24 Kisses Review: 2 Ups and 5 Downs


24  కిస్సెస్ రివ్యూ

 రెండడుగులు ముందుకి ఐదడుగులు వెనక్కి

ఇదివరకు ‘మిణుగురులు’ వంటి చక్కని ప్రజయోజనాత్మక, అవార్డు విన్నింగ్ ఫిలిం తీసిన అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి నుంచి వస్తున్నరెండో సినిమా కావడంతో ’24  కిస్సెస్’పై ఒకింత ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తిని టైటిల్ ఇంకొంచెం పెంచింది. ‘మిణుగురులు’ సినిమాని రిలీజ్ చెయ్యడానికి నానా కష్టాలు పడ్డానని, ఇక్కడ తన సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని విమర్శలు కూడా అప్పట్లో గుప్పించాడు అయోధ్యకుమార్. సినిమాని ఒక తపనగా భావించే దర్శకుడనే అభిప్రాయాన్ని కలిగించాడు. ఈ నేపథ్యంలో అతడి నుంచి వచ్చిన  ’24  కిస్సెస్’పై ఆసక్తి కలక్కుండా ఎలా ఉంటుంది! మరి ఆయన సినిమా ఎలా ఉంది?

కథ

చిల్డ్రన్స్ ఫిలిమ్స్ మేకర్ అయిన ఆనంద్ కుమార్ (అరుణ్ ఆదిత్) ఫిలిం మేకింగ్ కోర్స్ చెయ్యడానికి వచ్చిన శ్రీలక్ష్మి (హెబ్బా పటేల్) ఆకర్షణలో పడతాడు. ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. ఆ ముద్దుల పరంపర కొనసాగుతుంది. ఈ ముద్దుల అనుభవాలను శ్రీలక్ష్మి గులాబీ పూలతో భద్రంగా దాచుకుంటూ ఉంటుంది. ఒకసారి ఆనంద్ గోవాకు వెళ్తూ శ్రీలక్ష్మిని కూడా తీసుకువెళ్తాడు. అక్కడ వాళ్లు శారీరకంగా కూడా ఒక్కటవుతారు. శ్రీలక్ష్మి పెళ్లి ప్రస్తావన తెస్తుంది. అయితే ప్రేమ, పెళ్లి వంటి బంధాల్లో చిక్కుకోవడం ఇష్టం ఉండదు ఆనంద్ కు. ఇదే విషయం ఆమెకు చెబుతాడు. ఆమెకు అతడి ప్రవర్తన మింగుడుపడదు. అతడికి దూరంగా జరుగుతుంది. అప్పుడు తానేదో కోల్పోతున్నట్లు ఆనంద్ గ్రహిస్తాడు. ఆమెను ప్రేమిస్తున్నానని కన్విన్స్ చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. సహ జీవన ప్రస్తావన తెస్తాడు. లోకంలో లక్షలాది పిల్లలు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక అనేక కష్టాలు పడుతున్నారు కాబట్టి తమకు పిల్లలు వద్దంటాడు. ఆమె సరేనని, ఇదే విషయం తన తండ్రి (నరేశ్)తో చెప్పి ఒప్పించమంటుంది. ఆనంద్ చెప్పినదానికి శ్రీలక్ష్మి తండ్రి ఒప్పుకున్నాడా? ఆనంద్, శ్రీలక్ష్మి ప్రేమకథ ఏ తీరానికి చేరింది? వాళ్ల కథలో ’24 కిస్సెస్’కు ఉన్న ప్రాధాన్యం ఏమిటి?.. అనేది మిగతా కథ.

కథనం

సహజీవనం అనే పాయింట్ చుట్టూ కథ నడపాలనేది దర్శకుడి ఆలోచన. దాని కోసం ముద్దుల్ని ఆశ్రయించాడు. ఆ ముద్దుల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టి, ప్రేక్షకుల్ని ఆకర్షించాలనుకున్నట్టు మనకు కనిపిస్తుంది. అయితే కథ నడవడానికి అతడు చిల్డ్రన్ ఫిలిం మేకింగ్ ను నేపథ్యంగా ఎంచుకున్నాడు. కథనంలో భాగంగా దానిలో ఉండే కష్టాలు, ఆ వాతావరణాన్ని చెబుతూ రావడం వల్ల, వాటితో సహానుభూతి చెందేవాళ్లు తక్కువ కావడం వల్ల దర్శకుడు చేజేతులా కథలో ఆసక్తిని తగ్గించేశాడు. ఫిలిం మేకింగ్ కు సంబంధించిన ఆ సన్నివేశాలన్నీ విసుగు తెప్పిస్తాయి. దాన్ని ముద్దు సన్నివేశాలతో కాంపెన్సేట్ చెయ్యాలని ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ అవి నష్ట నివారణకు ఏమాత్రం ఉపయోగపడలేదు. అవకాశం లభిస్తే స్త్రీతో సెక్స్ ను ఆస్వాదించడమే తెలిసిన ఆనంద్ మొదట శ్రీలక్ష్మి ప్రేమను, తర్వాత ఆమె పెళ్లి ప్రపోజల్ ను తిరస్కరించడం చూస్తే అతడి కుటుంబ నేపథ్యం ఏ అల్ట్రా మోడరన్నో అనుకుంటాం. కానీ అతడిది పేద కుటుంబం. ఒక విషాదాన్ని మోస్తూ అతడు ప్రేమ, పెళ్లి అనే భావనలకు విరుద్ధంగా వ్యవహరించడం ఆ పాత్ర చిత్రణలో దొర్లిన లోపం. హీరో కథలోని సబ్ ప్లాట్ ప్రేక్షకుల సానుభూతిని ఉద్దేశించి బలవంతంగా చొప్పించినట్లుగా ఉంది కానీ, కథలో ఇమిడినట్లు లేదు. తన అక్క కొడుకు తన కళ్ళముందే చనిపోతే, తనకు పెళ్లి, పిల్లలు వద్దనుకుంటున్నట్లుగా ఆనంద్ పాత్రను మలచడం కృతకంగా తోస్తుంది. కథనంలో ముద్దు సన్నివేశాలు మినహాయిస్తే ఆసక్తికరమైన సన్నివేశాలు ఏమున్నాయని చూస్తే.. ఏమీ కనిపించవు. తనకు శ్రీలక్ష్మి పరిచయం అయిన దగ్గర్నుంచి ఆనంద్ ఒక సైకియాట్రిస్ట్ (రావు రమేష్)ను కలవడం, అతగాడికి తన కథను విడతలు విడతలుగా చెప్పుకుంటూ రావడం ఎందుకో అర్థం కాదు. ఆనంద్ ఏమీ మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు కనిపించడు. మరెందుకు ఆనంద్ పదే పదే అతడిని కలుస్తుంటాడనేది పెద్ద ప్రశ్న. ఇది కథ నడకకు ఉపయోగపడక పోగా, మధ్య మధ్య ఆ నడకను అడ్డుకుంటున్నట్లు అనిపిస్తుంది. దానికి బదులు స్ట్రెయిట్ నెరేషన్ తో కథను నడిపితే ప్రయోజనం ఉండేది.

నటుల అభినయం

ఆనంద్ పాత్రలో అరుణ్ బాగా చేశాడు. పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకొని హావభావాలు బాగా ప్రదర్శించాడు. ముద్దు సన్నివేశాలకు కావాల్సిన తపనను ప్రదర్శించాడు. ఫిలిం మేకర్ గా సహజంగా కనిపించాడు. శ్రీలక్ష్మితో బ్రేకప్ అయ్యాక గడ్డాలు, జుట్టు పెంచుకొని ఆ పాత్రలోని పెయిన్ ను చూపించాడు. అయితే ఆ పాత్ర ప్రవర్తించే తీరు వల్ల మనం అతడి బాధతో సహానుభూతి చెందలేం. ఇందులో అతడి తప్పేమీ లేదు. ఆ పాత్రను దర్శకుడు మలచిన తీరులో ఆ తప్పుంది. శ్రీలక్ష్మి పాత్రను హెబ్బా పటేల్ సునాయాసంగా చేసేసింది. ముద్దు సీన్లలో అరుణ్ కంటే ఆమె మరింతగా రాణించింది. తక్కువ మేకప్ తో ఒక మధ్య తరగతి అమ్మాయి ఎలా కనిపించాలో అలా కనిపించింది. ఆనంద్ ప్రవర్తించే తీరు మింగుడు పడని సన్నివేశాల్లోనూ ఆమె నటనకు వంక పెట్టలేం. సైకియాట్రిస్టుగా రావు రమేష్ నటన గురించి చెప్పేదేముంది! డైలాగ్ ను ఎక్కడ విరచాలో, ఎక్కడ హైపిచ్ లో చెప్పాలో ఆయనకు కొట్టిన పిండి. ఒక అసందర్భ పాత్రను తనదైన శైలిలో మెప్పించాడు. కానీ చివరలో ఆ పాత్రకు పెట్టిన ట్విస్ట్ మరింత అసందర్భం. కథకు అవసరంలేనిది. శ్రీలక్ష్మి తండ్రి పాత్రకు నరేశ్ అతికినట్లు సరిపోయాడు. ఒక ఆడపిల్ల తండ్రి పడే ఆరాటాన్ని బాగా ప్రదర్శించాడు. హీరో స్నేహితుడి పాత్రను వినోదం కోసం ఉద్దేశించినట్లు కనిపించినా అన్షు అనే ఆ పాత్రధారి ఏమాత్రం వినోదాన్ని అందించలేకపోయాడు. హీరోయిన్ స్నేహితురాలి పాత్రధారి కూడా డిటోనే.

సాంకేతిక అంశాలు

టెక్నీకల్ గా సినిమా గురించి గొప్పగా చెప్పే అంశాలేమీ లేవు. హీరో ఆఫీసుకు సంబంధించిన మొదటి సన్నివేశాల్లో కెమెరా మూవ్మెంట్స్ డిస్టర్బింగ్ గా ఉన్నాయి. ఇండోర్ సన్నివేశాల్లోనే కాదు ఔట్ డోర్ సన్నివేశాల్లోనూ లైటింగ్ కు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోలేదు. దాంతో చాలా చోట్ల సన్నివేశాలు డల్ గా కనిపిస్తాయి. సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. సందర్భానుసారం వచ్చే పాటలు బాగానే ఉన్నాయి. 2 గంటల 22 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా బోర్ కొట్టిందంటే ఎడిటింగ్ లోపాలూ ఉన్నట్లేగా. ఫిలిం మేకింగ్ కు సంబంధించిన సన్నివేశాల్ని ఇంకా క్రిస్ప్ చేయాల్సింది.

చివరి మాట

దర్శకుడు మనదేశంలోని బాలలు ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను కూడా ఈ ముద్దు కథలో చెప్పడానికి యత్నించాడు కానీ ప్రధాన కథకు అది దూరంగా ఉండిపోయింది. జంతువులపై చూపే శ్రద్ధ మనుషులపై చూపించమని సందేశాన్ని ఇవ్వడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం ’24 కిస్సెస్’ మధ్య చిక్కుకుపోయింది. దాంతో ఈ సినిమా ఎవరికీ కొరగాకుండా పోవడానికి అన్నివిధాలా బాధ్యుడు దర్శకుడే.

– బుద్ధి యజ్ఞమూర్తి

23 నవంబర్ 2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *