌గ్ కేస్ ఏమైంది?


మూడేళ్ల నాటి టాలీవుడ్ డ్ర‌గ్ కేస్ ఏమైంది?

మూడేళ్ల నాటి టాలీవుడ్ డ్ర‌గ్ కేస్ ఏమైంది?

టాలీవుడ్‌ను డ్ర‌గ్ స్కాండ‌ల్ కుదిపేసి మూడేళ్లు పైగా గ‌డిచాయి. 2017లో టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వాడేవాళ్లే కాకుండా డ్ర‌గ్ డీల‌ర్లు కూడా ఉన్నారంటూ, అనేక‌మంది పేర్లు వినిపించ‌గానే తెలుగురాష్ట్రాలు షాక్‌కు గుర‌య్యాయి. ర‌వితేజ‌, చార్మి, పూరి జ‌గ‌న్నాథ్‌, న‌వ‌దీప్, ముమైత్ ఖాన్‌, త‌నీష్‌ వంటి సెల‌బ్రిటీల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటుచేసిన ‘సిట్’ (స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌) ఇంట‌రాగేట్ చేయ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. టాలీవుడ్‌తో ప్ర‌త్య‌క్ష లేదా ప‌రోక్ష సంబంధం ఉన్న 64 మందిని సిట్ విచారించింది. రెండేళ్ల త‌ర్వాత 2019లో ఆ సెల‌బ్రిటీల‌కు డ్ర‌గ్ రాకెట్‌తో ఎలాంటి సంబంధం లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చేశారు.

ఆ కేసుకు సంబంధించి నాలుగు చార్జిషీట్ల‌ను ‘సిట్’ ఫైల్‌ చేసింది. ఏమైన‌ప్ప‌టికీ, ఆ చార్జిషీట్ల‌లో ఏ ఒక్క సెల‌బ్రిటీ పేరును అది ప్ర‌స్తావించ‌లేదు. వాళ్ల‌ను కేవ‌లం ఇంట‌రాగేట్ చేసి, వ‌దిలేశార‌న్న మాట‌. మొద‌ట్లో సెల‌బ్రిటీల ప్ర‌మేయం ఉంద‌నేందుకు ప్రాథ‌మిక ఆధారాలున్నాయ‌ని పోలీసులు తెలిపారు. కానీ రెండేళ్ల త‌ర్వాత వాళ్ల‌కు క్లీన్ చిట్ ఇవ్వ‌డం చాలామంది క‌నుబొమ్మ‌లు ముడివేసేలా చేసింది. మొద‌ట డ్ర‌గ్ రాకెట్‌తో సంబంధ‌ముందంటూ ఆ సెల‌బ్రిటీల‌ను ఇంట‌రాగేట్ చేయ‌డ‌మేంటో, త‌ర్వాత అలాంటిదేమీ లేదు.. తూచ్ అని వ‌దిలేయ‌డ‌మేంటో ఎవ‌రికీ అర్థం కాలేదు.

ఆ ఘ‌ట‌న తెలుగు చిత్ర‌సీమ‌లోని వారంద‌రినీ భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేసింద‌నేది నిజం. పోలీసులు ఇంట‌రాగేట్ చేయ‌నున్న సెల‌బ్రిటీల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు వారి కుటుంబ‌స‌భ్యులు పొందిన ఆందోళ‌న వ‌ర్ణ‌నాతీతం. అయితే ఈ ఘ‌ట‌న కంటే చాలా కాలం ముందు ర‌వితేజ చిన్న త‌మ్ముడు భ‌ర‌త్ ఒక‌టికి రెండు సార్లు డ్ర‌గ్ కేసులో ప‌ట్టుప‌డ్డాడు. అప్పుడే టాలీవుడ్ ఉలిక్కిప‌డింది. ఆ టైమ్‌లో హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా ఉన్న ఎ.కె. ఖాన్ ఇండ‌స్ట్రీలోని పెద్ద‌ల‌ను పిలిచి హెచ్చ‌రించ‌డం చాలా మందికి తెలుసు.

మూడేళ్ల నాటి టాలీవుడ్ డ్ర‌గ్ కేస్ ఏమైంది? : actioncutok.com

More for you: