Litmus Test for ‘Taxiwala’
‘టాక్సీవాలా’ భవితవ్యం?
ఎన్నడో ఐదు నెలల క్రితం విడుదల కావాల్సిన విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సినిమా ఇప్పుడు విడుదలవుతోంది. ‘గీత గోవిందం’ కంటే ముందుగానే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘ది ఎండ్’ ఫేం రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని యు.వి. క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అయితే దీని గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కావడం వల్ల ‘గీత గోవిందం’ ముందుగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఆ చిత్రంతో విజయ్ ఇమేజ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో యూత్‌లో అమిత్ క్రేజ్ సంపాదించుకున్న అతను, ‘గీత గోవిందం’ తర్వాత మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కూ చేరువయ్యాడు. అయితే ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా విడుదలైన ‘నోటా’ ఫ్లాపై, విజయ్ జోరుకు అడ్డుగా నిలిచింది. ఇప్పుడు కొన్ని నెలలు ఆలస్యంగా వస్తున్న ‘టాక్సీవాలా’ భవితవ్యం ఎలా ఉంటుందోనన్న ఆందోళన విజయ్ అభిమానుల్లో కనిపిస్తోంది. కారణం.. ‘టాక్సీవాలా’ విడుదలకు పది రోజుల ముందుగానే పైరసీ కావడం. సెన్సార్ సర్టిఫైడ్ కాపీ పైరసీ అయ్యిందనే వార్తలతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా విజయ్‌కు లిట్మస్ టెస్ట్ లాంటిది. అతని కెరీర్ మరింత ఊపు అందుకోవాలంటే ‘టాక్సీవాలా’ విజయం సాధించాలి. ఈ సినిమా జయాపజయాలు తర్వాత వచ్చే ‘డియర్ కామ్రేడ్’ సినిమా పై పడటం ఖాయం.