మొదటి రాత్రి (1950) మూవీ రివ్యూ

మొదటి రాత్రి (1950) మూవీ రివ్యూ
తారాగణం: జి. వరలక్ష్మి, చదలవాడ నారాయణరావు, కస్తూరి శివరావు, కె.ఎస్. ప్రకాశరావు, రంగస్వామి, వెంకుమాంబ, సరస్వతి.
డైలాగ్స్: తాపీ ధర్మారావు
మ్యూజిక్: పెండ్యాల నాగేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: బి.ఎస్. రంగా
నిర్మాత-దర్శకుడు: కె.ఎస్. ప్రకాశరావు
బ్యానర్: ప్రకాశ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 9 జూన్, 1950
‘మొదటి రాత్రి’ కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వం వహించిన, ప్రకాశ్ ప్రొడక్షన్స్ నిర్మించిన మొదటి చిత్రం. ప్రేక్షకులకు ఉల్లాసం కలిగిస్తూ, రోజువారీ జీవితంలో తటస్థించే ఘటనలలోని మంచి చెడులను, దృక్పథాలను వ్యాఖ్యానించే ఈ తరహా చిత్రాలు దీని కంటే ముందు ఒకట్రెండుకు మించి రాలేదు. ఈ విధంగా చూస్తే, సామాజిక ప్రయోజనం కలిగిన సినిమాని నిర్మించినందుకు నిర్మాతలూ, రూపొందించిన దర్శకుడూ అభినయందనీయులు.
మనోరమ, మంజు పాత్రలను జి. వరలక్ష్మి, దాసు పాత్రను చదలవాడ నారాయణరావు చాలా బాగా పోషించారు. ముఖ్యంగా నారాయణరావు నుంచి స్వాభావిక నటనను రాబట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. నాయక మేనత్తగా వెంకుమాంబ, రంగన్నగా రంగస్వామి పాత్రోచితంగా నటించారు. బాబు పాత్రను ప్రకాశరావు స్వయంగా చేయగా, శివయ్యగా కస్తూరి శివరావు చక్కగా చేశారు.
ఈ చిత్రంలో తాపీ ధర్మారావు రాసిన సంభాషణలు చాలా వరకూ సహజంగా అనిపిస్తాయి. అయితే పాటల ప్లేస్మెంట్ పంటికింద రాయిలా ఉందని చెప్పక తప్పదు. పెండ్యాల సమకూర్చిన సంగీతంలో విశేషంగా చెప్పుకోవాల్సింది లేకపోయినా, కొన్ని పాటలు వింటున్న కొద్దీ వినసొంపుగా, హాయిగా ఉంటాయి. వరలక్ష్మి పాడిన “సన్నగా తిన్నగా రారా వెన్నెల దొంగా” అనే పాట, దాసు పాత్రధారికి ఎం.ఎస్. రామారావు ఆలపించిన “జీవితము దుఃఖపూరితము” పాట మరింత బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చెప్పాల్సిన పని లేదు. ఘటక్ సెట్టింగ్స్.. ముఖ్యంగా గంధర్వలోకం పాశ్చాత్య ధోరణిలో ఉండి ఆకట్టుకోదు. నాట్యాలు కులాసాగా ఉన్నాయి. సినిమాకి బి.ఎస్. రంగా సినిమాటోగ్రఫీ ఎస్సెట్. హీరో హీరోయిన్ల క్లోజప్పులు, లొకేషన్ షాట్లు, మూవింగ్ షాట్లు అందంగా ఉన్నాయి.
దర్శకునిగా ప్రథమ ప్రయత్నమైనా ప్రకాశరావు మంచి నేర్పు చూపించారు. క్యారెక్టర్స్‌కు మంచి మూవ్మెంట్ ఇచ్చారు. అయితే సీన్లు సహజంగా ఉండేట్లు చేయడంలోనూ, వాస్తవ వాతావరణం కల్పించడంలోనూ ఆయన మరింత శ్రద్ధ చూపిస్తే బాగుండేది. అంతేకాదు.. రాత్రి, పగలు దృశ్యాల విషయంలో, కంటిన్యుటీ విషయంలో శ్రద్ధ వహిస్తే.. సినిమాలో లోపాలు తక్కువగా కనిపించేవి.
చివరగా ఓ విషయం తప్పకుండా ప్రస్తావించాలి. అది.. టైటిల్స్ వేసేటప్పుడు ప్రకాశ్ ప్రొడక్షన్స్ గుర్తుగా చూపించిన లైట్ హౌస్ గురించి. ఆ లైట్ హౌస్‌ను గుర్తుగా ఎంచుకోవడం, దానిని చక్కని వెలుగు నీడల ప్రసారంతో చూపడం దర్శకుని, ఛాయాగ్రాహకుని ప్రతిభకు నిదర్శనం.
మొదటి రాత్రి (1950) మూవీ రివ్యూ : actioncutok.com
More for you: