NTR: On the way to creating history


NTR: On the way to creating history

‘ఎన్.టి.ఆర్’ చరిత్ర సృష్టిస్తాడా?

నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న ‘ఎన్.టి.ఆర్’ సినిమా రూపొందుతున్న తీరు ఇటు సినీ వర్గాలనూ, అటు సాధారణ ప్రేక్షకులనూ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. సినీ నాయకుడిగానూ, రాజకీయనాయకుడిగానూ మహోన్నత కీర్తి ప్రతిష్ఠల్ని ఆర్జించిన ఎన్టీఆర్‌గా ఆయన తనయుడు బాలకృష్ణ నటించడం ఒక విశేషమైతే, ఎన్టీఆర్ జీవితంతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తుల పాత్రల్ని పేరుపొందిన తారలు పోషిస్తుండటం ఇంకో విశేషం. ఆ లిస్ట్ చూస్తేనే ‘ఎన్.టి.ఆర్’ సినిమా ఏ స్థాయిలో నిర్మాణమవుతోందో అర్థమవుతోంది. హరికృష్ణగా ఆయన తనయుడు కల్యాణ్‌రాం, ఏఎన్నార్‌గా ఆయన మనవడు సుమంత్, చంద్రబాబునాయుడిగా రానా, ఎన్టీఆర్ భార్య బసవతారకంగా విద్యాబాలన్, సావిత్రిగా నిత్య మీనన్, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్, జయప్రదగా తమన్నా, ప్రభగా శ్రియ కనిపించనున్నారు. దర్శకత్వ బాధ్యతల్ని క్రిష్ చేపట్టాక పేరుపొందిన నటులు ఒక్కొక్కరుగా ఈ ఎపిక్‌లో భాగస్వాములవుతూ వస్తున్నారు. దీంతో ఈ సినిమాకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతూ వస్తోంది. క్రిష్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. తొలి భాగం ‘ఎన్.టి.ఆర్: కథానాయకుడు’ 2019 జనవరి 8న, మలి భాగం ‘ఎన్.టి.ఆర్: మహానాయకుడు’ ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి. ఇదివరకు బాలకృష్ణతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి చారిత్రక చిత్రాన్ని తక్కువ సమయంలో చిత్రీకరించి ఆశ్చర్యపరచిన క్రిష్.. ఇప్పుడు ‘ఎన్.టి.ఆర్’ బయోపిక్‌ను కూడా యమస్పీడుగా తీసేస్తూ యూనిట్ సభ్యులనందర్నీ అబ్బురపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఎన్.టి.ఆర్’ బాక్సాఫీసు వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించనున్నాడనే అంచనాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికీ ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నందున తప్పకుండా వసూళ్లపరంగా చరిత్ర సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు నమ్ముతున్నారు. అది ఏ స్థాయిలో ఉంటుందో మాత్రం ప్రస్తుతానికి ఊహాతీతంగా ఉంది. కథానాయకుడిగా, రాజకీయనాయకుడిగా చరిత్ర సృష్టించిన ‘ఎన్.టి.ఆర్’ ఇప్పుడు సినిమా రూపంలోనూ అదే రీతిలో చరిత్ర సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *