Amar Akbar Antony Review – 3 Ups and 5 Downs


Amar Akbar Antony Review - 3 Ups and 5 Downs

అమర్ అక్బర్ ఆంటోని రివ్యూ

మూడడుగులు ముందుకి ఐదడుగులు వెనక్కి

విడుదల తేది: 16 నవంబర్ 2018రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూడో సినిమాలో కొత్తదనం ఏమైనా ఆశించినవాళ్లకు భంగపాటు తప్పదు. పాత పాఠాల నుంచి శ్రీను వైట్ల కానీ, రవితేజ కానీ కొత్తగా ఏమీ నేర్చుకోలేదనడానికి ‘అమర్ అక్బర్ ఆంటోని’ నిఖార్సయిన నిదర్శనం. ఒక హిట్టయిన సినిమా తరహాలో, అదే ఫార్ములాతో సినిమా చేస్తే ప్రేక్షకాదరణ దక్కుతుందనే ఆశతో అదే పాత ధోరణిలో, అదే మూసకథతో సినిమా తీస్తే ఎలా ఉంటుందనే దానికి కూడా అసలు సిసలు ఉదాహరణ ఈ సినిమా.

కథ

డిససోటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడే అమర్ (రవితేజ) కథ ఇది. అలాగే అదే తరహా జబ్బుకు గురైన ఐశ్వర (ఇలియానా) కథ కూడా. అమర్, ఐశ్వర్య కుటుంబాలు రెండూ ఒక్కటిగా, ప్రాణానికి ప్రాణంగా జీవిస్తుంటాయి. పెద్దయ్యాక అమర్, ఐశ్వర్యలకు పెళ్లి చెయ్యాలని ఆ కుటుంబాలు నిర్ణయించుకుంటాయి. పిల్లలు కూడా ఒకరంటే ఒకరికి ప్రాణంలా పెరుగుతుంటారు. ఫిడో అనే వాళ్ల ఫార్మా కంపెనీలో పనిచేసే నలుగురు ఉద్యోగులకు.. ఒక్కొక్కరికి 5 శాతం వాటా ఇచ్చి, భాగస్వాముల్ని చేసుకుంటారు అమర్, ఐశ్వర్య తండ్రులు. దుష్టులైన ఆ నలుగురూ కలిసి అమర్ పుట్టినరోజున బాంబు పేల్చి పెద్దవాళ్లను చంపేస్తారు. పిల్లలిద్దర్నీ తీసుకొని వాళ్ల ఆత్మబంధువు లాంటి జమాల్ అక్బర్ (సాయాజీ షిండే) అక్కడ్నుంచి పారిపోతాడు. ఈ క్రమంలో అమర్, ఐశ్వర్య వేరవుతారు. ఐశ్వర్య చనిపోయిందని అక్బర్, అతను చనిపోయాడని ఐశ్వర్య అనుకుంటారు. ఒక హత్య చేసి జైలులో 14 సంవత్సరాలు గడిపిన అమర్ శిక్షాకాలం పూర్తిచేసుకొని బయటకు వచ్చి తమ కుటుంబాన్ని నాశనం చేసిన దుష్టులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది మిగతా కథ. అక్బర్, అంటోనిలాగా అతడు ఎందుకు మారుతుంటాడనేది కథలో భాగం.

కథనం

ఇదొక పాత తరహా కథ. శ్రీను వైట్ల గతంలో తీసిన హిట్ ఫిలిం ‘దూకుడు’లో తన తండ్రిని దాదాపు చావు దాకా తీసుకెళ్లిన దుండగులపై మహేశ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడో మనకు తెలుసు. తన ఐడెంటిటీ బయటపడకుండా తెలివిగా బోల్తాకొట్టిస్తూ వాళ్లను అంతం చేస్తాడు మహేశ్. ఇక్కడ కూడా అదే ఫార్ములాను ఉపయోగించాడు దర్శకుడు. కాకపోతే అమర్ ఐడెంటిటీని బయటపెట్టేందుకు యత్నించే ఒక ఎఫ్‌బీఐ ఆఫీసర్ (అభిమన్యు సింగ్) పాత్రని సృష్టించాడు. ఆ పాత్రతో కథనంలో టెంపో తీసుకురావచ్చనేది దర్శకుడి ఆలోచన. అది కొంతవరకు పనికొచ్చింది కూడా. అయితే అక్బర్‌లాగా, ఆంటోనీలాగా అమర్ మారే సన్నివేశాలు ఎక్కువైపోవడం వల్ల కథ నడకకు అవే ఆటంకంగా మారాయి. పైగా వాటిని ఇంప్రెసివ్‌గా చూపించడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు. గ్లాసు పగిలితే చాలు అమర్ స్థానంలో అక్బర్ రావడం, ఎవరైనా దీనులు కనపడితే చాలు ఆంటోనీలాగా మారడం మొదట్లో బాగానే ఉన్నా, రాను రాను విసుగు తెప్పించాయి. ఐశ్వర్య కూడా పూజ అనే పేరుతో చలామణి అవడం, ‘ట్రస్ట్’ అనే పదం వినిపిస్తే చాలు ఆమె కోపావేశంతో తానేం చేస్తున్నదో తెలీనంతగా మారిపోవడం కథనాన్ని దెబ్బ తీశాయి.

పాత్రల చిత్రణ

అమర్ లక్ష్యం తన తల్లిదండ్రుల, ఐశ్వర్య తల్లిదండ్రుల హంతకుల్ని అంతమొందించడం. ఈ క్రమంలో మొదట్లోనే నలుగురు హంతకుల్లో ఒకడిని చంపేస్తాడు. తర్వాత నుంచీ అతడిలోని స్ప్లిట్ పర్సనాలిటీ లక్షణాలు మనకి కనిపిస్తూ వస్తాయి. అక్బర్‌గా మారాక అతడి చూపు, అతడి ప్రవర్తనలో వచ్చే మార్పు చిత్రంగా ఉంటుంది. అది ఎంటర్‌టైన్‌మెంట్‌ను కలిగిస్తుంటుంది. కానీ నిజానికి అక్బర్‌లా అతడు మారడానికి కారకుడైన జమాల్ అక్బర్ ప్రవర్తన అలా ఉండదు. అలాంటప్పుడు అక్బర్‌లా అమర్ ప్రవర్తన అలా ఎందుకు ఉంటుందనేది అంతుబట్టదు. అలాగే సైకియాట్రిస్ట్ అయిన డాక్టర్ మార్క్ ఆంటోనీలా మారడమూ కన్విన్సింగ్‌లా అనిపించదు. నిజమైన ఆంటోని (శుభలేఖ సుధాకర్)కీ, అమర్‌కూ మధ్య బంధం తెగి 14 యేళ్లు గడిచాక ఆంటోనీ సీట్లో అమర్ కూర్చొని ఆంటోనీలా వ్యవహరిస్తుంటే, నిజమైన ఆంటోనీ సిబ్బంది అతడికి ఎలా సహకరిస్తారనేది జవాబు దొరకని ప్రశ్న. పూజలా పరిచయమైన ఐశ్వర్యనూ, అమర్‌నూ చివరి దాకా దూరంగా ఉంచేయడంతో ఆ పాత్రల మధ్య కెమిస్ట్రీ పూర్తిగా మిస్సయిపోయింది. ఫలితంగా హీరోహీరోయిన్ల మధ్య అవసరమైన రొమాంటిక్ కనెక్షన్‌ను దర్శకుడే తెగ్గోట్టేశాడు. నలుగురు విలన్లు (తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్ వగైరా) వున్నా వాళ్ల విలనిజాన్ని బలంగా ఎస్టాబ్లిష్ చేయడంలోనూ శ్రీను వైట్ల ఫెయిలయ్యాడు. సునీల్, వెన్నెల కిశోర్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, గిరి, సత్యా పాత్రలతో వినోదం సృష్టించడంలో మాత్రం దర్శకుడు సఫలమయ్యాడు.

నటుల అభినయం

మూడు భిన్న స్వభావాలున్న పాత్రని రవితేజ తన అలవాటైన పద్ధతిలో చేసుకుపోయాడు. మూడు రకాల వ్యక్తులుగా నటనలో ఆ విలక్షణతను బాగానే ప్రదర్శించాడు. మూస కథ కావడం వల్ల అతడి నటన నిష్ఫలంగా మారింది. ఐశ్వర్య అలియాస్ పూజగా ఇలియానా చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించి మెప్పించింది. ఇదివరకు జీరో సైజులో కనిపించిన ఆమె ఇప్పుడు కాస్త ఒళ్లు చేసి నిండుగా ఉంది. ఆమె సౌందర్యానికి వంక పెట్టేదేముంది! పాత్ర పరిధి మేరకు అభినయాన్ని ప్రదర్శించ్ది. చాలా రోజుల తర్వాత సాయాజీ షిండే సరైన పాత్రలో కనిపించి రాణించాడు. ఒకప్పటి హీరోయిన్లు అభిరామి, లయ హీరో హీరోయిన్ల తల్లులుగా ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. విలన్లలో ఆదిత్య మీనన్ హావభావాలు మాత్రమే మెప్పించాయి. సునీల్‌ను సరిగా ఉపయోగించుకోలేదు. వెన్నెల కిశోర్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, సత్యా వినోదాన్ని పండించారు.

సాంకేతిక అంశాలు

సాంకేతికంగా సినిమా ఉన్నత స్థాయిలోనే ఉంది. ఛాయాగ్రహణం నైట్ ఎఫెక్ట్‌లో టాప్ క్లాస్. తమన్ నేపథ్య సంగీతానికి వంక పెట్టలేం. సన్నివేశం మూడ్‌కు తగ్గట్లుగానే ఉంది. వంక పెట్టాల్సింది కథన, సన్నివేశ కల్పనకే కానీ రీరికార్డింగ్‌కు కాదు. పాటల్లో ఒకటి తప్ప మిగతావి రాణించలేదు. సన్నివేశాల్లోని బలహీనత్వాన్ని ఎడిటింగ్ పట్టుకోలేకపోయింది. ఆర్ట్ డైరెక్షన్ బాగానే ఉంది.

చివరి మాట

మూస కథ, కథనంలోని లోపాలు, హీరో హీరోయిన్ల మధ్య మిస్సయిన రొమాంటిక్ యాంగిల్, రొటీన్ రివెంజ్ ఫార్ములా.. వెరసి ‘అమర్ అక్బర్ ఆంటోని’కి మైనస్‌లుగా మారి మొత్తంగా సినిమాని బలహీనపర్చాయి.

– బుద్ధి యజ్ఞమూర్తి
16 నవంబర్, 2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *